సేద్యానికి మొబైల్ సాయం
న్యూఢిల్లీ: దేశ వ్యవసాయ అభివృద్ధిలో ఇక మొబైల్ ఫోన్ కూడా కీలకపాత్ర వహించనుంది. పరిశోధనశాలలు, పంటపొలాలకు, శాస్తవ్రేత్తలకు, రైతులకు మధ్య ఉన్న అంతరాన్ని మొబైల్ ఫోన్లు తొలగించనున్నాయి. ఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. భారతీయ వ్యవసాయ రంగంపై మొబైల్ ఫోన్స్ సామాజిక, ఆర్థిక ప్రభావం అనే అధ్యయన పత్రాన్ని ఈ సంస్థ రూపొందించింది. పంటలు, ఎరువులు, మార్కెట్ ధరలు లాంటి వాటి వివరాలు తెలుసుకునేందుకు రైతులకు ఈ మొబైల్ ఫోన్లు ఎంతగానో ఉపకరిస్తున్నాయని ఈ అధ్యయన పత్రం వెల్లడించింది.ఎస్‌ఎంఎస్, వాయిస్ మెసేజ్‌ల ద్వారా అందే సమాచారం రైతులకు వారి అవసరాలకు తగ్గట్టుగా రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్‌ను ఇవ్వగలుగుతోందని తెలిపింది. రైతు సమాజంలోకి చొచ్చుకెళ్తున్న మొబైల్ ద్వారా రైతులు నూతన సాగు విధానాలను తెలుసుకుంటున్నారని పేర్కొంది. రైతులకు ఇప్పటికే అందిస్తున్న వివిధ సేవలు, శిక్షణ కార్యక్రమాలకు ఈ మొబైల్ సేవలు అనుబంధంగా నిలుస్తున్నాయని సంస్థ తెలిపింది. మొబైల్ ఫోన్లు కలిగిఉండడం వల్ల, వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నప్పటికీ ఇతరులు చేసే కాల్స్‌ను రిసీవ్ చేసుకోగలుగుతున్నామని, మిగతా ప్రపంచంలో కనెక్ట్ అయి ఉండగలుగుతున్నామని రైతులోకం భావిస్తోంది.
పంట తెగుళ్ళు లాంటి వాటి గురించి సలహా తీసుకునేందుకు ప్రత్యక్షంగా ప్రభుత్వ అధికారులను, శాస్తవ్రేత్తలను కలుసుకోలేకపోతున్న సందర్భాల్లో మొబైల్ ఫోన్లను ఉపయోగించి తగు సలహాలను రైతులు పొందగలుగుతున్నారు. రైతులు ఎక్కడో పొలానికి దూరంగా ఉన్నప్పటికీ, తమ సూచనలను ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా పొలంలో ఉండే పనివారికి తెలియజేయగలుగుతున్నారు. వ్యవసాయ ఉత్పాదనలతో లావాదేవీలు నిర్వహించే వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు కూడా మొబైల్ ఫోన్ల రంగప్రవేశంతో ఎంతో సంతోషంగా ఉన్నారు. వీటి వల్ల తాము రైతులను నేరుగా సంప్రదించగలుగుతున్నామని, వేగంగా సమాచార మార్పిడికి ఇవి తోడ్పడుతున్నాయని వారంటున్నారు.
రైతులు లారీల్లో సరకును మార్కెట్‌కు తరలించేటప్పుడు అనుకోని అవాంతరాలు ఏవైనా ఎదురైతే, ఆ సమాచారాన్ని మార్కెట్ ఏజెంట్లకు తెలియజేసేందుకు కూడా మొబైల్ ఫోన్లు ఎంతగానో సహకరిస్తున్నాయి. మార్కెట్‌లో ఆయా వ్యవసాయోత్పత్తులకు ఎంత ధర ఉందో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నారు. ఈ సమాచారాన్ని మరింత ప్రభావశీలకంగా ఉపయోగించుకోవాలంటే మాత్రం ఇతర మౌలిక వసతులు కల్పించడంతో పాటు రైతుల సాంకేతిక వినియోగ సామర్థ్యాలను పెంచక తప్పదని ఈ అధ్యయనపత్రం పేర్కొంది.