Wednesday, March 24, 2010

మాయదారి ఖర్చు 20 వేల కోట్లు

బెంగళూరు: సామాన్యంగా ప్రతి పైసా లెక్క చూసుకుని మరీ ఖర్చు చేసే భారతీయ వినియోగదారులు, తమకు తెలియకుండానే లెక్కకు అందని వ్యయాన్ని వేల కోట్ల రూపాయలలో చేస్తుంటారని ఒక అధ్యయనంలో తేలింది. ఇటువంటి మాయదారి ఖర్చు సంవత్సరం మొత్తం మీద వేల కోట్లలో ఉంటుందని క్రెడిట్ కార్డుల కంపెనీ వీసా నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.

ప్రపంచవ్యాప్తంగా వీసా ఈ విధమైన సర్వేని 12,000 మంది వినియోగదారులపై జరిపింది. భారత్‌లో 1,000 మంది వినియోగదారులను సర్వే చేసింది. ఉద్దేశపూర్వకంగా జరపని, లెక్కకు తేలని ఈ వ్యయాన్ని వీసా 'మిస్టరీ స్పెండింగ్ 'గా అభివర్ణించింది. భారతదేశంలో 18-24 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఇలా సంవత్సరానికి సుమా రు 24,000 రూపాయలు లెక్కతేలని ఖర్చు చేస్తూ ఉంటారని పేర్కొంది. 18-24 మధ్య వయసుండి ఇటువంటి ఖర్చు చేయగలిగే స్థోమత కలిగిన వారు దేశం మొత్తం మీది 100 కోట్ల జనాభాలో కోటి మంది ఉన్నా కూడా ఈ మొత్తం 20వేల కోట్ల రూపాయలను దాటి పోతుందని అంటున్నారు.

ఆహార పదార్ధాలు, గ్రాసరీస్ వంటి వాటి మీద 60 శాతం, పెద్దగా అవసరం లేని వాటి మీద 29 శాతం, సరదాకి బయట హోటళ్ళలో తినడానికి 28 శాతం మేరకు వీరు ఈ మిస్టరీ స్పెండింగ్‌ను చేస్తూ ఉంటారని తమ అధ్యయనం తేలినట్లు పేర్కొంది. భారతీయుల్లో అధిక శాతం మంది లెక్కకు అందిన చిల్లర ఖర్చు చేస్తూ ఉంటారని కూడా వీసా తెలిపింది.