Tuesday, March 2, 2010

ఇకపై ఇంటి రుణాలూ ఇస్తాం

ఇకపై ఇంటి రుణాలూ ఇస్తాం
ప్రత్యేక హౌసింగ్‌ కంపెనీ ఏర్పాటు చేస్తాం!
ఈ రుణాల్లో చిన్న ఉద్యోగులకు పెద్దపీట
స్థలం తనఖాపైనా అప్పులిచ్చే యత్నాలు
బంగారం తాకట్టు రుణాలకు ప్రాధాన్యం
దేశవ్యాప్తంగా ఆర్థిక సేవల విస్తరణ
రాష్ట్రంలో మరో 50 శాఖలు
2010-11కి రూ.4000 కోట్ల వ్యాపార లక్ష్యం
ముత్తూట్‌ సీఈఓ మనోమోహనన్‌తో 'న్యూస్‌టుడే' ఇంటర్వ్యూ
బంగారంపై అప్పు అనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేర్లలో ముత్తూట్‌ గ్రూప్‌ ఒకటి. దీనికి రెండు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు)లు ఉన్నాయి. వాటిలో ఒకటైన ముత్తూట్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ పలు రకాల ఆర్థిక సేవలు అందిస్తూండగా.. రెండోదైన ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ బంగారం తాకట్టుపై రుణాలు జారీ చేయడంలో అగ్రగామిగా ఉంది. కేరళకు చెందిన ఈ గ్రూపు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. భారీ భవిష్యత్తు ప్రణాళికలను నిర్దేశించుకుంటోంది. ఈ నేపథ్యంలో ముత్తూట్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ సీఈఓ ఆర్‌. మనోమోహనన్‌ 'న్యూస్‌టుడే'కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బంగారం తాకట్టు రుణాల్లో బహుముఖంగా విస్తరించనున్నామని చెప్పారు. అంతేకాదు సరికొత్త ఆర్థిక సేవలతో వినియోగదార్లకు దగ్గర కానున్నామని చెబుతున్నారు.
న్యూస్‌టుడే: ముత్తూట్‌ గ్రూపు కార్యకలాపాలను దేశమంతటా విస్తరించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా
మనోమోహనన్‌: గ్రూపులోని రెండు బ్యాంకింగేతర సంస్థలకు 11 రాష్ట్రాల్లో 780 శాఖలు ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి 1200 శాఖలతో దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నాం. ముత్తూట్‌ గ్రూపు ఇక కేవలం కేరళకే పరిమితమైన వ్యాపార సంస్థ కాదు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు విస్తరించాం. కొద్దికాలంలోనే దేశవ్యాప్తంగా కార్యకలాపాలు ఉన్న సంస్థగా ఎదుగుతాం.

? ఆంధ్రప్రదేశ్‌లో మీ సంస్థకున్న శాఖలు, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉన్నాయి...
ఆంధ్రప్రదేశ్‌లో మాకు 100కు పైగా శాఖలు ఉన్నాయి. దీన్ని 150కి పెంచాలని నిర్ణయించాం. అన్ని రకాల ఆర్థిక సేవలు ఈ శాఖల నుంచి వినియోగదార్లకు అందిస్తున్నాం. అంతేగాకుండా వాయిదాల పద్ధతిలో బంగారం కొనుగోలుకు వీలుకల్పించే 'స్వర్ణ వర్షం' పథకాన్ని అమలు చేస్తున్నాం. బీమా పాలసీల విక్రయం, అన్ని రకాల రుణాలు అందించడం, డిబెంచర్ల జారీ వంటివి మరికొన్ని ముఖ్యమైన సేవలు.

? సరికొత్త సేవలు అందించే దిశగా ఆలోచనలు ఉన్నాయా....
వినియోగదార్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన సేవలు అందించడానికి మేం సిద్ధంగానే ఉంటాం. లీజ్‌ ఫైనాన్స్‌, స్థలాల తనఖాపై రుణాలు కొత్తగా చేపట్టాలని యోచిస్తున్నాం. అంతేగాక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అవ్యవస్థీకృత రంగంలో ఉన్న చిన్న, మధ్యతరహా సంస్థల వ్యాపారావసరాలకు రుణాలు అందించే పథకాలనూ సిద్ధం చేస్తున్నాం.

? ఈ వ్యాపారంలో నిరర్థక ఆస్తుల సమస్య అధికం. దీన్ని మీరు ఎలా అధిగమిస్తున్నారు.
అతితక్కువ నిరర్థక ఆస్తులు మాత్రమే మాకు ఉన్నాయి. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడం, వినియోగదార్ల గత చరిత్ర ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం, సమగ్ర పర్యవేక్షణ ద్వారా రుణ ఆస్తులు నిరర్థక ఆస్తులు కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఉదాహరణకు మేమిచ్చే బంగారం రుణాల్లో నిరర్థక ఆస్తులు 1 శాతంలోపే. అదే ద్విచక్ర వాహనాల విషయంలో అరశాతం కంటే తక్కువగానే రాని బాకీలు ఉంటాయి.

? భవిష్యత్తు వ్యాపార లక్ష్యాలేమిటి?
2011 మార్చి నాటికి 1200 శాఖల సంఖ్యను చేరుకోవాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా బంగారం తాకట్టుపై రుణాల విభాగంలో రూ.4,000 కోట్ల వ్యాపార లక్ష్యాన్ని చేరుకోవాలని, ద్విచక్ర వాహనాలపై రూ.150 కోట్ల రుణ లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటున్నాం. ఇతర సేవల్లోనూ వచ్చే అయిదేళ్ల కాలానికి భారీ లక్ష్యాలే ఉన్నాయి. గృహ రుణాల కోసం ప్రత్యేకంగా ఒక హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీని నెలకొల్పాలని అనుకుంటున్నాం. అన్ని హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల మాదిరిగా కాకుండా చిన్న, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యంగా ఉద్యోగులకు గృహరుణాలు ఇవ్వడం ఈ నూతన హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ స్థాపనలోని ప్రధానోద్దేశం.

? భవిష్యత్తులో వృద్ధి ఏ విభాగం నుంచి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు...
గ్రూపు మొత్తం వ్యాపారంలో బంగారం తాకట్టు రుణాల వాటా అధికం. దీని ప్రాధాన్యం కొనసాగుతూనే ఉంటుంది. అదే సమయంలో కమిషన్‌ ఆదాయం అధికంగా వచ్చే ఆర్థిక సేవలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాం. దీనికోసం పలు నూతన సేవలు అందించడానికి కృషి చేస్తున్నాం