ప్రాంతాన్ని బట్టీ మార్పు
తొలిసారిగా 'డైనమిక్ ప్రైసింగ్'కు శ్రీకారం
హైదరాబాద్, న్యూస్‌టుడే: మొబైల్ టెలికాం రంగంలో యూనినార్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా 'డైనమిక్ ప్రైసింగ్'ను ప్రవేశపెట్టింది. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నామో ఆ ప్రదేశం, సమయాన్ని బట్టి కాల్ రుసుము ఉంటుంది. ఇది స్థానిక కాల్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. కంపెనీ ప్రవేశపెట్టిన కొత్త పథకం '24X7 బదలత్తా డిస్కౌంట్ ప్లాన్' (డీపీ) ప్రకారం చందాదారులు చేసే ఫోన్ కాల్స్‌పై 5 శాతం నుంచి 60 శాతం వరకు రాయితీ లభిస్తుంది. కాల్‌కు నిమిషానికి రూ.50 పైసలు వసూలు చేసే ఈ పథకంలో 90 రోజులకు రూ.48 చెల్లిస్తే చందాదారులు 60 శాతం వరకు రాయితీ పొందుతారని యూనినార్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దుష్యన్ వైద్యనాథన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, కర్ణాటకల్లో ఈ పథకాన్ని ముందుగా ప్రారంభిస్తున్నారు. తర్వాత కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిగిలిన 5 సర్కిళ్లకు విస్తరిస్తారని అన్నారు. గరిష్ఠ రాయితీతో నిమిషానికి 20 పైసలకే మాట్లాడవచ్చు. తప్పనిసరిగా కనీసం 5 శాతం రాయితీ ఉంటుంది. ఒకే ప్రదేశంలో గంటగంటకు రాయితీ శాతం మారుతుంది. మొబైల్ ఫోన్‌లోని సెల్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్‌ను 'ఆన్'లో ఉంచితే.. ఆయా ప్రదేశాల్లో ఆయా సమయంలో ఉన్న రాయితీ శాతం డిస్‌ప్లే అవుతుంది. రాయితీ శాతంపై చందాదారులకు ఎప్పటికప్పుడు మెసేజీలు అందుతూ ఉంటాయి. ఎలా పని చేస్తుంది: ప్రతి టవర్ వద్ద ట్రాఫిక్ తీరును పరిశీలించే 'ఇంటలిజెంట్ రియల్ టైమ్ వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ కాల్ ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు విశ్లేషించి ప్రతి గంటకు అక్కడ నుంచి చేసే కాల్స్‌పై రాయితీ రేటును నిర్ణయిస్తుంది. చందాదారులకు తక్కువ ధరకు కాల్ చేసుకునే అవకాశం కల్పించడంతోపాటు కంపెనీకి కూడా దీని వల్ల ప్రయోజనం ఉంటుంది. నెట్‌వర్క్‌ను సమర్థంగా వినియోగించుకోవడానికి వీలుంటుంది. కాల్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సాయంత్రం 6-8 మధ్య రద్దీని తగ్గించడానికి, ఇతర ప్రాంతాలకు మళ్లించడానికి దోహదం చేస్తుంది. సేవల నాణ్యత పెరుగుతుంది. 'ఒక టవర్ పరిధి నుంచి మరో టవర్ పరిధిలోకి వెళ్లినప్పుడు ప్రారంభమైన చోట రాయితీనే కొనసాగుంది. దక్షిణాఫ్రికా సహా వివిధ దేశాల్లో 20 మంది ఆపరేటర్లు డీపీ పథకాన్ని అమలు చేస్తున్నారు. మూడు నెలలు పరిశీలించిన అనంతరం దీన్ని ప్రవేశపెట్టామ'ని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ మార్కెటింగ్ అధిపతి సతీశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం తమ నెట్‌వర్క్ సామర్థ్యంలో 10-20 శాతాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నామని, భవిష్యత్తులో రద్దీ పెరిగినప్పటికీ.. కొత్త టవర్లు అవసరం లేకుండా సామర్థ్యాన్ని గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవడానికి ఈ పథకం దోహదం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో మార్చి చివరి నాటికి యూనినార్‌కు 4.6 లక్షల మంది చందాదారులు ఉన్నారు.