కేంద్రం స్పష్టీకరణ

ఇటు ఐసీఐసీఐ బ్యాంక్‌లో, అటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.. ఈ రెండిటిలో విదేశీ బ్యాంకులు, విదేశీ సంస్థాగత మదుపర్లు సహా విదేశీ వాటా 74 శాతానికి పైగా ఉంది. 'నిర్వచనం ప్రకారం చూస్తే, దేశం వెలుపలి ఈక్విటీ 74 శాతం వరకు ఉన్నందున అవి తప్పకుండా భారతీయుల యాజమాన్యంలోని బ్యాంకులు కావు' అని సింగ్ వ్యాఖ్యానించారు. అయితే వాటిలో ఎక్కువ మంది డైరెక్టర్లు భారతీయులు అయి ఉండి, రైట్ టు డైరెక్టర్‌షిప్ భారతీయుల అధీనంలో ఉన్నపుడు భారతీయుల నియంత్రణలో ఉన్న బ్యాంకులుగా వాటికి అన్వయం చెప్పుకోవచ్చు. ''వాటి సమస్యను పరిష్కరించే మార్గం ఉంది. ఆ పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తాం. ప్రతిబంధకాన్ని తొలగించేందుకు చూస్తాం'' అని సింగ్ అన్నారు.
ఏదైనా భారతీయ కంపెనీలో పరోక్ష ఎఫ్‌డీఐలు 50 శాతానికి మించితే అలాంటి కంపెనీ, తన అనుబంధ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులను విదేశీ పెట్టుబడిగానే పరిగణించనున్నట్లు గత సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఎఫ్‌డీఐ నిబంధనల ప్రకారం తాము భారతీయ బ్యాంకులమేనని ఈ బ్యాంకులు వాదించడం ప్రాధాన్యం సంతరించుకొంది. అంతే కాకుండా, ఏ భారతీయ కంపెనీలో అయినా పరోక్ష ఎఫ్‌డీఐని లెక్క గట్టేటపుడు మొత్తం ఎఫ్‌డీఐ రూపంలో వచ్చింది, ప్రవాస భారతీయుల వాటా, అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్, గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్, విదేశీ కరెన్సీలోకి మార్చుకోదగ్గ బాండ్లు, మార్పిడికి అనువైన ప్రిఫరెన్స్ షేర్లు వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ఐసీఐసీఐ బ్యాంక్‌కు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు బీమా సంస్థలు కూడా ఉన్నాయి. బీమా సంస్థల్లో ఎఫ్‌డీఐ గరిష్ఠంగా 26 శాతానికి మించకూడదన్న నిబంధన అమలవుతోంది.