Monday, May 3, 2010

నిబంధనలు అడ్డంపెట్టి 26 వేల గ్యాస్‌ కనెక్షన్లు రద్దు


నిబంధనలు అడ్డంపెట్టి 26 వేల గ్యాస్‌ కనెక్షన్లు రద్దు
మరో 3 లక్షల మందికి నోటీసులు
చమురు సంస్థల అవకాశవాదం
పేరు బదిలీకి అవకాశం ఇవ్వరు
బెంబేలెత్తుతున్న వాడకందారులు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
వినియోగదారుణ్ణి అవమానించడం చమురు సంస్థలకే చెల్లింది. పదేళ్ల క్రితం చమురు సంస్థలు ఇప్పటి సెల్‌ఫోన్‌ కనెక్షన్లలాగా అడిగినవారికి కాదనకుండా గ్యాస్‌ కనెక్షన్లను ఇచ్చాయి. చమురు రంగాన్ని ప్రైవేటీకరిస్తున్న తరుణంలో ఎన్ని కనెక్షన్లు ఉంటే అంతగొప్ప. మూడు ప్రభుత్వరంగ చమురు సంస్థలూ పోటీపడి కొత్త గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చి మార్కెట్లో తమ వాటా పెంచుకున్నాయి. అప్పటిదాకా 'పర్మిట్‌ రాజ్‌'లో గ్యాస్‌ కనెక్షన్లు దొరక్క అల్లాడిన మధ్య తరగతి ప్రజలు ఎందుకైనా మంచిదని రెండు మూడు కనెక్షన్లు తీసుకున్నారు.

తర్వాత కాలంలో ప్రైవేటీకరణ ఆగిపోయింది. పదేళ్లు కాల గర్భంలో కలిశాక తిరిగి మూడు సంస్థల గుత్తాధిపత్యం స్థిరపడింది. దాంతో గౌరవ వినియోగదారుడు కాస్తా చమురు సంస్థల దృష్టిలో సబ్సిడీలు మింగే దొంగ అయ్యాడు. సబ్సిడీల భారం తగ్గించుకొనే పేరుతో చమురు శాఖ పాత నిబంధనలు బయటికి తీసింది. కొత్త నిబంధనలు అదనంగా చేర్చింది. ఒకటికి మించిన కనెక్షన్లున్న వినియోగదారులకు నోటీసులు పంపుతోంది. ఇళ్లకు వచ్చి తనిఖీలు చేస్తోంది. పేరు ఒకటే అన్న కారణాన్ని చూపి హఠాత్తుగా వినియోగంలో ఉన్న కనెక్షన్లు రద్దు చేస్తోంది. ఇప్పటికే ఇలా 26 వేల కనెక్షన్లను రద్దుచేసింది. మరో మూడు లక్షల కనెక్షన్ల వినియోగదారులకు మీ కనెక్షన్‌ ఎందుకు రద్దు చేయరాదంటూ నోటీసులు పంపింది. వాటిని వినియోగించుకుంటున్న సామాన్యుడు ఇప్పుడేం చేయాలి?

* ఒకే వ్యక్తి పేరుతో ఒకటికి మించిన వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉంటే మిగతావి చెల్లవు. ఇది పాత నిబంధన. ఇప్పటిదాకా అమలు చేయలేదు.

* ఒకే ఇంట్లో(వంటగదిలో) ఒకరికన్నా ఎక్కువ మంది పేర్లతో రెండు, మూడు వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉంటే చెల్లవు. ఒకటి ఉంచుకొని మిగతావి త్యాగం చేయాల్సిందే. ఇది కొత్త నిబంధన. 2010 జనవరి నుంచే అమల్లోకి వచ్చింది.

వంటగ్యాస్‌ సబ్సిడీల భారంతో అల్లాడుతున్న చమురు సంస్థలు ఈ రెండు నిబంధనలను నిక్కచ్చిగా అమలు చేయాలని నిర్ణయానికి వచ్చాయి. తొలి నిబంధనను ఏడాది క్రితమే అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నించగా వినియోగదారులు గగ్గోలు పెట్టారు. దాంతో కనెక్షన్లు కత్తిరించే కార్యక్రమం ఆగిపోయింది. కొత్త నిబంధన అండతో చమురు సంస్థలు ఈ ఏడాది జూలు విదిల్చాయి. నోటీసులు సంధించాయి. దాంతో చాలా మధ్య తరగతి కుటుంబాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చమురు సంస్థల తాజా ప్రయత్నం వల్ల లక్షల మంది మధ్య తరగతి ప్రజలు వంటగ్యాస్‌ను ఎలాంటి అక్రమ అవసరాలకు ఉపయోగించక పోయినా కనెక్షన్లను కోల్పోయే ముప్పు ఏర్పడింది.

కనెక్షన్‌ కోసం దరఖాస్తుచేసిన వారి ఇంటి చిరునామాకువెళ్లి సంబంధిత వ్యక్తికి అప్పటిదాకా గ్యాస్‌ కనెక్షన్‌ లేదని నిర్ధారించుకున్న తర్వాతే కొత్త కనెక్షన్‌ మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశం మేరకు చమురు కంపెనీలు ఈ నిబంధనలేవీ పాటించకుండా అడిగిన వారందరికీ లక్షల సంఖ్యలో కొత్త కనెక్షన్లు ఇచ్చాయి. ఇప్పటికే కనెక్షన్‌ ఉన్నవారికి కొత్త కనెక్షన్‌ ఇవ్వబోమని ఎవరికీ చెప్పలేదు. దాంతో రాష్ట్రంలోని చాలా మధ్య తరగతి కుటుంబాల వారు భవిష్యత్తులో పిల్లల అవసరాలను గుర్తెరిగి తమపేరుతోనే రెండేసి కనెక్షన్లు తీసుకున్నారు. కొంతమంది భార్య పేరుతో రెండో కనక్షన్‌ తీసుకున్నారు. ఈ పదేళ్లలో పిల్లల పెళ్లిళ్లు, వేరు కాపురాలతో కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి. కొత్త కనెక్షన్‌ దొరకడం గగనమైన నేపథ్యంలో ఉన్న రెండో కనెక్షన్‌ను వేరుపడిన కుటుంబీలకు ఇచ్చి వాడుకుంటున్నారు. నిజానికి ఇక్కడ ఎలాంటి దుర్వినియోగం జరగడం లేదు. వంటింటి అవసరాలకే గ్యాస్‌ వినియోగం అవుతోంది. ముందు జాగ్రత్తగా ఆయా కుటుంబాలు తీసుకున్న అదనపు కనెక్షన్ల వల్లే డీలర్లు ఎక్కువ కోటా సరుకు డిమాండ్‌ చేయగలుగుతున్నారని, అది నల్లబజారుకు వెళుతోందని భావిస్తున్న చమురు సంస్థలు అదనపు కనెక్షన్లపై వేటు వేసేందుకు సిద్ధం అయ్యాయి. నిజానికి ఇలాంటి దుర్వినియోగాన్ని అరికట్టడానికి వేరే పద్ధతులెన్నో ఉన్నాయి.

పేరు బదిలీ చేస్తే చాలు
ఈ నిబంధనను అమలు చేయడానికి కూడా మధ్యతరగతి కుటుంబీకులు అభ్యంతరం చెప్పడం లేదు. తమ రెండో కనెక్షన్‌ను వివాహం అయి వేరుగా ఉంటున్న పిల్లల పేర బదిలీ చేయాలని మాత్రమే కోరుతున్నారు. అయిదేళ్లగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రభుత్వ కూడా తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని రెండేళ్లుగా చమురు శాఖకు లేఖలు రాస్తోంది. ఎలాంటి స్పందన లేదు.

కంపెనీల ప్రతినిధులు నోటీసులు ఇచ్చిన ఇళ్లకువెళ్లి ప్రత్యక్ష పరిశీలన చేస్తున్నారని, అన్ని రకాలుగా నిర్ధారించుకున్న తర్వాతే 26 వేల కనెక్షన్లను రద్దు చేశారని, ఆ కనెక్షన్లకు గ్యాస్‌ సిలెండర్ల సరఫరా కూడా నిలిపేశామని ఒక చమురు సంస్థ ప్రతినిధి చెప్పారు. నోటీసులు ఇచ్చిన మూడు లక్షల కనెక్షన్ల పరిశీలన పూర్తయ్యేసరికి నోటీసుల సంఖ్య మరిన్ని లక్షలు పెరుగుతుందని అంచనా వేశారు.

మూడు ప్రభుత్వరంగ చమురు సంస్థల గ్యాస్‌ కనెక్షన్ల డేటా ఇంకా అనుసంధానం చేయలేదు. ఇప్పుడు ఒక చమురు సంస్థ పరిధిలో ఒకరికి రెండు, మూడు కనెక్షన్లు ఉంటే తొలగిస్తున్నారు. రేపు అన్ని చమురు సంస్థల డేటా అనుసంధానం జరిగితే ఒకే వినియోగదారుడు వేర్వేరు కంపెనీల దగ్గర కనెక్షన్లు తీసుకున్నా బయటపడుతుంది. ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.