సెజ్‌లతో 25 లక్షల మందికి ఉపాధి: సీఎం
హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల ద్వారా రూ.70 వేల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని ముఖ్యమంత్రి రోశయ్య పేర్కొన్నారు. సోమవారం విశాఖపట్నంలో బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీని ప్రారంభించనున్న సందర్భంగా, ఆ కార్యక్రమంపై ఆదివారం ఆయన చేనేత శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి కన్నాలక్ష్మీనారాయణ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామ్‌బాబులతో టెలిఫోన్‌లో చర్చిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికి 73 ఆర్థిక మండళ్ల ద్వారా రూ.14,700 కోట్ల పెట్టుబడులు, లక్ష మందికి ఉపాధి సమకూరిందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలో కొత్తగా కోక్ ప్లాంటు, గ్లాస్ పరిశ్రమ, స్టీలు ప్లాంటు, రంగుల పరిశ్రమ, ఫెర్రో అల్లాయ్స్ యూనిట్ల స్థాపనకు కొత్తగా ప్రతిపాదనలు అందాయని చెప్పారు. ఆర్థికమాంద్యం ఉన్నా బ్రాండిక్స్ సంస్థ రూ.6 వేల కోట్లతో నిర్ణీత కాలవ్యవధి మేరకే ఉత్పత్తిని ప్రారంభించి, స్థానికులకు ఉపాధి కల్పించడం అభినందనీయమని అన్నారు. బ్రాండిక్స్ పరిధిలోని యూనిట్లన్నీ పూర్తయితే మొత్తం 60 వేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. పీసీపీఐఆర్ ద్వారా విశాఖ- కాకినాడల మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటవుతుందన్నారు. హైదరాబాద్‌లో ఐటీ, దాని అనుబంధ సేవల ద్వారా ఇప్పటికే రూ.25,497 కోట్ల పెట్టుబడులు సమకూరాయని, 4.64 లక్షల మందికి ఉపాధి కలిగిందని చెప్పారు.