Monday, May 3, 2010

ప్రభుత్వోద్యోగ వ్యవస్థను మింగుతున్న అవుట్‌ సోర్సింగ్‌


2020 కల్లా సగం ఉద్యోగాలు ఖాళీ
ప్రభుత్వోద్యోగ వ్యవస్థను మింగుతున్న అవుట్‌ సోర్సింగ్‌
వూడ్చేవాళ్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లతో మొదలు
లక్ష దాటిన తాత్కాలిక ఉద్యోగులు
మారిపోతున్న ఉద్యోగ ముఖచిత్రం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రో పదేళ్లలో రాష్ట్ర వృద్ధిరేటు రెండు అంకెలు దాటి పరుగులు తీసేందుకు ప్రణాళికలు రచించుకున్నాం. ఆ ప్రకారం చూస్తే రాష్ట్ర బడ్జెట్లు వూహించని భారీ మొత్తాలతో ఉంటాయి. కానీ అప్పటికి రాష్ట్రంలో సగం మంది ప్రభుత్వోద్యోగులు పదవీ విరమణ చేయబోతున్నారు. ఇప్పటికే ఏటా 18-20 వేల మంది ఉద్యోగ విరమణ చేస్తున్నారు. గత ఆరేళ్లలో 60 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినా భర్తీ చేసింది నామమాత్రం. ఉద్యోగులే లేకపోతే మరి లక్షల కోట్ల బడ్జెట్‌ను ముందుకు తీసుకెళ్లేదెవరు? ఉద్యోగ ముఖచిత్రం మారిపోతున్నట్టుగా ప్రస్పుటమవుతున్నా ప్రభుత్వం ఇలాంటి ప్రధాన సమస్యల జోలికి వెళ్లటమే లేదు. కొన్ని ఖాళీలను ఏకంగా రద్దుచేస్తూ మరికొన్నింటిని కేవలం కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో నింపుతోంది. జీతాల ఖర్చును తగ్గించుకోవాలనే ధ్యాసే తప్ప పనిలో జవాబుదారీతనం, సామర్థ్యం కొరవడుతున్నాయనే వ్యాకులతే ఉండటం లేదు.

రాష్ట్రంలో ఇప్పుడు ఏ కార్యాలయానికి వెళ్లినా అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులే ఎక్కువగా కనిపిస్తున్నారు. గతంలో కేవలం కంప్యూటర్‌ ఆపరేటర్లు, స్వీపర్లు వంటి కొద్దిపాటి పోస్టులకే వీరు పరిమితమయ్యే వారు. ఇప్పుడు అతికీలక బాధ్యతలను నిర్వహించే ముఖ్య కార్యదర్శుల వద్ద సహాయక పోస్టుల్లో సైతం అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే దర్శనమిస్తున్నారు. ప్రభుత్వం కొన్నిచోట్ల కొత్తగా పోస్టులను ఏర్పాటుచేసినా వాటినీ ఇలా తాత్కాలిక ఉద్యోగులతోనే నింపుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు లక్ష దాటినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆర్టీసీ వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో వీరి సంఖ్య మరీ ఎక్కువ. తాత్కాలిక ఉద్యోగుల కారణంగా కొన్ని ముఖ్యమైన శాఖల్లో జవాబుదారీతనం లోపిస్తోందనే విమర్శలు పెరుగుతున్నాయి. కీలకమైన ఫైళ్లు వీరి ఆధ్వర్యంలోనే ఉంటున్నాయి. టెండర్ల ద్వారా వివిధ సంస్థలు సరఫరాచేసే ఉద్యోగుల్ని అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులని, ఆయా శాఖలే నేరుగా నియమించుకొనే వారిని కాంట్రాక్టు ఉద్యోగులని వ్యవహరిస్తారు. చాలా తక్కువ వేతనానికే వీరంతా వస్తుండటంతో ఖజానాపై జీతభత్యాల భారం క్రమేణా తగ్గనున్నప్పటికీ అదే సమయంలో పలు పాలనాపరమైన సమస్యలూ లేకపోలేదు. ప్రభుత్వోద్యోగి తప్పుచేస్తే ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది కనుక అతను ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు. ఇలాంటి భయం తాత్కాలిక ఉద్యోగుల్లో సహజంగానే ఉండదు. స్వీపర్లు వంటి కొన్ని స్థాయిల్లోని పోస్టులకు వీరిని పరిమితంచేసి మిగతా పోస్టులను మాత్రం శాశ్వత ఉద్యోగులను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉన్నతాధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. పలు విభాగాల్లో ప్రధానాధికారిగా ప్రభుత్వ ఉద్యోగిని నియమించి మిగతా పోస్టులన్నింటినీ అవుట్‌ సోర్సింగ్‌ వారితో నింపే ధోరణి క్రమేణా పెరుగుతోంది. కొత్తగా 300 బాలికల హాస్టళ్లను ప్రారంభిస్తుండగా హాస్టల్‌లో మహిళా అధికారి తప్ప మిగతా ముగ్గురు సిబ్బందికూడా అవుట్‌ సోర్సింగ్‌ ద్వారానే నియమితులు కాబోతున్నారు. కొత్త ఐటీఐలలో 781 మంది శిక్షణ అధికారులను టెండర్ల ద్వారానే నియమించబోతున్నారు. స్థానిక సంస్థలన్నీ క్రమేణా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వైపే పయనిస్తున్నాయి.

కారణం ఇదీ!
ఖజానాపై జీతభత్యాల భారాన్ని తగ్గించుకోవటానికే ప్రభుత్వం ఇలా తాత్కాలిక ఉద్యోగులకు పెద్దపీట వేస్తోంది. ఉదాహరణకు ఐటీఐలో నియమించబోతున్న శిక్షణ అధికారికి సర్కారు నెలకు కేవలం రూ.6,200తో సరిపెడుతుంది. అదే శాశ్వత ఉద్యోగైతే రూ.18 వేలు ఖర్చవుతుంది. సచివాలయంలోని అతి కీలకశాఖ ముఖ్య కార్యదర్శి వద్ద సహాయకుడికి జీతం రూ.5,500. అందులో పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి వాటికి రూ.వెయ్యిపోగా అతని చేతికి రూ.4,500 వస్తోంది. మిగతా వారీ పరిస్థితీ ఇలాగే ఉంది. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారు రూ.5 వేలు, వంట పనివారు రూ.3,900 చొప్పున మాత్రమే అందుకొంటున్నారు. స్వీపర్‌కు కనీస వేతనాల చట్టం కూడా అమలు కావటంలేదు. కేవలం రూ.1,295 లభిస్తోంది. తొమ్మిదో వేతన సంఘం కారణంగా ప్రభుత్వోద్యోగుల జీతాలు బాగా పెరిగాయి. ఆ వేతన సంఘం కార్యాలయంలోనే పలువురు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు అరకొర జీతాలతో పని చేయటం విశేషం. ఎప్పటికైనా ఉద్యోగం ఖాయం అవుతుందనే ఆశ, ఇక ప్రత్యామ్నాయాలు లేకపోవటం, ప్రభుత్వ పోస్టులో ఉండటాన్ని గౌరవప్రదంగా భావించటం వంటివి తాత్కాలిక ఉద్యోగాలకు ఎగబడేట్లు చేస్తున్నాయి. కొంతమంది ఉన్నతాధికారులు తమకు కావాల్సిన వారిని అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు పద్దతుల్లో నియమించుకొని తమ కార్యకలాపాలను చక్కబెడున్నారనే అభియోగాలు కూడా లేకపోలేదు. ఒక ముఖ్య కార్యదర్శి తాను ఏ శాఖకు బదిలీఅయితే ఆ శాఖకు కాంట్రాక్టు సహాయకుడిని వెంట తీసుకెళ్తుంటారు.

పదేళ్లలో 2.60 లక్షల మంది పదవీ విరమణ
ద్యోగుల ప్రస్తుత వయస్సులను బట్టి 2020 నాటికి రాష్ట్రంలో 2.60 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు ఉద్యోగ విరమణ చేస్తారని అంచనా. 2006 నాటికి ఉద్యోగుల వయస్సులు ఇలా ఉన్నాయి.
ఇక ఉద్యమిస్తాం
రాష్ట్రంలో అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య క్రమేణా పెరిగిపోతోంది. తాత్కాలిక నియామకాల విధానానికి మేం వ్యతిరేకం. తప్పనిసరైతే అవుట్‌ సోర్సింగ్‌ను పూర్తిగా పక్కనపెట్టి కాంట్రాక్టు విధానాన్ని చేపట్టాలి. దీనివల్ల అధికారులు నేరుగా అర్హులను ఎంపిక చేసుకోవటానికి వీలవుతుంది. అవుట్‌ సోర్సింగ్‌ అయితే టెండర్‌ పొందిన సంస్థ ఎవరిని సరఫరా చేస్తే వారితోనే పని చేయించుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉద్యమం చేపట్టనున్నాం. 10న ఒక సదస్సు నిర్వహిస్తున్నాం'
ఉద్యోగుల ఐకాస ప్రతినిధి దేవీ ప్రసాద్‌