Monday, May 3, 2010

మామిడి 'అర'కొరే..!

ఉత్పత్తిలో 40 శాతం క్షీణత
రూ.1700 కోట్ల మేర రాబడికి గండం
ఆందోళనలో అన్నదాత
వినియోగదారుడి జేబుకూ చిల్లు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రతి వేసవిలో తీయని రుచులు పంచే మామిడి ఈసారి చేదెక్కింది. ఆరుగాలం శ్రమించి, పెట్టుబడి పెట్టిన అన్నదాత నడ్డివిరుస్తోంది. గణనీయంగా 40శాతంమేర మామిడి దిగుబడి క్షీణించడంతో రూ.1700 కోట్ల రాబడికి గండిపడనుంది. మరోవైపు అధిక ధరలతో ఇటు వినియోగదారుడి జేబుకూ చిల్లుపెడుతోంది. వాతావరణ మార్పులు, ఏడాది పొడవునా కరవు, డిసెంబరు, జనవరి మాసాల్లో కురిసిన మంచు, తాజాగా కురిసిన వడగళ్ల వాన, గాలిదుమారం రైతుల పాలిట అశనిపాతమయ్యాయి. వెరసి 40 శాతం పంట దిగుబడులకు గండిపెట్టాయి. గత సంవత్సరం 42.35 లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడికాయలు రాష్ట్రంలో ఉత్పత్తికాగా, ఈ దఫా దాదాపు 17లక్షల టన్నులమేర ఉత్పత్తి తగ్గిపోనుందని ఉద్యానశాఖ ప్రాథమిక అంచనాకొచ్చింది. ప్రస్తుతం గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో మామిడికాయలకు సగటున టన్ను రూ.16 వేల చొప్పున ధర పలుకుతోంది. టన్నుకు పదివేల రూపాయల చొప్పున నష్టం వేసుకున్నా మొత్తంమీద రూ.1700 కోట్ల మేర రైతులకు నష్టం వాటిల్లనుంది.

రాష్ట్రంలో సాగు వివరాలివి..
రాష్ట్రంలో దాదాపు 12.30 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. గతేడాది ఎకరాకు 3.5 టన్నుల మేర దిగుబడి రాగా 42.35 లక్షల టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అయ్యాయి. ప్రస్తుతం అదే స్థాయిలో మామిడి సాగుచేస్తున్నా.. ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోనుంది. కృష్ణా జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్న బంగినపల్లి మామిడిపండ్లు రెండేళ్ల కిందట వరకు ఎకరాకు 4 టన్నుల వరకు దిగుబడి వచ్చేది. ఈ సంవత్సరం టన్ను కాయలు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. సగటున ఎకరాకు 2 టన్నులు వచ్చే అవకాశం ఉందని ఉద్యాన శాఖ అంచనాకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల టన్నులకు మించి దిగుబడి వచ్చే అవకాశం కనిపించడం లేదని పేర్కొంది. మామిడి విక్రయాలకు పేరొందిన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు గత ఏడాది ఏప్రిల్‌లో 2.10 లక్షల క్వింటాళ్ల మామిడికాయలు మార్కెట్‌కు రాగా ఈ సంవత్సరం అదే నెలలో 1.70 లక్షల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రత్యేక కార్యదర్శి ఎల్లయ్య 'న్యూస్‌టుడే'కి తెలిపారు.

మామిడి కాయలు మార్కెట్‌లోకి రావడం కొంత ఆలస్యంకావడంతో గత నెలలో టన్ను కాయలు రూ.8వేల నుంచి రూ. 23 వేల వరకు పలికాయి. తాజాగా మార్కెట్‌ను మామిడి ముంచెత్తడంతో రూ.6 వేల నుంచి రూ.18 వేల వరకు ధర పలుకుతోంది. ఇప్పుడిప్పుడే కోస్తా, తెలంగాణ ప్రాంతాల నుంచి కాయలు వస్తుండటంతో ధరలు మరింత దిగివస్తున్నాయి. ఈ సంవత్సరంముఖ్యంగా పూతలు ఆలస్యంగా రావడం, తీవ్ర ఎండలు, కరవు, నీటి కొరత, యాజమాన్య పద్ధతులు నిర్వహించడంలో ఆలస్యం కావడం తదితర కారణాలతో దిగుబడులు తగ్గుతున్నాయి. నష్టాల పాలవుతున్న మామిడి రైతులు వాణిజ్యపంటలు సాగు చేస్తుండటం కూడా ఉత్పత్తి తగ్గిపోవడానికి ఒక కారణం.