Thursday, May 6, 2010

బజాజ్‌ కారు @ 30 కి.మీ. మైలేజీ

2012 కల్లా తేవాలన్నదే మా ఉద్దేశం
బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌
న్యూఢిల్లీ: సుమారు లక్ష రూపాయల ధరలో (2500 డాలర్లు) తాము అందించాలనుకున్న చౌక కారు 30 కిలోమీటర్ల మైలేజీ సాధించేలా ప్రయత్నిస్తామని బజాజ్‌ ఆటో వెల్లడించింది. ప్రస్తుతం టాటా మోటార్స్‌ లక్ష రూపాయల కారు నానో 23.6 కి.మి. మైలేజీ ఇస్తున్న సంగతి విదితమే. రెనాల్ట్‌ - నిస్సాన్‌తో కలిసి బజాజ్‌ రూపొందిస్తున్న అతి చౌక కారు 30 కి.మి. మైలేజీ సాధిస్తే నానోకు గట్టి పోటీయే కాదు, ద్విచక్ర వాహన యజమానులనూ ఆకట్టుకోవడం తథ్యం. దేశంలోని చిన్న కార్ల సగటు మైలేజీ 15-18 కిలోమీటర్లు ఉంది.లీటరు ఇంధనంపై కారు 30 కి.మి. ప్రయాణిస్తే, నెలవారీ నిర్వహణ వ్యయం బాగా తగ్గుతుంది. ద్విచక్ర వాహన చోదకులు కూడా ఆకర్షితులయ్యేలా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తామని బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. మైలేజీ 50% పెరిగితేనే, మంచి బండిగా వినియోగదారులు ముద్ర వేస్తారని రాజీవ్‌ అభిప్రాయం వ్యక్తంచేశారు. మనదేశంలో హీరోహోండా, టీవీఎస్‌, బజాజ్‌ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న మోటారుసైకిళ్లు పర్యావరణ హితంగా ప్రపంచంలోనే అత్యుత్తమమైనవని రాజీవ్‌ పేర్కొన్నారు. ఇదే పరిజ్ఞానాన్ని కారుకూ అన్వయించి తీర్చిదిద్దుతామని స్పష్టంచేశారు. ప్రస్తుతం మన దేశంలో అత్యధిక కార్లు 140-150 గ్రాములు/కి.మి. ఉద్గారాలను, నానో కారు 101 గ్రాములు/కి.మి. ఉద్గారాలను వెదజల్లుతుంటే, ప్రపంచంలో అత్యుత్తమని పేర్కొనేవి 110-120 గ్రాములు/కి.మి. వెలువరిస్తున్నాయని, ఈ సంఖ్యను రెండంకెలకు పరిమితం చేయాలన్నది తమ ఆకాంక్షగా రాజీవ్‌ వెల్లడించారు. ఈ కారును 2012లో విడుదల చేయాలన్నది భాగస్వామ్య కంపెనీల ఉమ్మడి లక్ష్యం.
బీఎస్‌3 ఆటోరిక్షాలు
కంపెనీ : బజాజ్‌ ఆటో
విడుదల : ఆర్‌ఈ 205డీ; ఆర్‌ఈ 205ఎం ప్యాసింజర్‌ త్రిచక్ర వాహనాలు
లభ్యత : బీఎస్‌-3 ప్రమాణాలకు అనుగుణంగా సీఎన్‌జీ, ఎల్‌పీజీ రెండు వేరియంట్లలోనూ లభ్యం.
ఎప్పుడు,ఎక్కడ : బుధవారం, న్యూఢిల్లీలో
ఎవరు : కంపెనీ ఎండీ రాజీవ్‌ బజాజ్‌, సీఈఓ(వాణిజ్య వాహనాల విభాగం) ఆర్‌.సి.మహేశ్వరి
ధర(సీఎన్‌జీ ) : ఆర్‌ఈ 205డీ - రూ.1,27,300; ఆర్‌ఈ 205ఎం - రూ.1,36,840 (ఎక్స్‌ షోరూమ్‌ ఢిల్లీలో)
ఏమన్నారు : 'కొత్తగా విడుదల చేసిన వాహనాలను ప్రతినెలా సగటున 3,500-4,500 చొప్పున విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటిని విపణికి పరిచయం చేయడం ద్వారా సీఎన్‌జీ వాహన విభాగంలో బజాజ్‌ ఆటో మార్కెట్‌ వాటాను సుస్థిరం చేసుకోవాలనుకుంటున్నాం. సీఎన్‌జీ లభ్యమయ్యే ఢిల్లీ, భోపాల్‌, ఇండోర్‌ వంటి నగరాల్లో ఈ విభాగంలోని వాహనాల అమ్మకంపై దృష్టిసారిస్తున్నాం.. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికం చివరికి ఆర్‌ఈ 445ఎల్‌ డీజిల్‌ అనే వాహనాన్ని ప్యాసింజర్‌ విభాగంలోనూ, ఆర్‌ఈ 900ను కార్గో విభాగంలో విడుదల చేయాలని భావిస్తున్నాం' అని సంస్థ సీఈఓ(వాణిజ్య వాహనాల విభాగం) ఆర్‌.సి.మహేశ్వరి పేర్కొన్నారు.