Thursday, May 6, 2010

హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్ పదవికి భారత జాతీయుడు

షికాగో: హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (హెచ్‌బీఎస్) డీన్ పదవిలో తొలిసారిగా భారత జాతీయుడైన ప్రొఫెసర్ నితిన్ నోహ్రియాను నియమించారు. స్కూల్ 10వ డీన్‌గా నితిన్ ఈ ఏడాది జూలై 1 బాధ్యతలు స్వీకరిస్తారని హెచ్‌బీఎస్ అధ్యక్షుడు డ్రూ ఫాస్ట్ బుధవారం తెలిపారు. 1988లో హెచ్‌బీఎస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన నోహ్రియా.. సీనియర్ అసోసియేట్ డీన్ పదవితో పాటు పలు కీలక పదవులు నిర్వహించారు. గత ఐదేళ్లుగా డీన్‌గా ఉన్న జే లైట్ రిటైరవుతుండడంతో ఆయన స్థానంలో నియమితులైన ప్రొఫెసర్ నితిన్.. ప్రస్తుతం లీడర్‌షిప్ ఇనీషియేటివ్ సహ పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

'ప్రొఫెసర్ నితిన్.. సాంప్రదాయ పరిమితులను అధిగమించిన ప్రాపంచిక దృక్పథం గల మహా మేధావి, గొప్ప అధ్యాపకుడు, మార్గదర్శి' అని అధ్యక్షుడు డ్రూ ఫాస్ట్ కొనియాడారు. తన నియామకం పట్ల ప్రొఫెసర్ నితిన్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. వాణిజ్య విద్యలో వచ్చే శతవర్షాల వరకూ కూడా హెచ్‌బీఎస్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ఫ్యాకల్టీ, విద్యార్థులతో కలిసి పనిచేయడం కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. 1984లో బొంబాయి ఐఐటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పట్టా పొందిన నితిన్.. 1988లో మస్సాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మేనేజ్‌మెంట్ విభాగంలో పీహెచ్‌డీ సాధించారు.