Thursday, May 6, 2010

ఇంద్రావతి పదవి మారితే..

ప్రపంచ బ్యాంకు ఎండీగా ఇండోనేషియా ఆర్థిక మంత్రి
సంస్కరణలకు ఆద్యురాలు
మార్పును జీర్ణించుకోలేక కుదేలైన మార్కెట్లు
జకార్తా: ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ అందరికీ పరిచితులే. అయితే పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణలే ఎక్కువ మందికి ఇప్పటికీ గుర్తుంటాయి. సంక్షోభం నుంచి భారత్‌ను గట్టెక్కించడం కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారాయన ఆ సమయంలో. ఇండోనేషియా రాజకీయవేత్తల్లో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అతికొద్దిమందిలో ఒకరైన ఆ దేశ ఆర్థిక మంత్రి శ్రీ ముల్యాని ఇంద్రావతిదీ మన్మోహన్‌ తరహానే. సంస్కరణల భేరి మోగించి బ్రిక్‌ దేశాల సరసన ఆ దేశాన్ని నిలబెట్టడానికి ఆమె కృషి చేస్తున్న తరుణంలో ఓ పరిణామం మలుపు తిప్పబోతోంది. ఆమె వరల్డ్‌ బ్యాంకు గ్రూపునకు ఎండీగా నియమితులు కానున్నారు. దీంతో పదవీ కాలం పూర్తి కాకుండానే దేశ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే స్థానిక మార్కెట్లు కుదేలయ్యాయి. భవిష్యత్‌లోనూ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం కొనసాగనుందని నిపుణులు అభిప్రాయపడుతుండడం గమనార్హం. ఇంద్రావతి ప్రపంచ బ్యాంకుకు వెళుతున్న తరుణంలో ఆమెకు దేశాధ్యక్షుడు సుసిలో బాంబ్యాంగ్‌ యుధోయోనో శుభాకాంక్షలు చెప్పడంతోఆమె నిష్క్రమణ ఖరారైంది. అయితే తాజా పరిణామం దేశానికి నష్టం కలిగించేదేనని ఆయన వ్యాఖ్యానించడం గమానార్హం. ప్రపంచ బ్యాంకుకుఇది మంచి చేసేదేనైనా ఇండోనేషియాకు కాస్త దెబ్బతీసే పరిణామమేనని సీఎల్‌ఎస్‌ఏ ఇండోనేషియా హెడ్‌నిక్‌ కాష్మోర్‌ అంటున్నారు.. అనుకున్న సమయం కంటే ఆమె ముందే వెళుతుండడం; ఆమె చేపట్టిన సంస్కరణలు ఇంకా వేగాన్ని పుంజుకోవాల్సిన దశలోనే ఉండడం బాధాకరమిన ఆయన అంటున్నారు.

ఇంతకీ ఆమె గొప్పతనమేమిటంటే: ఈ 47 ఏళ్ల మహిళ ఈశాన్య ఆసియాలో అత్యంత శక్తివంతమైన మహిళగా పేరు పొందారు.

* ఆర్థిక మంత్రిగా వివిధ పారదర్శక విధానాలకు తెరదీయడం ద్వారా ఈమె పన్ను, కస్టమ్స్‌ విభాగాల్లో అవినీతిని నిర్మూలించడం కోసం కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు వ్యాపారవర్గంలో ఎంతో మంది శత్రువులు కూడా తయారయ్యారు. ఒక విధంగా వారికి తాజా పరిణామాలు ఆనందాన్ని కలిగించేవే.

* ఆర్థిక విధానాలు, స్థిరమైన రాజకీయ పరిస్థితులలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా మారడమే కాకుండా జీ-20లో సభ్యత్వాన్నీ సాధించిన ఈ దేశ ప్రగతి వెనుక ఈమె కృషీ ఉంది.

* బ్రిక్‌ దేశాలతో భుజాలు రాసుకుని తిరిగే స్థాయికి చేరడానికి ఇండోనేషియాకు మరికొన్నేళ్లు పడుతుందన్న అంచనాలూ ఉన్నాయి.

* గత 18 నెలలుగా విదేశీ సంస్థాగత మదుపుదార్లు ఇండోనేషియా స్టాక్‌ మార్కెట్లో భారీగా కొనుగోళ్లు చేస్తున్నారంటే అది ఇంద్రావతి సంస్కరణల ప్రభావమే.