Monday, May 3, 2010

గుంటూరులో అపాచీ పరిశ్రమకు 40 ఎకరాలు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: బూట్ల తయారీలో పేరొందిన అపాచీ సంస్థ గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసే పరిశ్రమకు 40 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సంస్థ ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలో పరిశ్రమ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి పక్కనే ఉన్న పొత్తూరులో 40 ఎకరాల కేటాయింపునకు ఆమోదం తెలిపారు. ముడిసరుకులను తెచ్చి ఇక్కడ కుట్టి బూట్లను తయారీ చేస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు.

ఎస్‌బీక్యూ స్టీల్స్‌ విస్తరణకు అనుమతి: నెల్లూరు జిల్లాలోని ఎస్‌బీక్యూ స్టీల్స్‌ విస్తరణకు పరిశ్రమల శాఖ ఆమోదం తెలిపింది. ఇందుకు అవసరమైన భూ కేటాయింపుతో పాటు రాయితీలు ఇస్తామని వెల్లడించింది. ఆ సంస్థ ప్రతినిధులు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామ్‌బాబుతో భేటీ అయ్యారు.

శ్రీసిటీకి అనుమతులు: చిత్తూరు జిల్లాలో శ్రీసిటీ సెజ్‌కు అన్ని రకాల అనుమతులపై సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేయాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. ఆ సెజ్‌ ప్రతినిధులు, శుక్రవారం పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ అధికారులతో సమావేశమై తమ సమస్యలను వివరించారు. మాస్టర్‌ ప్లాన్‌ ఇతర ప్రతిపాదనలకు సత్వరమే ఆమోదం ఇప్పిస్తామని అధికారులు వారికి హామీ ఇచ్చారు.