Monday, May 3, 2010

కరెంట్‌ కష్టాలకు కొంత వూరట

సింహాద్రి యూనిట్‌-1 నవంబర్లో ప్రారంభం
మరో యూనిట్‌ ఏడాదిలో సిద్ధం
350 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి
రూ.5038 కోట్లతో ఎన్‌టీపీసీ విస్తరణ ప్రణాళిక
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రెంటు కొరతతో అల్లాడుతున్న రాష్ట్రానికి కొంత వూరట. విశాఖపట్నంలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) సింహాద్రి రెండో దశ ప్రాజెక్టులో భాగమైన 500 మెగావాట్ల యూనిట్‌-1 ఈ ఏడాది నవంబరులో ప్రారంభం కానుంది. రెండో దశ ప్రాజెక్టులోని మరో 500 మెగావాట్ల యూనిట్‌-2 వచ్చే ఏడాది మే నెలకు సిద్ధమవుతుంది. రూ.5,038 కోట్ల మూలధన పెట్టుబడితో ఈ విస్తరణ కార్యక్రమాన్ని ఎన్‌టీపీసీ చేపట్టింది. ఈ రెండు యూనిట్లు పూర్తయిన పక్షంలో ఇందులో మన రాష్ట్రం వాటా కింద 35 శాతం వరకూ విద్యుత్తు... అంటే 350 మెగావాట్ల సామర్థ్యం లభిస్తుంది. దీనివల్ల వచ్చే ఏడాది వేసవిలో కొంత వెసులుబాటు లభించే అవకాశం ఉంది.

సింహాద్రి మొదటి దశను 1000 మెగావాట్ల సామర్థ్యంతో (500 మెగావాట్ల సామర్థ్యం కల రెండు యూనిట్లు) నిర్మించిన విషయం విదితమే. ఇందులో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు అంతా అప్పట్లో కుదిరిన ప్రత్యేక ఒప్పందం ప్రకారం ఎన్టీపీసీ మొత్తం మన రాష్ట్రానికే ఇస్తోంది. కానీ రెండో దశ 1000 మెగావాట్ల విద్యుత్తు పంపిణీలో మాత్రం గాడ్గిల్‌ ఫార్ములాను వర్తింపజేస్తున్నారు. దీనివల్ల మన రాష్ట్రానికి 35 శాతం కంటే విద్యుత్తు లభించే అవకాశం లేదు. శుక్రవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్‌టీపీసీ సదరన్‌ రీజియన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అంబరీష్‌ నాథ్‌ దవే స్పందిస్తూ ఒక యూనిట్‌ నుంచి మొత్తం విద్యుత్తును ఒక రాష్ట్రానికే ఇవ్వడం అనేది అరుదని, గతంలో ఒకటి రెండు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇటువంటి ఏర్పాట్లు జరిగాయని పేర్కొన్నారు.

రికార్డు స్థాయి పనితీరు: ఎన్‌టీపీసీ దక్షిణ ప్రాంతం గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి పనితీరును నమోదు చేసినట్లు అంబరీష్‌ నాథ్‌ దవే చెప్పారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన 32,067 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తిని మించి గత ఆర్థిక సంవత్సరంలో 32,532 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఈ ప్రాంతంలో ఉత్పత్తి చేశారు. ఎన్‌టీపీసీ యూనిట్లన్నంటిలో పనితీరులో రామగుండం యూనిట్‌ మొదటి స్థానంలో, సింహాద్రి యూనిట్‌ రెండో స్థానంలో నిలిచాయి. రామగుండం యూనిట్‌ 94.81 శాతం పీఎల్‌ఎఫ్‌, సింహాద్రి యూనిట్‌ 97.27 శాతం పీఎల్‌ఎఫ్‌ను సాధించాయి.

16,300 మెగావాట్లకు...: ఎన్‌టీపీసీకి దక్షిణ ప్రాంతంలో ప్రస్తుతం 5960 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. ఇందులో రామగుండం యూనిట్‌ పెద్దది. సింహాద్రి, కేరళలోని కాయంకులం ఇతర యూనిట్లు. 12వ పంచవర్ష ప్రణాళికా కాలం (2012-17) పూర్తయ్యేలోగా సదరన్‌ రీజియన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 16,300 మెగావాట్లకు పెంచాలనేది కంపెనీ లక్ష్యమని దవే వెల్లడించారు. దక్షిణాదిలో ప్రస్తుతం అమల్లో/ప్రతిపాదనల్లో ఉన్న విస్తరణ ప్రాజెక్టుల కోసం కంపెనీ రూ.26,000 కోట్లకు పైగా సొమ్మును వెచ్చిస్తోంది.

కొత్త ప్రాజెక్టులు: పవర్‌ కంపెనీ ఆఫ్‌ కర్ణాటకతో కలిసి ఎన్‌టీపీసీ బీజాపూర్‌లోని కుడ్గి వద్ద 4000 మెగావాట్ల థర్మల్‌ యూనిట్‌ను నిర్మించనుంది. ఇదికాక కర్ణాటకలోనే గులేడగుడ్డ వద్ద 500 మెగావాట్ల పవన విద్యుత్తు యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. మరక్కనమ్‌లో 2000 మెగావాట్ల థర్మల్‌ యూనిట్‌ ప్రతిపాదనలో ఉంది. రాజీవ్‌ గాంధీ కంబైన్డ్‌ సైకిల్‌ పవర్‌ ప్రాజెక్టు విస్తరణ, రామగుండంలో నాలుగో దశ కింద 1000 మెగావాట్ల (500 మెగావాట్ల సామర్థ్యం కల 2 యూనిట్లు) సామర్థ్యాన్ని జత చేయడం పరిశీలనలో ఉన్నాయి.

రామగుండంలో సౌరవిద్యుత్తు ప్లాంటు
సౌర విద్యుత్తు విభాగంలోకి విస్తరిస్తున్న ఎన్‌టీపీసీ, రామగుండంలో ఒక యూనిట్‌ను స్థాపించే సన్నాహాల్లో ఉంది. 30 మెగావాట్ల సౌర విద్యుచ్ఛక్తి యూనిట్‌ను స్థాపించాలని చూస్తున్నట్లు అంబరీష్‌ నాథ్‌ దవే చెప్పారు. ప్రస్తుతం ఇది అధ్యయనాల దశలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.