కలిసి కోర్టుకెలా వెళ్తాం: సెబీ
యులిప్ వివాదంపై ఐఆర్‌డీఏకు లేఖ న్యూఢిల్లీ: యులిప్‌లపై నియంత్రణ బాధ్యత ఎవరు వహించాలన్న అంశంపై కోర్టు కెళ్లే ప్రక్రియలోనూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ మధ్య వివాదం ఏర్పడింది. కోర్టు ఆదేశాలను సెబీతో కలిసి సంయుక్తంగా కోరాలని ఐఆర్‌డీఏ భావిస్తుంటే, తమకు కొన్ని పరిమితులున్నాయని సెబీ పేర్కొంటోంది. 'యులిప్‌లపై సంయుక్తంగా దరఖాస్తు చేయడం సివిల్ ప్రక్రియలో సెక్షన్ 90 ప్రకారం చెల్లదని తమ న్యాయసలహామండలి తెలిపినట్లు' సెబీ నుంచి లేఖ అందినట్లు ఐఆర్‌డీఏ ఛైర్మన్ జె.హరినారాయణ హైదరాబాద్‌లో చెప్పారు. రెండు సంస్థలు శత్రుభావంతో పోరాటానికి దిగలేదని, కేవలం న్యాయసలహా మాత్రమే కోరుతున్నందున, సెక్షన్ 90 ప్రకారం కేసు వేయమని ఒక ప్రఖ్యాత న్యాయవాది సలహా ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. 90వ సెక్షన్ ప్రకారం 'ఎవరైనా వ్యక్తి కోర్టు అభిప్రాయం తెలుసుకునేందుకు కేసు వేసేందుకు అంగీకరిస్తే, అప్పుడు కోర్టు కూడా కోరిన మేరకు నిర్ధరించేందుకు ప్రయత్నిస్తుంది.' సెబీ స్పందనపై మళ్లీ ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తారా అన్న ప్రశ్నకు అది కూడా ఒక మార్గమని ఐఆర్‌డీఏ ఛైర్మన్ పేర్కొన్నారు. సెబీ ఛైర్మన్ సీబీ భావే మాత్రం దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.