
రాష్ట్రంలో 1996లో సెల్‌ఫోన్ సేవలు మొదలుకాగా 2009 వరకు కూడా 9 సీరీస్‌తో నెంబర్లు సరిపోయాయి. బీఎస్‌ఎన్‌ఎల్, ఐడియా, ఎయిర్‌టెల్, రిలయన్స్, టాటా ఇండికాం, డొకొమో, ఎయిర్‌సెల్, వోడా ఫోన్ వంటి ఆపరేటర్ల ద్వారా సేవలు అందుతున్నా ఆ సీరీస్ 13 ఏళ్ల వరకు అవసరాలు తీర్చగలిగింది. గత ఏడాది మాత్రం 9 నిండిపోతుండడంతో 8తో సీరీస్‌ను ప్రారంభించారు. సెల్ వ్యాప్తి తీరు చూస్తే అదీ సరిపోవడం లేదు. భారత సెల్యులార్ ఆపరేటర్ల సంఘం (సి.ఒ.ఎ.ఐ.) లెక్కల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో 1.30 కోట్లు, మార్చిలో 1.39 కోట్ల కొత్త కనెక్షన్లు దేశంలో విడుదలయ్యాయి. మార్చి మాసాంతం నాటికి దేశంలో ఉన్న మొత్తం సెల్ కనెక్షన్ల సంఖ్య 58.43 కోట్లు. వీటిలో ఎయిర్‌టెల్‌కు అత్యధికంగా 12.76 కోట్ల కనెక్షన్లున్నాయి. నెలనెలా 1.3 కోట్లకుపైగా కొత్త కనెక్షన్లు వస్తుండడంతో సీరీస్‌ల కోసం వెతుకులాట అనివార్యమవుతోంది. అందునా 1 నుంచి 9 వరకు ఉన్న ప్రారంభ సంఖ్యల్లో అన్నీ సెల్‌కు ఇచ్చే వీల్లేదు. 1ని 100, 101, 108, 1090 వంటి అత్యవసర ప్రత్యేక సేవల కోసం కేటాయించారు. 2ని బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్లకు ఇచ్చారు. 3, 4, 5, 6 సీరీస్‌ను వేర్వేరు ప్రైవేటు సంస్థల ల్యాండ్‌ఫోన్లకు కేటాయించారు. ఇక మిగిలినవి 7, 8, 9 మాత్రమే. వీటిల్లో 9, 8 ఇప్పటికే మొదలు కాగా ఇప్పుడిక 7 వంతు వచ్చింది. ఇదీ అయిపోతే అందరి మొబైల్ ఫోన్లకూ 11వ అంకె జత చేరుతుంది. ఆయా ఆపరేటర్ల వద్ద ప్రస్తుతం కొన్ని వేల నెంబర్లు ఖాళీగా ఉన్నా, ఒకసారి వాటిని వారికి కేటాయించాక వేరేవారికి ఇచ్చే అవకాశం లేదు. పైగా ఒక ఆపరేటర్ వద్ద ఒక సిమ్ తీసుకుని, కొన్నాళ్లు వాడిన తర్వాత దానిని వదిలేసి మరో సిమ్‌ను అదే సంస్థ నుంచి గానీ, వేరే సంస్థ నుంచి గానీ ఎంపిక చేసుకున్నా పాత సంఖ్య మాత్రం ఆ వినియోగదారుడి పేరు మీదే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇలా కొన్ని లక్షల కనెక్షన్లు ఉంటాయని అంచనా. సిమ్‌లు తీసుకుంటున్న వారే లెక్కల్లోకి వస్తున్నా, వాస్తవంగా నికర వినియోగదారుల సంఖ్య స్పష్టంగా తేలడం కష్టమవుతోంది. దీంతో ఎన్ని నెంబర్లు ఉంటున్నా చాలడం లేదు. సెల్ నెంబర్లకు కొరత తీరాలంటే ఎం.ఎన్.పి. సదుపాయం కీలకం కానుంది. దీని అమలుపై భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) విధించిన గడువులోగా పనులు పూర్తికావడం లేదు. దీంతో ఎం.ఎన్.పి. వాయిదా పడుతూ వస్తోంది.