దుగ్గిరాల,: పసుపునకు పుట్టినిల్లుగా భాసిల్లుతున్న దుగ్గిరాల మండలంలో మునుపెన్నడూ లేని రీతిలో పసుపు ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. నిన్నమొన్నటి వరకు ఉన్న పసుపు క్వింటాల్ ధర రూ.4 వేలు రానురాను పెరిగి అమాంతంగా రూ.14 వేలకు చేరుకుంది. పెరిగిపోతున్న ఈ ధరలతో రైతుల్లో ఆనందహేల నెలకొనగా, వినియోగదారులు మాత్రం బావురుమనాల్సి వచ్చింది. ఎకరానికి పెట్టుబడి రూ.50 వేలు కాగా ఈ ఏడాది దిగుబడులు 40 క్వింటాళ్ల వరకు వచ్చినట్లు రైతులు చెప్తున్నారు. క్వింటాల్ ధర రూ.14 వేలకు చేరుకోవడంతో రైతులకు లక్షల్లో ఆదాయం రావడంతో తబ్బి బ్బవుతున్నారు.
కౌలు రైతులకు కూడా పెరిగిన పసుపు ధరల వల్ల గత నష్టాల ఊబిలో నుంచి తేరుకునే అరుదైన అవకాశం లభించినట్లయింది. మండలం లో సుమారు అయిదు వేల ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో పసుపు సాగవు తోంది. పసుపునకు దుగ్గిరాల రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందడంతో 1984 అక్టోబర్ 25న ప్రభుత్వం రైతుల సౌకర్యార్ధం మార్కెట్ యార్డును నెలకొల్పింది. ఇక్కడి నుంచే రైతులు తమ పంటకు క్రయవిక్రయాలు జరుపుతారు. దుగ్గిరాల పసుపునకు కేంద్రంగా ఉండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పసుపు ఇక్కడకు దిగుమతి కావడం విశేషం. గత ఏడాది యార్డుకు రూ.2 కోట్ల 49 లక్షలు ఆదాయం లభించగా, ప్రస్తుతం పెరిగిన ధరలతో ఈ ఆదాయం ఊహిం చని రీతిలో పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ధరలు ఇక్కడితో ఆగకుండా క్వింటాల్ ధర రూ.18 వేల వరకు వెళ్లే అవకాశం ఉందని రైతులు అంటున్నా రు. ఈ పరిణామాల నేపథ్యంలో యార్డులో పసుపు క్రయవిక్రయాలు మరింత ఊపందుకున్నాయి. ధరలు మరింత పెరిగే అవకాశమున్న నేపథ్యంలో కొంత మంది రైతులు స్థానికంగా కోల్డ్ స్టోరేజీల్లో నిల్వలు పెట్టుకుంటున్నారు. మరికొంత కాలం పరిస్థితి ఇలాగే ఉంటుందని భావిస్తున్నారు.