యాజమాన్యాలకు రెవెన్యూ శాఖ నోటీసులు
ఏపీఐఐసీకి కూడా
రూ. వందల కోట్ల భారం

పరిశ్రమలు ఇతర అవసరాల కోసం వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తే వాటిపై మొదట్లో వ్యవసాయేతర భూమి పన్ను (నాలా)ఉండేది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కల్పించేందుకు 2006లో ప్రభుత్వం 'నాలా' స్థానంలో ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ (కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పస్)-2006 చట్టాన్ని తీసుకొచ్చింది. 'నాలా' ప్రకారం చదరపు మీటర్ల లెక్కన విలువ లెక్కించి పన్ను వసూలు చేసేవారు. 2006 చట్టంతో ఈ విధానం మారింది. మూల విలువలో 10 శాతం చెల్లించాలని నిర్దేశించారు. ఈ మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోతే ఇందులో 50 శాతం అపరాధ రుసుం విధించే అవకాశాన్ని చట్టం కల్పించింది.
2006లో కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పారిశ్రామికసంస్థల వైపు చూడని ప్రభుత్వం తాజాగా ఆర్థిక సమస్యల కారణంగా ఆదాయార్జన కోసం దాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ల పరిధిలో నోటీసులు జారీ అవుతున్నాయి. ఒక్కో జిల్లాలో వందకు పైగా సంస్థలకు నోటీసులందాయి. పరిశ్రమల స్థాపనకోసం పెద్దఎత్తున భూములను సేకరించిన ఏపీఐఐసీ జోనల్ మేనేజర్లకు ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లు నోటీసులు పంపారు. పారిశ్రామిక వాడలు, పార్కుల భూములకు సైతం పన్ను చెల్లించాలని ఆదేశించారు. ఏపీఐఐసీ నుంచి భూములు కొన్న వారికి విడిగా నోటీసులు వస్తున్నాయి.
భూముల ధరలు ఆకాశాన్నంటిన తరుణంలో పది శాతం పన్ను చెల్లించాలంటూ నోటీసులు రావడంతో పారిశ్రామిక వర్గాలతో పాటు ఏపీఐఐసీ అధికారులు కంగుతిన్నారు. దాదాపు లక్ష ఎకరాలకు పైగా సేకరించిన ఏపీఐఐసీ రూ. వందల కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఇతర పారిశ్రామిక సంస్థలపైనా ఈ భారం ఎక్కువగానే ఉంటుంది. విశాఖలోని ఒక ప్రభుత్వ రంగ సంస్థకు రూ. 70 కోట్లను చెల్లించాలని అక్కడి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పారిశ్రామికవాడల్లో ఒక్కో సంస్థకు రూ. లక్ష నుంచి రూ.పది లక్షల వరకు చెల్లించాలంటూ నోటీసులు వచ్చాయి.
పారిశ్రామిక ప్రగతికి విఘాతం
పరిశ్రమల స్థాపన కోసం అంటూ ముందే ప్రకటించి ప్రభుత్వ ఆదేశాల మేరకే భూములు సేకరించిన తమకు పన్ను నోటీసులు జారీ కావడం అర్థరహితమని ఏపీఐఐసీ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని,పన్ను మినహాయింపు కోరతామని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి బుధవారం 'న్యూస్‌టుడే'కు చెప్పారు. భూ వినియోగ మార్పిడి పన్ను పారిశ్రామిక రంగాన్ని మరింత దెబ్బతీస్తుందని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. మాంద్యం నుంచి, కరెంటు కోతల నుంచి కోలుకుంటున్న తరుణంలో ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం చేసిందని, మరోవైపు కొత్తగా పన్ను పేరిట సంక్షోభంలోకి నెడుతోందని వారు విమర్శిస్తున్నారు. భూ వినియోగ మార్పిడి పన్నుపై పరిశ్రమల శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని చిన్నతరహా పారిశ్రామికవేత్తల సంఘాల సమాఖ్య కార్యదర్శి వి. హన్మంతరావు వెల్లడించారు.