Monday, May 3, 2010

మనకొద్దీ చైనా సరకు

టెలికాం సామగ్రిపై ప్రభుత్వ నిషేధం
జడ్‌టీఈ, హ్యువాయ్‌లపై తీవ్ర ప్రభావం
వ్యతిరేకిస్తున్న కొత్త ఆపరేటర్లు
ఆయా కంపెనీలతో ఒప్పందాలే కారణం
విద్యుత్‌ ఉపకరణాలపైనా ప్రభుత్వ దృష్టి
చైనా మొబైల్‌ సామగ్రిపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇంత వరకూ అనధికారికంగా మన ఆపరేటర్లకు ఆ దేశ మొబైల్‌ సామగ్రిని కొనొద్దంటూ చెబుతూ వచ్చిన ప్రభుత్వం ఈసారి అధికారికంగా ఆ దిగుమతులపై నిషేధం వేటు వేసింది. చైనా తయారీదార్ల నుంచి సామగ్రి కొనుగోలు పథకాల్లో ఉన్న కొన్ని మొబైల్‌ ఆపరేటర్లకు టెలికమ్యూనికేషన్ల విభాగం(డాట్‌) నేరుగా ఉత్తర్వులు పంపింది.

ఏం జరిగిందంటే: చైనా మొబైల్‌ సామగ్రిని ఉపయోగించడం వల్ల దేశభద్రతకు ముప్పు పొంచి ఉందంటూ గత కొన్నేళ్లుగా హోం శాఖ ఆందోళన చెందుతోంది. డాట్‌ ఈ మధ్యే ఐఎమ్‌ఈఐ నెంబరులేని చైనా మొబైళ్ల దిగుమతినీ నిషేధించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా తాజా నిషేధాలు వెలువడ్డాయి.

ఏం జరుగుతుందంటే..: ఇప్పటికే భారత మొబైల్‌ సామగ్రి మార్కెట్‌లో వేళ్లూనుకున్న చైనా కంపెనీలు జడ్‌టీఈ, హ్యువాయ్‌లపై నిషేధం తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. జడ్‌టీఈ అయితే 3జీ సామగ్రి మార్కెట్లో ఏకంగా 20 శాతాన్ని జేబులో వేసుకోవాలనుకుంటున్న తరుణంలో ఈ పరిణామం ఆ కంపెనీకి అశనిపాతం లాంటిదే. గత ఆర్థిక సంవత్సరంలో జడ్‌టీఈ.. చైనా 3జీ మార్కెట్లో 34 శాతం మార్కెట్‌ వాటాను కైవసం చేసుకోవడం గమనార్హం. భారత్‌ మార్కెట్‌ విషయానికొస్తే ఇది 2009-10లో విక్రయాల్లో 50 శాతం వృద్ధిని సాధించింది. మరో పక్క భారత్‌లోని కొత్త మొబైల్‌ ఆపరేటర్లనూ ఈ నిషేధం సంగ్దిగ్ధంలో పడేసింది. ఇందులో చాలా వరకు కంపెనీలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది టెలికాం రంగ వృద్దిని కుంటుపరుస్తుందని ప్రభుత్వ అధికార్లను హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇందులో చాలా కంపెనీలు జడ్‌టీఈ, హ్యువాయ్‌ టెక్నాలజీస్‌తో కాంట్రాక్టులపై సంతకాలు చేశాయి. ఎరిక్‌సన్‌, నోకియా, సీమెన్స్‌తో పోలిస్తే చైనా టెలికాం సామగ్రి ధర చౌకగా ఉంటుందని అవి చెబుతున్నాయి.

ఎవరికి లాభం: మార్కెట్‌ వాటాను క్రమంగా కోల్పోతున్న ఐరోపా, అమెరికా మొబైల్‌ సామగ్రి విక్రేతలకు ఇది ఎగిరిగంతేసే విషయం.
విద్యుత్‌ రంగంలోనూ: చైనా నుంచి దిగుమతి అవుతున్న నాసిరకం విద్యుత్‌ సామగ్రిపైనా వివాదాలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌ విద్యుత్‌ అభివృద్ధి సంస్థకు చెందిన 300 మెగావాట్ల సాగర్‌దిఘి ప్రాజెక్టు, స్టెరిలైట్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన బాల్కో 540 మెగా వాట్ల సొంత ప్లాంట్లు చైనా సామగ్రి వాడడం వల్ల నిర్వహణ పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి.దీంతో చైనా విద్యుత్‌ సామగ్రిపైనా ప్రభుత్వం దృష్టిసారించే అవకాశం ఉంది. ప్రస్తుతం డోంగ్‌ఫాంగ్‌ ఎలక్ట్రిక్‌, హార్బిన్‌ పవర్‌ ఎక్విప్‌మెంట్‌ కంపెనీ, సెప్కోలు భారత్‌ నుంచి భారీ స్థాయిలో ఆర్డర్లు పొందిన వాటిలో ఉన్నాయి.