
హైదరాబాద్ - న్యూస్‌టుడే
ఒక విశ్రాంత ఉద్యోగి పింఛను రూ.10 వేలు అనుకొంటే అందులో సరెండర్ చేసిన రూ.4 వేలపై రూ.4 లక్షల మొత్తాన్ని పొందవచ్చు. ఫిబ్రవరి నెలకు ముందు పాత పీఆర్‌సీ అమల్లో ఉన్నందు వల్ల అప్పటి వరకు పదవీ విరమణ చేసిన వారికి మాత్రం వారి పాత పింఛనులో 40 శాతంలో ఒక రూపాయికి రూ.125 చొప్పున ఇస్తారు. ఇలా ఒకేసారి భారీగా అందే మొత్తంతో పిల్లల వివాహం, ఇంటి నిర్మాణం వంటి కార్యక్రమాలను విశ్రాంత ఉద్యోగి తలపెట్టటం సహజం. ఇప్పుడు ఇటువంటి మొత్తాలను ఖజానా కార్యాలయాల్లో చెల్లించటం లేదు. కేవలం పింఛను, గ్రాట్యుటీలను మాత్రమే చెల్లించాలంటూ గత నెల 24వ తేదీన ఖజానా సంచాలకుడి నుంచి 14వ నెంబరుతో ఒక అంతర్గత ఉత్తర్వు జారీ అయ్యింది. అంతకు ముందు కూడా కొంతకాలం పాటు దీనిపై అంక్షలు అమలయ్యాయి. ఆంక్షలు వైదొలిగాయని విశ్రాంత ఉద్యోగులు ఆనందిస్తున్నంతలోనే మళ్లీ అవి అమల్లోకి వచ్చాయి. కమ్యుటేషన్‌కు అకౌంటెంట్ జనరల్ ఆమోదముద్ర కోసం ఎదురు చూస్తూ వచ్చిన పింఛనుదారులు ఇప్పుడు ఖజానా కార్యాలయాలకు వెళ్లి రిక్తహస్తాలతో తిరిగి వస్తున్నారు.
బకాయిల కుదింపు
పెరిగిన పింఛనుకు అనుగుణంగా మే నెలలో రెండు నెలల బకాయిలు పింఛనుదారులకు అందాల్సి ఉండగా ఖజానా శాఖ ఇప్పుడు వాటిని ఒక నెలకే పరిమితం చేసింది. మే నెలలో కేవలం ఒక నెల బకాయిలను మాత్రమే అందజేయాలంటూ ఖజానా శాఖ సంచాలకులు తాజాగా ఒక అంతర్గత ఉత్తర్వు జారీ చేశారు. పింఛనుదారులకు సంబంధించి ఇంతకుముందే వెలువడిన ఉత్తర్వు ప్రకారం ఫిబ్రవరి నెల బకాయిలను మే నెల 1వ తేదీన చెల్లించే ఏప్రిల్ నెల కొత్త పింఛనుతో కలిపి ఇవ్వాలి. అయితే ఇలా జీవో వెలువడినప్పటికీ మే 1 తేదీకి పింఛనుదారులకు ప్రభుత్వం కొత్త పింఛను కాకుండా పాత పింఛనే ఇచ్చింది. స్థిరీకరణ పనులు పూర్తికానందునే కొత్త పింఛను ఇవ్వలేకపోయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. స్థిరీకరణ పనులు నాలుగైదు రోజుల్లో పూర్తికానున్నాయి. అంటే వారం పది రోజుల్లో పింఛనుదారులకు ఏప్రిల్ నెల బకాయి, జీవో ప్రకారం ఫిబ్రవరి నెల బకాయి కలపి రెండు నెలలవి అందజేయాల్సిఉంది. దీనికి భిన్నంగా ఒక నెల బకాయిలను మాత్రమే ఇవ్వాలంటూ ఖజానా కార్యాలయాలకు తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ప్రభుత్వ పోకడలు గర్హనీయం
'ప్రభుత్వం పింఛనుదారులపై ఆంక్షలు విధించి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాలని భావిస్తున్నట్టుగా ఉంది. కమ్యుటేషన్ మొత్తంపై విశ్రాంత ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. వాటిని తాత్కాలికంగా ఆపినా పలువురు ఇబ్బంది పడతారు. పింఛనుదారుల్లో అసంతృప్తి పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి'
పాలడుగు వెంకటేశ్వరరావు