Tuesday, May 4, 2010

గ్రీస్‌కు రూ. 6,42,000 కోట్ల రుణం

మూడేళ్లలో విడుదల
7న ఈయూ సమావేశంలో ఆమోదముద్ర
బెర్లిన్‌: అప్పుల వూబిలో కూరుకుపోయి దివాలా స్థితికి చేరిన గ్రీస్‌ను రక్షించడానికి మూడు సంవత్సరాల్లో 110 బిలియన్‌ యూరోల (దాదాపు రూ.6,42,000 కోట్లు) ఆర్థిక సహాయ పథకాన్ని దఫాల వారీగా అమలు చేయడానికి యూరో జోన్‌ ముందుకు వచ్చింది. 15 యూరో జోన్‌ దేశాలు 80 బిలియన్‌ యూరోలు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) 30 బిలియన్‌ యూరోలు అందించనున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో ఈయూ, ఐఎంఎఫ్‌లు కలసి గరిష్ఠంగా 30 బిలియన్‌ యూరోలను ఇస్తాయి. గ్రీస్‌ 300 బిలియన్‌ యూరోల రుణ భారంతో సతమతం అవుతోందన్నది తెలిసిందే.

రుణ సాయంలో తొలి కిస్తును.. గ్రీస్‌ తన అప్పులను తిరిగి చెల్లించివేయడానికి వీలుగా.. ఈ నెల 19 లోగా సమకూర్చనున్నట్లు యూరో జోన్‌ గ్రూపు ఛైర్మన్‌, లగ్జెంబర్గ్‌ ప్రధాని జీన్‌-క్లాడ్‌ జంకర్‌ విలేకరులకు తెలిపారు. అప్పును వడ్డీతో తిరిగి చెల్లించవలసి ఉంటుందని ఫ్రాన్స్‌ ఆర్థిక మంత్రి క్రిస్టీన్‌ లగార్డ్‌ చెప్పారు. గ్రీస్‌ బెయిల్‌ అవుట్‌ ఒప్పందానికి ఈ నెల 7న జరగనున్న యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) శిఖరాగ్ర సమావేశంలో ఆయా దేశాల, ప్రభుత్వాల అధినేతలు లాంఛనంగా ఆమోద ముద్ర వేయవలసి ఉంటుంది. భవిష్యత్తులో ఈ తరహా సంక్షోభాలు తలెత్తకుండా చూడటానికి ఏయే చర్యలు తీసుకోవాలన్నది కూడా ఈ నెల 7నాటి శిఖరాగ్ర సమావేశంలో చర్చించనున్నారు. గ్రీస్‌ తన వంతుగా అనుసరిస్తానని చెప్పిన మిత వ్యయ చర్యలను పాటించడానికి కట్టుబడే షరతు మీదే అప్పు ఇవ్వనున్నట్లు జంకర్‌ స్పష్టం చేశారు. ప్రతి మూడు నెలలకు ఒక సారి గ్రీస్‌ ఆర్థిక రికవరీ కార్యక్రమం తీరుతెన్నులను ఈయూ, ఐఎంఎఫ్‌లు పర్యవేక్షిస్తాయి. ఇక.. గ్రీక్‌ ప్రభుత్వం తీసుకుంటానని చెప్పిన చర్యలలో మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వ రంగ ఉద్యోగులకు జీతంలోనూ, పింఛన్‌ చెల్లింపుల్లోనూ కోతలు, పన్నుల పెంపు, బోనసుల రద్దుల వంటివి ఉన్నాయి. ఈ విధానాల ఫలితంగా మొత్తంమీద గ్రీస్‌ 30 బిలియన్‌ యూరోల వరకు మిగుల్చుకోవచ్చని భావిస్తున్నారు.