
యజమాని కేంద్ర ప్రభుత్వమే
ధర నిర్ణాయక హక్కు దానిదే
అంబానీ కుటుంబీకుల ఎంఓయూకు
కట్టుబడాల్సిన పనిలేదు
గ్యాస్ సరఫరా ఒప్పందంపై
6 వారాల్లోగా మళ్లీ చర్చించుకోండి
ముకేశ్, అనిల్ అంబానీల సంస్థలకు
సుప్రీంకోర్టు ఆదేశం
చౌకగా గ్యాస్ ఇవ్వాలన్న
ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్ విజ్ఞప్తికి తిరస్కృతి
న్యూఢిల్లీ
కార్పొరేట్ దిగ్గజ సోదరులు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య సాగుతున్న గ్యాస్ వివాదంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. సహజ వాయువు జాతి సంపద అని, దాని ధరల నిర్ణయం, వినియోగంపై సార్వభౌమాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పింది. సహజ వనరులు వినియోగదారులకు చేరేదాకా వాటి యజమాని కేంద్ర ప్రభుత్వం మాత్రమేనని ఉద్ఘాటించింది. చౌక ధరకు గ్యాస్‌ను సరఫరా చేయాలన్న అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్(ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్) విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. గ్యాస్ ధరల్ని నిర్ణయించాల్సింది ప్రభుత్వమేనని అటు ముకేశ్, ఇటు కేంద్రం చేస్తున్న వాదనతో కోర్టు ఏకీభవించింది. ఇది ఒకరకంగా తమ్ముడు అనిల్‌పై అన్న ముకేశ్ సాధించిన విజయంగా కార్పొరేట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరో నాలుగురోజుల్లో(మే 11) పదవీ విరమణ చేయనున్న చీఫ్ జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి బెంచ్‌లో ఇతర సభ్యులు. ఇద్దరు సోదరుల గ్రూపు సంస్థల మధ్య గ్యాస్‌ను ఇచ్చిపుచ్చుకోవడానికిఉద్దేశించి అంబానీ కుటుంబ సభ్యుల మధ్య 2005 జూన్‌లో కుదిరిన అవగాహనా ఒప్పందాని(ఎంఓయూ)కి చట్టపరంగా, సాంకేతికంగా కట్టుబడి ఉండాల్సిన పనిలేదని కోర్టు తేల్చిచెప్పింది. వీరి నేతృత్వంలోని గ్రూపు సంస్థలు మరో ఆరు వారాల్లోగా పరస్పరం కూర్చుని చర్చించుకోవాలని, ప్రభుత్వ విధానానికి అనుగుణంగా గ్యాస్ సరఫరా ఒప్పందంపై మరోసారి సంప్రదింపులు జరపాలని కోర్టు ఆదేశించింది. ఆ విషయాన్ని ఎనిమిది వారాల్లోగా కోర్టుకు తెలియజేయాలని స్పష్టంచేసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్)కు చెందిన కృష్ణా గోదావరి బేసిన్(ఆంధ్రప్రదేశ్)లోని డీ6 క్షేత్రం నుంచి గ్యాస్ సరఫరా చేయడానికి ఒక ఎంఎంబీటీయూ(మిలియన్ మెట్రిక్ బ్రిటీష్ థర్మల్ యూనిట్)కు 4.20 అమెరికన్ డాలర్లుగా ప్రభుత్వం 2006లో ధర నిర్ణయించింది. అయితే ఒక ఎంఎంబీటీయూను 2.34 డాలర్లకే సరఫరా చేయాలని కోరుతున్న ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్- ప్రభుత్వ నిర్ణయాన్ని బొంబాయి హైకోర్టులో సవాలుచేసింది. ''ముకేశ్, అనిల్, వారి తల్లి(కోకిలాబెన్) మధ్య ప్రైవేటు కుటుంబ సర్దుబాటులాగా ఎంఓయూ కుదుర్చుకుని సంతకాలు చేశారు. ఇది కార్పొరేట్ ఛత్రఛాయల కిందికి రాదు. దీనిని షేర్‌హోల్డర్లు ఆమోదించలేదు. లేదా రిలయన్స్ సామ్రాజ్య విభజన పథకానికీ దీనిని అనుసంధానించలేదు. కాబట్టి సాంకేతికంగా, చట్టపరంగా ఈ ఎంఓయూకు కట్టుబడి ఉండాల్సిన పనిలేదు'' అని తీర్పును చదివిన జస్టిస్ సదాశివం స్పష్టంచేశారు. జస్టిస్ బాలకృష్ణన్, జస్టిస్ సదాశివం ఒకేరకమైన అభిప్రాయాలు వెల్లడించగా.. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాత్రం కాస్త భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ఇరు వర్గాలు కొత్త ఒప్పందంపై చర్చలు జరపడానికి, సర్దుబాటు చేసుకోవడానికి ఈ ఎంఓయూను ప్రాతిపదికగా వినియోగించుకోవచ్చునని బాలకృష్ణన్, సదాశివం పేర్కొనగా.. ఎంఓయూ అనేది ప్రైవేటు ఒప్పందం అని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని సుదర్శన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. చర్చలు ఎనిమిది వారాల్లోపు మొదలై ఆ తర్వాత ఆరువారాల్లోగా ముగించాలని ఆయన సూచించారు.
''ఎంఓయూలోని విషయాల్ని బహిర్గతం చేయలేదు. ప్రస్తుత విచారణలో కూడా వాటిని ముక్కలు ముక్కలుగా చెప్పారు. కాబట్టి ఈ ఎంఓయూ కార్పొరేట్ ఛత్రఛాయల్లోకి రాదు. ఉత్పత్తి పంపకం ఒప్పందం(పీఎస్‌సీ)లోని నిబంధనలు మిగతా వాటిపై ప్రభావం చూపేవిలా ఉన్నాయి. గ్యాస్ వినియోగ విధానం, జాతి ప్రయోజనాల విషయంలో ప్రభుత్వ విధానాన్ని సంబంధిత వర్గాలు ఉల్లంఘించకూడదు'' అని కోర్టు స్పష్టంచేసింది.
గ్యాస్ సరఫరా ఒప్పందంపై ఆర్‌ఐఎల్, ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్ సామరస్య పూర్వకంగా పునఃచర్చలు చేయాలంటూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్ గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఎంఓయూకు కట్టుబడాలని ఆదేశించడం ద్వారా దిగువకోర్టులు తప్పుచేశాయని, అది ప్రైవేటు ఒప్పందమైనందున దానికి కట్టుబడాల్సిన పనిలేదని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తేల్చిచెప్పారు. తీర్పును వినడానికి అనిల్ కోర్టుకు వచ్చారు. తీర్పు వెలువడ్డాక ఆయన విలేకరులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ముకేశ్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్‌సాల్వే, అనిల్ తరఫున రామ్‌జెఠ్మలానీ, కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ వాదనలు వినిపించారు. తీర్పు వెలువడిన వెంటనే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2.3 శాతం పెరగ్గా... ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్ షేర్లు 23 శాతం పడిపోయాయి. ఏమిటీ వివాదం? రిలయన్స్ వాణిజ్య సామ్రాజ్యాన్ని విభజించే పనిలో భాగంగా 2005 జూన్‌లో అంబానీ కుటుంబీకుల మధ్య ఎంఓయూ కుదిరింది. రిలయన్స్ సామ్రాజ్యాన్ని నిర్మించిన ధీరూభాయ్ అంబానీ మరణించిన మూడేళ్లలోగానే ఈ ఒప్పందం కుదిరింది. |
అనిల్ గ్రూపు వాదన ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్ ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలో 7,800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. దీనికి కేజీ బేసిన్‌లోని డి6 క్షేత్రం నుంచి గ్యాస్ సరఫరా చేయాలని అనిల్ గ్రూపు కోరుతోంది. ఎంఓయూలో భాగంగా ఎంఎంబీటీయూ (మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ ఎ డే) 2.34 డాలర్ల ధరకు 17 ఏళ్లపాటు 28 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్‌ను తన విద్యుత్ కర్మాగారానికి సరఫరా చేయాలని ఈ గ్రూపు కోరుతోంది. ఈ మేరకు 2008 జూన్ 18వ తేదీన బొంబాయి హైకోర్టు తీర్పు కూడా ఇచ్చిందని, దానిని అమలుచేయాలని వాదిస్తోంది. గ్యాస్‌ను ఇవ్వకుండా ఎగవేయడం కోసమే ధరలు, కేటాయింపులపై ప్రభుత్వ విధానాల్ని ఆర్‌ఐఎల్ సాకుగా చూపుతోందని విమర్శిస్తోంది. |
ముకేశ్ గ్రూపు వాదన ప్రభుత్వ ధరలు, వినియోగ విధానానికి విరుద్ధంగా వ్యవహరించలేమని ముకేశ్ గ్రూపు పేర్కొంటోంది. ప్రభుత్వం నిర్ణయించిన 4.2 డాలర్ల ధరను, గ్యాస్ పరిమాణం, కాలపరిమితిని ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్ ఆమోదిస్తే తప్ప గ్యాస్ సరఫరా చేయలేమంటోంది. ఎంఎంబీటీయూకు విలువకట్టిన 4.2 డాలర్లకు కాకుండా 2.34 డాలర్లకు గ్యాస్‌ను విక్రయిస్తే ప్రభుత్వం రూ.20వేల కోట్లకు పైగా కోల్పోతుందని ఈ గ్రూపు వాదిస్తోంది. బొంబాయి హైకోర్టు తీర్పును ముకేశ్ సుప్రీంకోర్టులో సవాలుచేశారు. |
ప్రభుత్వ వాదన భారత భూభాగంలో కనుగొనే హైడ్రో కార్బన్లపై సార్వభౌమాధికారం ప్రభుత్వానిదేనని కేంద్రం వాదిస్తోంది. సరఫరా, కాలపరిమితి, ధరల నిర్ణయంపై పూర్తి హక్కు కేంద్ర ప్రభుత్వానిదేనంటోంది. అంబానీ సోదరుల మధ్య కుదిరిన ఒప్పందం భారత చట్టాలకు విరుద్ధంగా ఉంది కాబట్టి దానిని కొట్టిపారేయాలంటోంది. |