Monday, May 3, 2010

సంప్రదాయం + నవ్యత

కార్పొరేట్‌ ప్రపంచం ఇప్పుడు మగమహారాజులకే పరిమితం కాదు.. బోర్డు రూముల్లో తమ చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ.. వేల కోట్ల సామ్రాజ్యాలను ఎంతో ధీరోదాత్తంగా నిర్వహిస్తున్న మహిళామణుల సంఖ్య రానురాను పెరుగుతోంది. వీరు చూడగానే ఆకట్టుకోవడంతో పాటు, తమకు సౌకర్యవంతంగా ఉండే వస్త్రధారణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మన మహిళా కార్పొరేట్లు అధిక శాతం భారతీయ సంప్రదాయానికే పెద్దపీట వేస్తున్నారు. అయితే విదేశీ ఖాతాదార్ల (క్లయింట్ల)తో కంపెనీకి సంబంధించిన లావాదేవీలు జరిపే సందర్భాల్లో మాత్రం పాశ్చాత్య వస్త్రధారణను ఇష్టపడుతున్నారు. తమ కంపెనీల ఉన్నతిని ప్రతిబింబించడంతో పాటు, ఆ స్థాయికి చేరాలనుకునే వారికి ఆదర్శంగా ఉండే దుస్తులనే ధరిస్తున్నారు. వయసుకు అనుగుణంగా వీరి వస్త్రధారణ క్రమేణా మార్పులు సంతరించుకుంటోంది. ఎవరెవరు ఎలాంటి వస్త్రధారణకు ప్రాధాన్యమిస్తారంటే..
* బ్యాంకింగ్‌ రంగ అగ్రశ్రేణి వ్యూహకర్తలైన చందా కొచ్చర్‌ (ఐసీఐసీఐ బ్యాంక్‌), నైనాలాల్‌ కిద్వాయ్‌ (హెచ్‌ఎస్‌బీసీ), మీరా సన్యాల్‌ (ఏబీఎన్‌ ఆమ్రో), శిఖా శర్మ (యాక్సిస్‌ బ్యాంక్‌), అపోలో హాస్పిటల్స్‌ ఎండీ ప్రీతా రెడ్డి వంటి వారు పట్టు చీరలవైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు.

* పిరమాల్‌ హెల్త్‌కేర్‌ డైరెక్టర్‌ స్వాతి పిరమాల్‌ కంటికి ఇంపుగా ఉండే, చూడగానే ఆకట్టుకునే చీరలతో పాటు సల్వార్‌ కుర్తా ధరించీ కనపడుతుంటారు.

* సులజ్జా ఫిరోడియా మోత్వానీ (కైనెటిక్‌ ఇంజినీరింగ్‌), రోషిణీ నాడార్‌ (హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌), ఆశినీ బియానీ (ఫ్యూచర్‌ గ్రూపు), దేవికా సరాఫ్‌ (వూ టెక్నాలజీస్‌) వంటి కార్పొరేట్‌ యువతులు స్కర్ట్‌లు, ప్యాంట్‌లలో కనిపిస్తారు.

* బయోకాన్‌ అధినేత్రి కిరణ్‌ మజుందార్‌ షా ఆరంభంలో జీన్స్‌ వంటివి ధరించినా, ప్రస్తుతం సంప్రదాయ సూట్‌లతో పాటు సిల్క్‌ స్కార్వ్స్‌ వినియోగిస్తున్నారు.

* స్థిరాస్తి వంటి పురుషాధిక్యత అధికంగా ఉండే రంగాల్లోని మహిళలు బిజినెస్‌ సూట్‌లను ఇష్టపడుతున్నారు. రీటా దీక్షిత్‌ (జేపీ గ్రీన్స్‌) అయితే బిజినెస్‌ సూట్‌తో పాటు స్కార్వ్స్‌తో కనపడుతుంటారు