Monday, May 3, 2010

గొప్పోడు ప్రేమ్‌జీ

ఆయన భారత బిల్‌గేట్స్‌: ఫోర్బ్స్‌్‌ పత్రిక కితాబు
వాషింగ్టన్‌: ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఒక ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలన్న దొడ్డ ఆలోచన భారత సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాల్లో ఒకటైన విప్రో టెక్నాలజీస్‌ అధినేత అజీం ప్రేమ్‌జీ మదిలో మెదులుతోంది! ఆ యూనివర్సిటీ నుంచి తయారై బయటకు అడుగుపెట్టే వారు దేశ వ్యాప్తంగా ఉన్న ఆరు వందల జిల్లాల టీచర్‌ ట్రయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లకూ వెళ్లిపోయి వారి కర్తవ్యాన్ని నెరవేర్చాలని ప్రేమ్‌జీ ఆశిస్తున్నారని 'ఫోర్బ్స్‌' పత్రిక తెలిపింది. అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌లో సరికొత్త విభాగంగా ప్రతిపాదిత విశ్వవిద్యాలయం రానుందట. భారత్‌లో విద్య ప్రమాణాలను పెంపొందించడంతో పాటు మోడల్‌ స్కూళ్లకు నిధులను అందిస్తున్న అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ తొమ్మిదేళ్ల కిందట ప్రేమ్‌జీ నాటిన మొక్క. దీనికి ఆయన ఒక్కరే సొంత నిధులను ధార పోస్తున్నారు. ఫౌండేషన్‌ విలువ రూ.450 కోట్ల కన్నా ఎన్నో రెట్లు ఉంటుందని ఫోర్బ్స్‌ వ్యాఖ్యానించింది. అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌ కంపెనీ వ్యవస్థాపకుడు, వితరణశీలి అయిన బిల్‌ గేట్స్‌ మాదిరిగానే ప్రేమ్‌జీ కూడా తన సంపదలో అధిక భాగాన్ని ఎంతో ఉదారంగా దానధర్మాలకు వెచ్చించాలని భావిస్తున్నారని పత్రిక బయటపెట్టింది. ''ఎక్కువగా పొందిన వారు, తిరిగి వెనుకకు ఇవ్వవలసింది కూడా ఎంతో ఉంటుంది'' అన్నదొక్కటే ఆయనెరిగిన దాతృత్వ సిద్ధాంతం అని పత్రిక వివరించింది. ప్రస్తుతం 17 బిలియన్‌ డాలర్ల (రూ.74,800 కోట్ల) ఐశ్వర్యంతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లోకెల్లా ప్రేమ్‌జీ 28వ స్థానంలో ఉన్నారు. తన ఆర్జనలో భీమ భాగాన్ని పెద్ద మనసుతో విరాళమిచ్చేసే పక్షంలో పిల్లల చదువుల కోసం స్వార్జితాన్ని ధారపోసిన ఆసియాలోని పారిశ్రామికవేత్తల్లో ఒక విశిష్ట వ్యక్తిగా ప్రేమ్‌జీ నిలుస్తారంది. విప్రో అవలంబిస్తున్న వితరణ కార్యకలాపాలకు, ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు పరస్పర సంబంధం లేదని, ఈ రెండూ కూడా వేటికవే వేరు వేరని పత్రిక శ్లాఘించింది. ''మిషన్‌ X'' అనే కార్యక్రమం భారత్‌లోని సమాచార సాంకేతిక విజ్ఞాన పరిశ్రమలో ఉద్యోగం సంపాదించుకొనేటట్లుగా ఇంజినీరింగ్‌ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించినదని, ఇక ''విప్రో కేర్స్‌'' అనే విభాగం విప్రో ఉద్యోగుల వద్ద నుంచి విరాళాలు తీసుకొని ఆ ధనాన్ని భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సహాయంగా అందిస్తోందని ఏకరవు పెట్టింది.