Monday, May 3, 2010

ఈ చల్లని గాలిలో... 'హాట్‌'కేకుల్లా అమ్ముడుపోతున్న ఏసీలు

కొత్త సదుపాయాలు ప్రత్యేక ఆకర్షణ
రేటింగ్‌కు అత్యధిక ప్రాధాన్యం
ఈసారి నూరు శాతం పెరగనున్న అమ్మకాలు
మండిపోయే ఎండలు.. బయటకు వెళ్దామంటే వడగాడ్పులు.. ఇంట్లో కూర్చుంటే ఉక్కబోత.. ఫ్యాన్‌ తిరుగుతున్నా.. సేద తీరలేని పరిస్థితి.. భానుడి ఉగ్ర రూపానికి విలవిలలాడుతున్న జనం ఆలోచన ఒక్కటే.. కాస్తంత ఖర్చులు తగ్గించుకుని.. వీలైతే అప్పు చేసైనా.. ఏసీ కొనుక్కుందాం అనుకోవడం. ఇదే ఆలోచన.. గృహోపకరణ కంపెనీల పంట పండిస్తోంది. ఎండా కాలం వీటికి 'చల్లటి కాలం'లా కలిసొస్తోంది.
ప్రస్తుతం శీతలీకరణ యంత్రాలు (ఎయిర్‌ కండిషనర్లు-ఏసీలు) హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఏసీల సందడి ఎక్కువగానే ఉంది. ప్రధాన మార్కెట్లలో.. ముఖ్యంగా దక్షిణాదిన అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే నూరు శాతం పెరగనున్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ముడి పదార్థాల ధరలు, ఇతర ఖర్చులు, పన్నుల కారణంగా ఈ ఏడాది ఏసీల భారం రూ.1,500 వరకు పెరిగినా వినియోగదారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. సదుపాయాలు, విద్యుత్‌ ఆదాను సూచించే 'నక్షత్ర' రేటింగ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు.

4 లక్షల ఏసీల విక్రయం!
ఈ ఏడాది మన రాష్ట్రంలో 4 లక్షల ఏసీలు విక్రయం కాగలవని అంచనా. ఇందులో 95 శాతం స్ల్పిట్‌ ఏసీలే ఉండనున్నాయి. గత సంవత్సరం అమ్మకాలు దాదాపు 2 లక్షల ఏసీలతో పోలిస్తే ఇది 100 శాతం పెరుగుదలని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. సగటున ఒక్కో ఏసీ ధర రూ.20,000 అనుకుంటే రాష్ట్ర విపణి విలువ రూ.800 కోట్లు. దేశవ్యాప్తంగా ఈసారి 35-40 లక్షల ఏసీలు అమ్ముడయ్యే వీలుంది. గత ఏడాది 25 లక్షలను విక్రయించినట్లు పరిశ్రమ వర్గాల అంచనా. ఈసారి వివిధ అంశాలు ఏసీ అమ్మకాలు పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని ప్రధాన గృహోపకరణ కంపెనీకి చెందిన అధికారి ఒకరు తెలిపారు.

కంపెనీల వ్యూహాలు
కంపెనీలు కూడా పెరుగుతున్న విపణిలో వాటా పెంచుకోవడానికి కొత్త సదుపాయాలు, ఆకర్షణలు, విక్రయానంతర సేవలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. విక్రయం తర్వాత ఏడాదిలో మూడుసార్లు ఉచిత సర్వీసింగ్‌ను ఎల్‌జీ అందిస్తోంది. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే బిగింపు (ఇన్‌స్టాల్‌), మరమ్మతు పూర్తయ్యే వరకు ప్రత్యమ్నాయ ఏసీ ఏర్పాటు వంటి సదుపాయాలను కొన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి. కేవలం తెలుపు రంగులో మాత్రమే కాక ఇతర రంగుల్లో, పెయింటింగ్‌లతో వస్తున్న ఏసీలు కొనుగోలుదారులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఎల్‌జీ, శామ్‌సంగ్‌, వోల్టాస్‌, వర్ల్‌పూల్‌, గోద్రేజ్‌, వీడియోకాన్‌, క్యారియర్‌, బ్లూస్టార్‌ తదితర కంపెనీలు ఏసీలను విక్రయిస్తున్నాయి. విండో ఏసీలకు ఆదరణ తగ్గుతోందని, స్ల్పిట్‌ ఏసీలే ప్రధాన మార్కెట్‌ అని హైదరాబాద్‌కు చెందిన డీలర్‌ తెలిపారు.

'అయిదు నక్షత్రాల'కు ప్రాధాన్యం
* ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఎండలు పెరిగాయి.

* గతంలో ఏసీ వల్ల ఎక్కువ విద్యుత్‌ ఖర్చవుతుందని వినియోగదారులు దూరంగా ఉండేవారు. ప్రస్తుతం విద్యుత్‌ ఆదా చేసే ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువ విద్యుత్‌ ఆదా అయ్యే అయిదు నక్షత్రాల రేటింగ్‌ ఏసీల అమ్మకాలు ఈసారి మొత్తం విక్రయాల్లో దాదాపు 25 శాతాన్ని మించే వీలుంది.

* మధ్య తరగతి వర్గాల్లో ఏసీలపై అవగాహన పెరగడంతోపాటు వారి ఆదాయాలు, ఖర్చు చేసే మొత్తాలు పెరుగుతున్నాయి.

* 0.75 టన్నుల నుంచి 2 టన్నుల వరకు వినియోగదారుల అవసరాలు, కొనుగోలు సామర్థ్యానికి అనుగుణంగా ఏసీలు లభిస్తున్నాయి. వీటి ధర రూ.16,000 నుంచి రూ.30,000 వరకు ఉంది.

* అన్నింటికీ మించి కొనుగోలుకు అప్పు లభిస్తోంది. కేవలం మొదటి నెలవారీ వాయిదా చెల్లించి వస్తువును ఇంటికి తీసుకువెళ్లే సదుపాయం కంపెనీలు కల్పిస్తున్నాయి.

కొన్ని గణాంకాలు
* దేశవ్యాప్తంగా 15 లక్షలు, రాష్ట్రంలో 1.6 లక్షల ఏసీలను విక్రయించాలని ఎల్‌జీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీజన్‌ ప్రారంభం కావడానికి ముందుగానే ఈ కంపెనీ కొత్తగా 16 మోడళ్లను విడుదల చేసింది. దాదాపు 50 మోడళ్లను విక్రయిస్తోంది.

* గత ఏడాది అయిదు లక్షల ఏసీలను విక్రయించిన శామ్‌సంగ్‌ ఈసారి 10 లక్షల స్థాయిని అధిగమించాలని భావిస్తోంది. ఏడాదికి 6 లక్షల స్ల్పిట్‌ ఏసీలను తయారు చేసే యూనిట్‌ను ఫిబ్రవరిలో నొయిడాలో ప్రారంభించింది.

* ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఏసీల విపణిలో 10 శాతం వాటాను సొంతం చేసుకోవాలని గోద్రేజ్‌ అప్లియన్సెస్‌ భావిస్తోంది. ఏడాది మొత్తంలో 4 లక్షల ఏసీలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

* చైనాకు చెందిన హేయర్‌ ప్రస్తుతం పరికరాలను దిగుమతి చేసుకుని ఇక్కడ ఒక చోట చేరుస్తోంది. ఈ కంపెనీ భారత్‌లో ఏసీల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

* వోల్టాస్‌ తదితర ఇతర కంపెనీలు సైతం ఏసీల విపణిపై ఆశావహంగా ఉన్నాయి.