తక్కువ వడ్డీరేట్ల గృహరుణాలకు కాలం చెల్లనుందా! అవునంటున్నారు బ్యాంకింగ్ విశ్లేషకులు. ఖాతాదారులను ఆకర్షించేందుకు ప్రవేశపెట్టిన టీజర్‌లోన్స్ (నిర్దిష్ట కాలానికి తక్కువ వడ్డీ రుణాలు ) కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఈ సంవత్సరం జూన్‌తో ముగింపు పలకనుంది. ఐసిఐసిఐ బ్యాంకు ఏప్రిల్ 30తోనే ఈ విధమైన టీజర్‌లోన్ స్కీమ్‌కు మంగళం పాడింది. ఎస్‌బిఐ ఏప్రిల్ 30 తేదీ తరువాత తీసుకునే గృహరుణాలకు కొన్ని సవరణలు చేసింది. రుణం తీసుకున్న తొలి సంవత్సరం 8 శాతం వడ్డీ వసూలు చేస్తుంది.
రెండు, మూడు సంవత్సరాలకు 9 శాతం వడ్డీ. నాల్గవ సంవత్సరం నుంచి 50 లక్షల రూపాయల వరకు గృహ రుణాలకు గీటురాయి ప్రైమ్ లెండింగ్ రేటు (బిపిఎల్ఆర్)కు 2.5 శాతం డిస్కౌంట్‌తో వడ్డీ ఉంటుంది. 50 లక్షల రూపాయల పైబడిన గృహరుణాలకు బిపిఎల్ ఆర్‌పై 2 శాతం డిస్కౌంట్‌తో వడ్డీ వసూలు చేస్తామని ఎస్‌బిఐ ప్రకటించింది. దీని బట్టి మూడు సంవత్సరాల తరువాత బిపిఎల్ఆర్ 12 శాతంగా ఉంటే 50లక్షలరూపాయల వరకు ఉండే రుణాలకు వడ్డీరేటు 9.5 శాతం, 50 లక్షలు పైబడిన రుణాలకు వడ్డీ 10 శాతంగా ఉంటుంది.
టీజర్ లోన్స్ నాంది పలికిన ఎస్‌బిఐ
ఎస్‌బిఐ గత ఆగస్టులో దేశంలో తొలిసారిగా మూడు నెలల కోసం ఈ టీజర్‌లోన్స్‌ను ప్రవేశపెట్టింది. దీనికి విశేష స్పందన లభించటంతో ఈ సంవత్సరం మార్చి 31 వరకు తొలుత పొడిగించింది. ఆ తరువాత మళ్లీ ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. ఇక ఈ స్కీమ్‌ను ఎస్‌బిఐ పొడిగించకపోవచ్చునని నిపుణులు అంటున్నారు.
ఆర్‌బిఐ ఆంక్షలు
బ్యాంకులు ప్రస్తుతం గృహరుణాలను ప్రైమ్ లెండింగ్ రేటు కన్నా తక్కువ వడ్డీకి ఇస్తున్నాయి.బ్యాంకులు ఈ పద్ధతికి స్వస్తి పలకాలని ఆర్‌బిఐ భావిస్తోంది. ఆర్‌బిఐ నూతన మార్గదర్శకాల ప్రకా రం పిఎల్ఆర్ స్థానంలో జూలై 1 నుంచి నూతనంగా బేస్ రేట్ సిస్టమ్స్ (బిఆర్‌సి) ను బ్యాంకులు అమలు చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త పద్ధతి కింద బ్యాం కులు ప్రకటించిన బిఆర్‌సి కంటే తక్కువ వడ్డీకి రుణాల ఇవ్వడానికి వీలుండదు. బ్యాంకుల బేస్‌రేటు 8-9 శాతం ఉంటుందని అంచనా. బ్యాంకులు ఒక నిర్ణీత కాలానికి బేస్‌రేటును ప్రకటించిన తరువాత అంతకంటే తక్కువ వడ్డీకి పరిమితి కాలానికైనా సరే రుణాలను ఇచ్చే అవకాశం లేనందన టీజర్ వడ్డీ రేట్ల యుగం ముగిసినట్లేనని బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు పేర్కొంటున్నారు.