దేశీయ కార్పొరేట్ రంగంలో ఎన్నడూ లేనంత సంచలనం సృష్టిస్తున్న అంబానీ సోదరుల కేజీ బేసిన్ గ్యాస్ వివాదం కేసుపై సుప్రీం కోర్టు రేపు తీర్పునిచ్చే అవకాశం ఉంది. దాదాపు ఐదేళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణపై వాదోవాదాలు డిసెంబర్18తో ముగిసిన తరువాత సుప్రీం కోర్టు తీర్పును వాయిదా వేసింది. సుప్రీం కోర్టు ప్రధానన్యాయ మూర్తి కెజి బాలకృష్ణన్ నేతృత్వంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి. జస్టిస్ సదాశివంలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి బాలకృష్ణన్ ఈ నెల 11న పదవీ విరమణ చేయనున్నందున అంత్యంత కీలకమైన, దేశ ఇంధన రంగాన్నే ప్రభావితం చేసే వేల కోట్ల రూపాయల కేజీ బేసిన్ గ్యాస్ పంపకం వివాదంపై సుప్రీం కోర్టు 11 తేదీ లోపునే తన తీర్పును వెలువరించగలదని భావిస్తున్నారు. సుప్రీంతీర్పు ఎవరి అనుకూలంగా ఉంటుందన్న విషయంపై ఇప్పటికే స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున స్పెక్యులేషన్ సాగుతోంది.