న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డులపై బ్యాంకులు చిత్తం వచ్చినట్లు వడ్డీరేట్లు వసూలు చేస్తుంటాయి. సక్రమంగా చెల్లించని వారి నుంచి ఫైన్‌ల రూపేణా మరికొంత గుంజుతాయి. ఇదెక్కడి న్యాయం అంటూ ఎదురు తిరిగితే ఖాతాలను థర్డ్‌పార్టీలకు అప్పజెప్పి గూండాయిజం చేసి మరీ డబ్బులు గుంజుతాయి. ఇప్పటివరకూ క్రెడిట్ కార్డులపై బ్యాంకులదే ఇష్టారాజ్యం. ఇకపై ఈ పప్పులేమీ ఉడకవు. క్రెడిట్ కార్డు లావాదేవీలపై గరిష్టంగా ఎంతమేరకు వడ్డీరేట్లను వసూలు చేయాలో నిర్ధేశించాలని ఫైనాన్స్‌పై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం ఒకటి రిజర్వు బ్యాంకుకు సూచించింది.
తద్వారా ఖాతాదారుల నుంచి ఇష్టం వచ్చినట్లు వడ్డీరేట్లు వసూలు చేసే అవకాశం బ్యాంకులకు ఉండదని సంఘం అభిప్రాయపడింది. నిజానికి క్రెడిట్ కార్డు రుణాలు ప్రత్యేకమైనవని, వీటిల్లో రిస్కు ఎక్కువగా ఉన్నందున వడ్డీరేట్ల నిర్ణయంలో తమకు స్వేచ్ఛ ఉండాలని బ్యాంకులు వాదిస్తున్నాయి. అయితే.. ఈ వాదనలను సంఘం తోసిపుచ్చింది. ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వ్యవహారంలో నెలకొన్న గందరగోళం, చిక్కులను నివారించడానికి ఆర్‌బిఐ మార్గదర్శకాలు ఉపయోగపడటం లేదని, ఆదేశాలు సూటిగా, స్పష్టంగా ఉండాలని పార్లమెంటరీ సంఘం సూచించింది.