Monday, May 3, 2010

గ్రీస్‌కు భారీ సాయానికి రంగం సిద్ధం


బెర్లిన్‌: తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గ్రీస్‌కు మల్టీ బిలియన్‌ యూరోల ఆర్థిక సహాయం అందించి అన్ని విధాల ఆదుకోవడానికి యూరో పియన్‌ యూనియన్‌, అంతర్జాతీయ ద్రవనిధి సంస్థ సిద్ధపడ్డాయి. ఈ సహా యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి గ్రీస్‌ ప్రభుత్వం కఠినమైన ఆర్థిక క్రమ శిక్షణా చర్యలు, అనేక వ్యవస్థాపక సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతోంది. గ్రీస్‌ దేశం 300 బిలియన్‌ యూరోల మేరకు సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలి సిందే. ఈ దేశాన్ని ఆదుకునేందుకు యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన 16 దేశాలు ఆదివారం బ్రస్సెల్స్‌లో సమావేశమయ్యాయి.

జర్మనీ ఛాన్సలర్‌ యాం జిలా మెర్కెల్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు నికోలాస్‌ సర్కోజీ గ్రీస్‌ పునురుద్ధరణకు కాలయాపన లేకుండా సంయుక్తంగా 120 బిలియన్‌ యూరోల సహాయం మూడు సంవత్సరాల పాటు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దివాలా తీసిన గ్రీస్‌కు సమగ్ర సహాయం అందించేందుకు జర్మనీ, ఫ్రాన్స్‌లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి. అందుకు తాము తీసుకున్న చర్యలను వచ్చే వారం ఆ దేశాలు పార్లమెంట్‌ ముందు ఉంచనున్నాయి. గ్రీస్‌ సహాయం ఏవిధంగా అందించాలనే దానిపై యూరోపియన్‌ కమీషన్‌, యూరోపియన్‌ కేంద్ర బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ గ్రీకు ప్రభుత్వం వరుసగా మూడు వారాల పాటు చర్చలు జరిపాయి. తొలుత గ్రీస్‌కు 45 బిలియన్‌ యూరోల సహాయం అందించే విషయం తొక్కిపట్టిన యూరోపియన్‌ యూనియన్‌, ఐఎంఎఫ్‌ తరువాత మనసు మార్చుకుని గత నెలల 11న పచ్చజెండా ఊపాయి.

2011 నాటికి గ్రీస్‌ స్థూల జాతీయోత్పత్తిలో లోటును 13.6 శాతం నుండి 3.6 శాతానికి తగ్గించుకోవాలని ఈ రెండు దేశాలు గ్రీస్‌ ప్రభుత్వానికి సూచించాయి. కఠిన ఆర్ధిక క్రమశిక్షణ పాటించడం ద్వారా జర్మనీ, ఫ్రాన్స్‌లు అందించే సహాయంలో కనీసం మూడేళ్ళలో 24 బిలియన్‌ యూరోలను పొదపు చేయాలని గ్రీస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. యూరోజోన్‌లోని దేశాలు 30 బిలియన్‌ యూరోల సహాయం గ్రీస్‌కు తొలి ఏడాది అందించడానికి సిద్ధపడ్డాయి. ఐఎంఎఫ్‌ కూడా 15 బి.యూరోలు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే యూరోపియన్‌ యూనియన్‌లో పెద్ద దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్‌లు తొలి ఏడాది తమ వంతుగా 8.4, 6.3 బిలియన్‌ యూరోలు సహాయం అందిస్తాయి.

తరువాత రెండేళ్ళు జర్మనీ ఒక్కటే అదనంగా 17 బిలియన్‌ యూరోలను గ్రీస్‌కు అందిస్తుంది. 1990 దశకం చివరిలో దక్షిణ కొరియా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఐఎంఎఫ్‌ 21 బిలియన్‌ డాలర్ల సహాయం అందించింది. ఇప్పుడు గ్రీస్‌కు చేస్తున్న సహాయం దానిని మించవచ్చునని భావిస్తున్నారు. ఇదిలాఉండగా గ్రీస్‌ను దివాలా ఇక్కట్ల నుండి తప్పించడానికి జర్మనీ బ్యాంకులు, బీమా కంపెనీలు, పారిశ్రామికవేత్తలు ప్రైవేట్‌గా నిధులు సేకరిస్తున్నారు. 2 బిలియన్‌ యూరోలకు గ్రీస్‌ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా ఈ రుణ సహాయం చేస్తున్నారు. గ్రీస్‌ సెగ ఇతర యూరోపియన్‌ దేశాలకు సోకకుండా మార్కెట్ల స్థిరత్వానికి ఈ చర్య దోహదం చేస్తుందని రేటింగ్‌ ఏజెన్సీ స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌ భావిస్తోంది. గ్రీస్‌ ప్రభావం ఇప్పుడిప్పుడే పోర్చుగల్‌, స్పెయిన్‌, ఐర్లాండ్‌, ఇటలీ దేశాలపై కూడా పడుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. జర్మనీ ప్రభుత్వం 31 బిలియన్‌ యూరోల గ్రీస్‌ బాండ్లను కొనుగోలు చేసింది.