సాధారణంగా మే నెలకు, మార్కెట్ ఆటుపోట్లకు అవినాభావ సంబంధం ఉంది. ఏ ఏడాది చూసినా మే నెలలో భారీగా పడడం లేదా భారీగా పెరగడం వంటి అంశాలు చోటు చేసుకున్నాయి. మే నెల వచ్చిందంటే ఇన్వెస్టర్లు, ట్రేడర్ల గుండెల్లో గుబులు పుట్టడం సహజం. కాని ఇది ఎల్లప్పుడూ నిజం కూడా కాదు. గత 18 సంవత్సరాల కాలంలో మే నెలలో నికర సగటు పెరుగుదల 0.19 శాతం ఉంది. విభిన్నమైన విశ్లేషణ చేయడం వల్ల మార్కెట్‌పై సరైన అభిప్రాయం ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
మే నెలలో మార్కెట్ తీరుతెన్నులను గమనిస్తే బేసి సంవత్సరాల్లో పతనం, సరి సంవత్సరాల్లో పెరుగుదల చోటు చేసుకున్నట్టు గమనించవచ్చు. సగటున బేసి సంవత్సరాల్లో పతనం 8.50 శాతం ఉంటే వృద్ధి 8.90 శాతం ఉంది. సగటు హెచ్చుతగ్గులు (గరిష్ఠ ఇండెక్స్‌కు, కనిష్ఠ ఇండెక్స్‌కు మధ్య తేడా) మే నెలలో 14 శాతం ఉంది. పక్క పట్టిక చూస్తే తొమ్మిది సరి సంవత్సరాల్లో ఎనిమిది సంవత్సరాలు మార్కెట్ పెరిగిందని, 9 బేసి సంవత్సరాల్లో 8 సంవత్సరాలు మార్కెట్ ప డిందని అవగతం అవుతుంది. (మొత్తం మీద సగటు పతనం 8.53 శాతం) ఈ విశ్లేషణ గణాంకపరమైనది. రవి, శుక్రుడు, బృహస్పతి, బుధుడు ఉన్న గతుల ఆధారంగా చేసే జ్యోతిష్యపరమైన విశ్లేషణ ఈ వ్యాసం వెలుపలి పరిధిలోనిది.
2010 సరి సంవత్సరం. గత 18 సంవత్సరాల్లో ఏర్పడిన సగటు పతనం 8.5 శాతం ఆధారంగా చూస్తే ఈ మే నెలలో ఇదే తరహా పతనం ఉంటుందనుకోవచ్చునా? పైన సూచించిన గణాంకాలకు జ్యోతిషపరమైన విశ్లేషణను కూడా జోడించి చూస్తే మే 20లోగా మార్కెట్ పడేందుకే అధికంగా ఆస్కారం ఉన్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. టెక్నికల్‌గా కూడా మార్కెట్ లోయర్ టాప్‌లు సాధించింది.
నిఫ్టీ 5160 కన్నా దిగజారితే లోయర్ బాటమ్ కూడా ఏర్పడి బలహీనతను ధ్రువీకరిస్తుంది. మార్కెట్‌లో సగటు పతనం ఎనిమిది శాతం ఉంటుందనుకుంటే నిఫ్టీ 400 పాయింట్ల మేరకు పతనమై మరోసారి 4800 స్థాయికి దిగజారవచ్చు. కాని ఆర్థిక రంగం ఫండమెంటల్స్, మార్కెట్‌లోకి నిధుల రాక, ఇన్వెస్టర్ల సెంటిమెంట్, భౌగోళిక రాజకీయ అంశాల ఆధారంగా మార్కెట్ కదలికలు ఉంటాయి గనుక కాలం మాత్రమే మార్కెట్ గతిని నిర్దేశిస్తుంది.