Monday, May 3, 2010

ముగ్గురు భారతీయ సీఈఓలకు యూఎస్‌లో భారీ పారితోషికాలు

న్యూయార్క్‌: భారతీయ సంతతికి చెందిన ముగ్గురు వ్యాపార వేత్తలు అమెరికాలో 500 అతి పెద్ద కంపెనీలకు చెందిన అత్యధిక పారితోషికం అందుకొంటున్న ముఖ్య కార్య నిర్వహణాధికారుల (సీఈఓల) జాబితాలో స్థానం సంపాదించారు. 'ఫోర్బ్స్‌' పత్రిక రూపొందించిన ఈ జాబితాలో శీతల పానీయాల కంపెనీ పెప్సికో నుంచి ఇంద్ర నూయి, ఔషధ కంపెనీ క్వెస్ట్‌ డయాగ్నస్టిక్స్‌ నుంచి సూర్య ఎన్‌.మహాపాత్ర, సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం అడోబ్‌ సిస్టమ్స్‌ నుంచి శంతను నారాయణ్‌లు ఎంపిక అయ్యారు. వీరు ముగ్గురు భారతీయ సంతతి వారే. ఇంద్ర నూయి 93వ స్థానాన్ని, మహాపాత్ర 96వ స్థానాన్ని నారాయణ్‌ 425వ స్థానాన్ని అలంకరించారు. ఇంద్ర నూయి పారితోషికం 10.66 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.46.90 కోట్లు). సూర్య మహాపాత్రా వార్షిక పారితోషికం 10.29 మి. డాలర్లు (దాదాపు రూ.45.27లక్షలు) కాగా, శంతను నారాయణ్‌ 1.88 మి. డాలర్ల (సుమారు రూ.4.78 కోట్లు) పారితోషికం పొందారు. అత్యధికంగా 141.36 మిలియన్‌ డాలర్ల పారితోషికంతో దనహెర్‌ కంపెనీ సీఈఓ హెచ్‌.లారెన్స్‌ కల్ప్‌ జూనియర్‌ ఒకటో స్థానం దక్కించుకొన్నారు. ఒరాకిల్‌ సీఈఓ లారెన్స్‌ జె.ఎలిసన్‌ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. న్యూస్‌ కార్ప్‌కు చెందిన రూపర్ట్‌ ముర్డోక్‌ 53వ స్థానంలోనూ, గోల్డ్‌మన్‌ శాక్స్‌కు చెందిన లాయిడ్‌ సి.బ్లాంక్‌ఫీన్‌ 472వ స్థానంలో వచ్చారు. 'ఈ 500 అతి పెద్ద కంపెనీల సీఈఓలు అందుకుంటున్న మొత్తం పారితోషికాల్లో గత మూడేళ్లుగా క్షీణత కనిపిస్తోంది. తాజాగా పారితోషికాలు 30 శాతం దాకా తగ్గాయి. గడిచిన మూడేళ్లలో ఇంత భారీగా తగ్గుదల చోటు చేసుకోవడం ఇదే ప్రథమం. గత రెండేళ్లలో వరుసగా 11శాతం, 15 శాతం మేర పారితోషికాల చెల్లింపులు తగ్గుముఖం పట్టాయి' అని ఫోర్బ్స్‌ పత్రిక పేర్కొంది.