Monday, May 3, 2010

ఇక చిన్నోళ్లూ పెద్దోళ్లూ ఒక్కటే

ఐపీఓ షేర్ల బిడ్డింగ్‌లో ఇద్దరూ సమానమే
సంస్థాగత మదుపుదార్లూ 100% నగదు చెల్లించాల్సిందే
నేటి నుంచి సెబీ కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: నేటి నుంచి సెబీ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం రిటైల్‌, సంస్థాగత మదుపుదార్లను పబ్లిక్‌ ఆఫర్లలో షేర్ల బిడ్డింగ్‌ విషయంలో ఒకేలా పరిగణిస్తారు. దీంతో రిటైల్‌ మదుపర్లలాగే సంస్థాగత మదుపుదార్లు సైతం పబ్లిక్‌ ఇష్యూలకు 100 శాతం నగదును చెల్లించాల్సి ఉంటుంది. 'ఈ చర్య కారణంగా ఇష్యూలకు స్పందన తక్కువగా నమోదు కావచ్చు. అంతే కాదు వదంతులను తగ్గించి బాధ్యతను పెంచుతుంది. దీర్ఘకాలంలో ఇది చాలా మంచిని చేస్తుంద'ని సెలెంట్‌ ఆర్థిక విశ్లేషకులు అన్షుమాన్‌ జస్వాల్‌ చెబుతున్నారు. సెలెంట్‌ ఒక ఆర్థిక పరిశోధక సంస్థ. 'మామాలుగా అయితే ఇది ఇష్యూల సబ్‌స్క్రిప్షన్‌పై ప్రభావం చూపుతుంది. అయితే సంస్థాగత మదుపుదార్లు అతిగా స్పందించకుండా.. వారు పెట్టుబడి పెట్టాలని భావించిన మొత్తానికే దరఖాస్తు చేస్తార'ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌(ప్రైవేట్‌ బ్రోకింగ్‌, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌) వినోద్‌ శర్మ అంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ'ఇది ఏదైనా ఒక ఇష్యూకు మోసపూరిత పద్ధతుల్లో ఎక్కువ స్పందన రాకుండా అడ్డుకుంటుంద'ని సీఎన్‌ఐ రీసెర్చ్‌ సీఎండీ కిశోర్‌ చెబుతున్నారు.

అంతక్రితం 10 శాతమే..ఇపుడు 100%
నిన్నటి వరకూ క్యూఐబీలు పబ్లిక్‌ ఇష్యూలకు మార్జిన్‌ నగదు మొత్తంగా తాము పెట్టుబడి పెట్టాలనుకున్న మొత్తంలో కేవలం 10 శాతం చెల్లిస్తే సరిపోయేది. ఇకపై వీరు రిటైల్‌ మదుపర్లలాగా తమ దరఖాస్తులతో పాటు 100 శాతం మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. ప్రసుతతం మార్కెట్లో మూడు ఇష్యూలు నడుస్తున్నాయి. అవి జేపీ ఇన్‌ఫ్రాటెక్‌, తారా హెల్త్‌ ఫుడ్స్‌, సట్లజ్‌ జల్‌ విద్యుత్‌ నిగమ్‌.

ఈ రోజు నుంచి ఇది కూడా
కంపెనీలు పబ్లిక్‌ ఆఫర్‌ ముగిసిన అనంతరం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడానికి ఇచ్చే సమయాన్ని 12 రోజులకు తగ్గిస్తూ సెబీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మార్గదర్శకాలు కూడా ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయి. అంతక్రితం లిస్టింగ్‌ సమయం 24 రోజులుగా ఉండేది. ఇష్యూకొచ్చిన కంపెనీ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకూ ఇష్యూలో కొంత మేర కేటాయించడానికి అనుమతివ్వాలనీ సెబీ నిర్ణయించింది.


మదుపర్లలో స్పృహను పెంచండి: యాంఫీ
న్యూఢిల్లీ: మదుపర్లలో ఫండ్లపట్ల స్పృహను పెంచాలంటూ అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆఫ్‌ ఇండియా(యాంఫీ) ఫండ్‌ సంస్థలను కోరింది. ఇందు కోసం నెలకు 200 వరకూ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపింది. 'మరింత చేరువ కావడం కోసం ఒక్కో సంస్థను నెలకు నాలుగు నుంచి ఐదు కార్యక్రమాలను నిర్వహించాలని వారికి సూచించామ'ని యాంఫీ ఛైర్మన్‌ ఎ.పి. కురియన్‌ పీటీఐతో అన్నారు. ప్రస్తుతం పరిశ్రమలో 36 ఫండ్‌ సంస్థలు ఉన్నాయి. ఆ లెక్కన దాదాపు నెలకు 200 వరకు కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇవి ఎక్కువగా మెట్రో నగరాల్లో నిర్వహించే అవకాశం ఉన్నా టైర్‌ II, టైర్‌ III నగరాలు, జిల్లాల్లోకీ వీటిని తీసుకెళ్తామని కురియన్‌ పేర్కొన్నారు. బ్రోకర్ల సహాయం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా పథకాల్లో పెట్టుబడులు పెట్టవచ్చని మదుపర్లకు తెలియజెప్పేందుకు యాంఫీ ప్రయత్నిస్తోంది.