Monday, May 3, 2010

బ్యాంకులు ఇప్పటిదాకా భేష్‌

ఆర్థిక ఫలితాల్లో జోరు
లాభంలో సగటు వృద్ధి 32 శాతం
ప్రైవేట్‌ బ్యాంకుల ముందంజ
ర్థిక ఫలితాల ప్రకటన విషయంలో బ్యాంకులు జోరును ప్రదర్శించాయి. ఇప్పటి వరకూ ప్రకటించిన 12 బ్యాంకులూ మెరుగైన వృద్ధినే కనబరచాయి. సగటున 32 శాతం నికర లాభాన్ని ఆర్జించాయి. ఇందులో భీమ భాగం ప్రైవేటు బ్యాంకులదే కావడం గమనార్హం. ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల నికరలాభాలు వరుసగా 93%, 32%, 32%, 35% చొప్పున వృద్ధిని నమోదు చేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇండియన్‌ బ్యాంకు మాత్రమే 4.03 శాతం వృద్ధితో సరిపెట్టుకుంది.

మెరుగ్గా ఎలా రాణించాయంటే..
బ్యాంకులు కొన్ని విషయాల్లో ఒత్తిడిని చవిచూసినా మరికొన్ని విషయాల్లో గణనీయ వృద్ధిని కనబరడం మొత్తం మీద వృద్ధికి కారణమైంది.

* ఇతర ఆదాయాలు ఒత్తిడిలో ఉన్నా రుణాలు వృద్ధి చెందడంతో పాటు నికర లాభం కూడా పెరగడం గమనార్హం. మరో పక్క ఆర్జించిన వడ్డీ ఆదాయంతో పోలిస్తే వడ్డీ వ్యయాలు తగ్గడంతో నికర వడ్డీ మార్జిన్లు పెరిగాయి. ఇవి 2.4-4.4 శాతం మేర పెరిగాయ్‌.

* బ్యాంకుల మార్క్‌-టు-మార్కెట్‌ నష్టాలు పెరిగినా ప్రొవిజన్లు, చిల్లర ఖర్చులు తగ్గడం చాలా వరకు బ్యాంకుల లాభాలకు ఊతమిచ్చాయి.

* అన్ని బ్యాంకుల ఇతర ఆదాయాలు(అదర్‌ ఇన్‌కమ్‌) కాస్త తగ్గాయి. 2009 మార్చితో పోలిస్తే ఫలితాలు ప్రకటించిన 12 బ్యాంకుల ఇతర ఆదాయాలు 3 శాతం కుంగాయి.

* అడ్వాన్సులు 10 శాతం మేర పెరిగాయి. అదే ఐసీఐసీఐ బ్యాంకును మినహాయిస్తే మిగతా 11 బ్యాంకుల అడ్వాన్సుల పెరుగుదల 22 శాతంగా ఉంటోంది. ఈ బ్యాంకు రుణాలు 17 శాతం మేర తగ్గడంతో అడ్వాన్సుల్లో క్షీణత కొనసాగింది.

నికర వడ్డీ ఆదాయాలూ పెరిగాయ్‌
మార్చి త్రైమాసికం చివరినాటికి తక్కువ వడ్డీ భారం ఉండే డిపాజిట్లు(లోకాస్ట్‌ డిపాజిట్స్‌) అన్ని బ్యాంకుల్లోనూ పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకులో ఈ డిపాజిట్లు ఏడాది వ్యవధిలో 28.7 శాతం నుంచి 41 శాతానికి పెరిగాయి.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకుల్లోనూ ఇదే తరహాలో పెరిగాయ్‌. వీటితో పాటు టర్మ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లలో సవరణ సైతం బ్యాంకు నికర వడ్డీ ఆదాయాలు 30 శాతం పెరగడానికి తోడ్పడ్డాయి. అయితే వడ్డీ ఆదాయంలో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు.

ఎనిమిది బ్యాంకుల్లో స్థూల నికర మొండి బకాయిలు 2009 మార్చితో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. ఇది బ్యాంకులకు ఆందోళన కలిగించే విషయమే అయినా పన్నెండింట 9 బ్యాంకుల్లో రుణాల వసూళ్లు క్రమంగా పెరుగుతూ ఉండడం కూడా శుభసూచకం.

భవిష్యత్‌ మాటేమిటి?
ఈ త్రైమాసికంలో బ్యాంకులకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చొని విశ్లేషకులు అంటున్నారు. ఈ త్రైమాసికంలో బ్యాంకులు నిధుల వ్యయాన్ని తగ్గించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ద్రవ్యలభ్యత తగ్గడంతో ఇప్పటికే కొన్ని బ్యాంకులు తమ డిపాజిట్‌ రేట్లను 25-50 బేసిస్‌ పాయింట్ల మేర పెంచాల్సి వచ్చింది. తక్కువ వడ్డీ భారం ఉండే డిపాజిట్లు పెరగడంతో పాటు ఆ డిపాజిట్లను లెక్కించడంలో చేసిన మార్పులు( రోజువారీ వడ్డీ చెల్లింపులు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే) నిధుల వ్యయంపై కొంత ప్రభావాన్ని చూపొచ్చు. ఇక ఇతర ఆదాయం కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది. రిజర్వు బ్యాంకు కీలక రేట్లను పెంచుతూ పోతుండడం ఇందుకు కారణం. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్‌) పెంపుతో మార్జిన్లపై ఒత్తిడి పడబోతోండగా.. రెపో రేటు పెంపుతో ట్రెజరీ పోర్ట్‌ఫోలియోపై ప్రభావం పడనుంది. మొత్తం మీద అవి ఈ త్రైమాసికంలో ఒత్తిడిని తగ్గించుకోవాలంటే రుణ రేట్లను పెంచాల్సి ఉంటుంది.

అయితే ప్రైవేటు బ్యాంకులైన యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులకున్న తక్కువ ప్రొవిజనింగ్‌, వ్యాపారంలో వృద్ధి కారణంగా 2010-11లో నికర లాభంలో వృద్ధి 30 శాతానికి మించి నమోదు కాగలదని విశ్లేషకులు చెబుతున్నారు.