హైదరాబాద్: టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా కలల కారు నానో ’ప్రియం’ కానుంది. లక్ష రూపాయలకే కారును అందిస్తామని ప్రకటనలు చేసి తీరా విడుదల సమయానికి పలు వేరియంట్లతో సందడి చేసిన టాటా మోటార్స్ సంస్థ, మాట మీద నిలబడాలంటే నానో కారు ఉత్పత్తికి అయ్యే ఖర్చును భరించాలి లేదా కస్టమర్లపై ఈ భారం వేయాలి. సామాన్య ప్రజలకు లక్ష రూపాయలకే కారును అందిస్తామన్న మాట నిలబెట్టుకోవాలో... కారు ఉత్పత్తికి అయ్యే బెంచ్‌మార్క్ ఉత్పత్తుల భారాన్ని భరించాలో సంస్థ తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2003 సంవత్సరంలో నానో కారు ప్రకటన చేసినప్పుడు కారు బాడీ పానెల్‌లలో వాడే ఉక్కు ధర అప్పట్లో 399 డాలర్లుగా ఉంది.
ఇది గడిచి ప్రస్తుతం ఏడు సంవత్సరాలు గడుస్తున్నాయి. ప్రస్తుతం స్టీల్ ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో కారు ఉత్పత్తిలో సంస్థకు ఉక్కు కోసం అయ్యే ఖర్చు భారం కానుంది. ఈ ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కూడా కనిపించకపోవడంతో ముడి పరికరాల సరఫరా దారులు టాటా మోటార్స్ సంస్థపై ధర పెంచాలని ఒత్తిడి తెస్తున్నారు. సామాన్యుడి కారు నానో బరువులో సగభాగం ఉక్కుదే ఉంటుంది కాబట్టి, ధరల విషయంపై సంస్థ ఆలోచనలో పడింది. ముందు ప్రటించినట్టుగా లక్ష నానో కార్లను స్టాండర్డ్ మోడల్‌లో డీలర్ ధర (రూ.లక్ష)కే అందిస్తామని టాటా సంస్థ గతంలో ప్రకటించింది. లక్ష కార్ల డెలివరీలను అందించడం అటుంచితే, టాటా మోటార్స్‌కు కారు ప్యానెల్‌లను అందించే కాపరో సంస,్థ 5-7శాతంగా ధరలను పెంచమని టాటాను డిమాండ్ చేసింది.
గత ఏడాది 2009 సెప్టెంబరు మాసం నుంచి ఉక్కు ధరలు పెరగడంతో కాపరో సంస్థ పెరిగిన 18శాతం ఉక్కు భారాన్ని మోయలేక ఈ డిమాండ్‌ను బయటపెట్టింది. స్టీల్ ధరలు పెరిగితే ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్షరర్స్ (ఒఈఎం) లపైనే ఆ భారం పడుతుందని, తద్వారా ఒఈఎంలు ఖర్చును భరించాలా లేదా, కస్టమర్లపై మళ్ళించాలా అనే నిర్ణయం వారి చేతుల్లోనే ఉంటుందని కాపరో సంస్థ అధికారులు చెబుతున్నారు. కారు ఉత్పత్తికయ్యే ముడి సరుకుల ఉత్పత్తి ధరలు పెరిగితే ఆ భారాన్ని తప్పకుండా కారు సంస్థలే భరించాలని సోనా కొయో స్టీరింగ్ సిస్టమ్స్ సంస్థ ఛైర్మన్, ఎండీ సురీందర్ కపూర్ అన్నారు. ఈ విషయాలను ఖాతాదారులు అర్థం చేసుకోవా లని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా టాటా మోటార్స్ మాత్రం తాము అన్న మాట మీద కట్టుబడి ఉంటామని, తొలి లక్ష కస్టమర్లకు డెలివరీను రూ.లక్షకే అందిస్తామని సంస్థ అధికారులు అంటున్నారు.
అంటే తక్కువ మార్జిన్లను భరిస్తూ టాటా సంస్థ నానో ఉత్పత్తులను అందించడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు. టాటా నానో కారు ఉత్పత్తి ప్రారంభంలో పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్ ప్రాంతంలో అనుకున్న సమయంలో అధిక స్టీలు ధరల కారణంగా తక్కువ మార్జిన్లను సంస్థ నమోదు చేసిందని, ఆ తరువాత ఉత్తరాఖండ్ ప్రాంతంలోని పంత్‌నగర్‌కు ఉత్పత్తి కేంద్రాన్ని మార్చిన సమయంలో స్టీలు ధరలు గణనీయంగా పడిపోవడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. ప్రస్తుత పరిస్థితులలో ఎంట్రీ లెవల్ డీలర్ ధరకు నానో కారును ఉత్పత్తి చేయడం టాటా మోటార్స్ సంస్థకు ఓ సవాలేనని కాంపోనెంట్ వ్యాపారులు తెలిపారు.
స్టీలు ధరలు మండిపోతున్నా టాటా నానో కారు వ్యాపారాన్ని ఇప్పటికీ లాభదాయకంగా భావిస్తోంది. మార్కెట్లో నానోకు పోటీగా మారుతీ ఉంది. తాజాగా కారు ఉత్పత్తి ముడి సరుకుల ధరల కారణంగా మారుతీ సంస్థ నాలుగవ త్రైమాసికంలో ఆదాయ మార్జిన్లు 70 బేస్ పాయింట్లకు పడిపోయాయి.
స్టీలు, కాపర్, నికెల్ ముడిపదార్థాల ధరలు పెరగడమే తమ సంస్థ మార్జిన్లపై ప్రభావం చూపాయని మారుతీ సంస్థ ప్రకటించింది. ఈ విషయంతో టాటా నానో కారును పోల్చలేకపోయినా, మార్జిన్లను దక్కించుకునేందుకు ఇంకా కొంత సమయం చేతిలో ఉంది.
ఇదిలాఉండగా ఇప్పటికే టాటా నానో కారు బుకింగ్స్‌లో సగ భాగం టాప్ ఎండ్ వెర్షన్-ఎల్‌ఎక్స్ మోడల్‌కు నమోదయ్యాయి, మిగతా 30శాతం మిడిల్ లెవెల్ సిఎక్స్ మోడల్‌కు నమోదయ్యాయని, తక్కినవి ఎంట్రీ లెవల్ (స్టాండర్డ్ మోడల్) కు బుకింగ్స్ వచ్చాయని సంస్థ తెలిపింది. అంటే ఎంట్రీ లెవల్ మార్కెట్ అత్యంత చిన్న వాటా టాటాలకు నమోదు చేస్తుంది. దీంతో పెద్దగా సంస్థపై మార్జిన్ల ప్రభావం ఉండదనేనది టాటా మోటార్స్ ధీమా. కొత్తగా మళ్ళీ టాటాలు ఎటువంటి బుకింగ్స్ ఇంకా స్వీకరించలేదు కాబట్టి ధరల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని టాటా మోటార్స్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ విషయాలు ఎలా ఉన్నా, కారు కోసం ఎదురు చూస్తున్న మధ్యతరగతి జీవులకు, ధరలు పెరిగితే మాత్రం లక్ష రూపాయల నానో కారు మళ్ళీ సామాన్యుడికి ఓ కలగానే మిగిలిపోతుందేమో..!
