Wednesday, May 5, 2010

నింగి నుంచి నేలకు

హైదరాబాద్‌: వ్యవసాయోత్పత్తులు గణంగా ఉంటున్నప్పటికీ గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా బియ్యం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. ప్రభుత్వం బియ్యం ధరలు తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా బహిరంగ మార్కెట్‌లో వాటిపై నియంత్రించలేని పరిస్థితి నెలకొంది. మార్కెట్‌ పై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడం, రాష్ట్రంలో ఉత్పతె్తైన ధాన్యంలో అత్యధిక మొత్తం లెవీ కింద కేంద్రానికి అందజేయడం, అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోవడం వంటివి బియ్యం ధరల పెరుగుదలకు కీలకమైన కారణాలుగా భావిస్తున్నారు. అయితే బియ్యం ధరలపై నియంత్రణ సాధించేందుకు ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఈ మేరకు లెవీ లక్ష్యాలను ఈ సారి తగ్గించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏటా మన రాష్ట్రంలో కోటిన్నర మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తవుతుంది. ఇందులో సగానికిపైగా లెవీ కింద కేంద్రానికి బియ్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. కిందటేడాది మన రాష్ట్రం నుంచి ఎఫ్‌సీఐ లెవీ కింద 80 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సమకూర్చింది. అయితే రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని లెవీని ఈ ఏడాది 62 లక్షల మెట్రిక్‌ టన్నులకు కుదించినట్లు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా మార్కెట్‌లో అవసరమైన మేరకు బియ్యం అందుబాటులో ఉండేలా చూడడం ద్వారా ధరలను నియంత్రించాలని యోచిస్తున్నట్లు పౌర సరఫరాలకు చెందిన అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి నిర్దేశించిన మేరకు కేంద్రానికి లెవీ బియ్యం సేకరించి ఇవ్వనున్నట్లు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు 42 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించినట్లు వారు తెలిపారు. ఇందులో 32 లక్షల మెట్రిక్‌ టన్నుల పచ్చిబియ్యంతోపాటు, 10 లక్షల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ రైస్‌ ఉన్నట్లు పౌర సరఫరాలకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మంగళవారంనాడు ‘సూర్య’ ప్రతినిధికి తెలిపారు. ఇదిలా ఉండగా గత ఖరీఫ్‌లో పండించిన ధాన్యం బస్తా సన్నరకాలు రూ.1100 లకు మించి కొనడం లేదంటున్నారు. ఇక రబీ ధాన్యం కూడా మార్కెట్‌లోకి వచ్చేసింది. బస్తా రూ. ఆరు, ఏడు వందలకు మించి ధర పలకడం లేదని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితులన్నీ విశ్లేషిస్తే త్వరలో అన్ని రకాల బియ్యం ధరలు తగ్గే అవకాశమున్నట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బియ్యం నిల్వలకు గండి కొడుతున్న గోదాముల కొరత...
అయితే బియ్యాన్ని భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా నిల్వచేసి ఉంచేందుకు మన రాష్ట్రంలో గిడ్డంగులు అందుబాటులో లేకపోవడం శోచనీయం. సేకరించిన లెవీ బియ్యాన్ని సైతం నిల్వ చేసేందుకు రాష్ట్రంలో ఉన్న మొత్తం గోదాముల సామర్థ్యం ఏ మూలకు చాలదంటున్నారు. రాష్ట్రంలో ఎఫ్‌సీఐ ఆధీనంలో ఉన్న మొత్తం గోదాములలో నిల్వ సామర్థ్యం 36 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, మిగిలినటువంటి, ఎఫ్‌సీఐ ఆధీనంలో లేని గోదాములలో మరో 17 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మాత్రమే నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. ఈ కారణంగానే ప్రతి ఏటా మన రాష్ట్రంలో ఉత్పతె్తైన బియ్యం అధిక మొత్తంలో పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా రవాణా జరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.