Wednesday, May 5, 2010

పెరగనున్న టైర్ల ధర?

న్యూఢిల్లీ : నేడో రేపో పెట్రోపోటు పొంచి ఉన్నదని భయపడుతున్న వాహన యజమానులు మరో భారం మోయడానికి కూడా సంసిద్ధులు కాక తప్పదు. పెరిగిన రబ్బర్ ధరలకు దీటుగా తాము టైర్ల ధరలు 25 శాతం వరకు పెంచాల్సివస్తుందని టైర్ల ఉత్పత్తిదారులంటున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ నెల మధ్య కాలంలో ఇప్పటికే రెండు సార్లు టైర్ల ధరలు పెరిగాయి.

పెరిగిన ముడిసరుకు ధరల భారాన్ని కస్టమర్లు మోయక తప్పదంటూ జనవరిలో టైర్ల ఉత్పత్తిదారులు ధరలు 5 నుంచి 7 శాతం పెంచారు. బడ్జెట్‌లో ఎక్సైజు సుంకాల్లో రాయితీలను ఉపసంహరించడంతో ఏప్రిల్ నుంచి పెరిగిన సుంకాల భారాన్ని కూడా వినియోగదారులకే పంచుతూ ఏప్రిల్‌లో మరోసారి ధరలు రెండు శాతం మేరకు పెంచారు.

ఇప్పుడు తాజాగా టైర్ల ధరలు 25 శాతం వరకు పెంచాల్సివస్తుందంటూ ప్రభుత్వంతో మొర పెట్టుకుంటున్నారు. రబ్బర్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో తాము ఇప్పటికే ప్రధానిని కలిశామని, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి పరిష్కారం లభించలేదని ఆటోమోటివ్ టైర్ల ఉత్పత్తిదారుల సంఘం (ఎటిఎంఏ) చైర్మన్ నీరజ్ కన్వర్ మంగళవారం ఇక్కడ తెలిపారు. నాచురల్ రబ్బర్‌పై 20 శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలని, రబ్బర్‌పై ఫ్యూచర్స్ ట్రేడింగ్‌ను నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరారు.

గత ఏడాది కాలంలో నాచురల్ రబ్బర్ ధరలు 150 శాతం పెరిగాయని ఉత్పత్తిదారులంటున్నారు. 2008 డిసెంబర్‌లో కిలో 65 రూపాయలున్న రబ్బర్ ధర ప్రస్తుతం 170 రూపాయలకు చేరిందని వారు చెబుతున్నారు. దీనికి తోడు డిమాండు, సరఫరాలో కూడా భారీ వ్యత్యాసం ఉంది. ఈ ఏడాది 1.75 లక్షల టన్నుల మేరకు నాచురల్ రబ్బర్ కొరత ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యత్యాసం లక్ష టన్నుల మేరకు ఉండగా ముందు ముందు మరింతగా పెరుగుతుందని కూడా అంచనా.

2009-10 సంవత్సరంలో దేశంలో 9.31 లక్షల టన్నుల నాచురల్ రబ్బర్‌కు డిమాండు ఉండగా 8.31 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అయింది. వచ్చే ఏడాది డిమాండు 10.8 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. ఒకపక్క డిమాండు, సరఫరాలో భారీ వ్యత్యాసం కారణంగా ఏర్పడుతున్న ఇబ్బందులతో పాటు మార్జిన్లు కూడా తగ్గడం వల్ల 19 వేల కోట్ల రూపాయల విస్తరణ/పెట్టుబడి ప్రణాళికల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని టైర్ల ఉత్పత్తిదారులు మొర పెట్టుకుంటున్నారు.

అధిక మొత్తంలో రబ్బర్ పండించే కేరళలో 300 మంది ఉత్పత్తిదారులు కార్టెల్‌గా ఏర్పడి రబ్బర్‌ను ఉత్పాదక ధర కన్నా వంద రూపాయల అధిక ధరకు విక్రయిస్తున్నారని రిక్షా, సైకిల్ టైర్ల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ రమ్మీ చాబ్రా ఆరోపిస్తున్నారు. దేశంలో టైర్ల పరిశ్రమ పరిమాణం 22 వేల కోట్ల రూపాయలైతే అందులో 17 శాతం వాటా సైకిల్, రిక్షా టైర్ల పరిశ్రమదని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా తమకు కూడా ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా పెరిగాయని, దీని వల్ల అనేక చిన్న తరహా రబ్బర్ యూనిట్లు మూత పడే ప్రమాదంలో పడ్డాయని అఖిల భారత రబ్బర్ పారిశ్రామికుల సంఘం అధ్యక్షుడు టి.కె.ముఖర్జీ అన్నారు.