అన్ని రకాల యులిప్స్‌ల్లో రిస్క్ కవర్ విధిగా ఉండాలని ఆదేశం
కనీస కాలపరిమితి 5 ఏళ్లకు పెంపు
న్యూఢిల్లీ : యూనిట్ లింక్డ్ పాలసీ (యులిప్)ల నిబంధనలను బీమా నియంత్రణ ఐఆర్‌డిఎ మరింత కట్టుదిట్టం చేసింది. పెన్షన్, యూన్యుటీ ప్రొడక్ట్స్ సహా యులిప్‌లన్నింటిలోనూ జీవిత బీమా కవరేజి కచ్చితంగా ఉండాల్సిందేననీ బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డిఎ స్పష్టం చేసింది. అన్ని యులిప్‌ల పాలసీదారులకు కనీస బీమా కవరేజీని తప్పనిసరిగా ఇవ్వాలని నిర్ధేశించింది. ఈ మొత్తాన్ని హెచ్చించాలని కూడా సూచించింది. 2005 డిసెంబర్ నాటి ఉత్తర్వులను పునరుద్ఘాటిస్తూ సోమవారం అర్థరాత్రి ఐఆర్‌డిఎ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
యులిప్‌ల విషయంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబితో వివాదం కారణంగా యులిప్ పాలసీలపై ఐఆర్‌డిఎ తన పట్టును పటిష్టం చేసుకునే చర్యలకు సన్నద్దమైంది. కొత్త నియమ నిబంధనలన్ని జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని ఐఆర్‌డిఎ తెలిపింది. మ్యూచువల్ ఫండ్ తరహాలోనే యులిప్‌లు పెట్టుబడి సాధనాలుగా ఉన్నాయని సెబి వాదన లేవత్తిన సంగతి తెలిసిందే.
ఆరోగ్య బీమా యులిప్‌లకు మాత్రం డెత్ బెనిఫిట్ ప్రొవిజన్ కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదని ఐఆర్‌డిఎ ఆ ఉత్తర్వులో పేర్కొంది. అలాగే యులిప్ పాలసీలను తాకట్టు పెట్టుకుని రుణాలను మంజూరు చేయరాదని స్పష్టం చేసింది. యులిప్ పాలసీల కనీస కాల వ్యవధిని ఐదేళ్లకు పెంచింది. గతంలో పాలసీ హోల్డర్లు మూడేళ్లు దాటిన తర్వాత యులిప్‌లను సరెండర్ చేసే వెసులుబాటు ఉండేది. ఇండివిడ్యువల్ ప్రొడక్ట్‌ల విషయంలో పాలసీ కనీస కాల వ్యవధి ఐదేళ్లు ఉండాలని, గ్రూప్ ప్రొడక్ట్‌లయితే ఏటా రెన్యూవల్‌ను చేయించుకోవాలని ఐర్‌డిఎ తెలిపింది.
అలాగే పెన్షన్, యాన్యుటీ ఉత్పత్తులు మినహా అన్ని యులిప్‌ల పాలసీల నుంచి పాక్షిక ఉపసంహరణను పాలసీ ఐదేళ్లు దాటిన తర్వాతే అనుమతించనున్నట్లు పేర్కొంది. యూనిట్ లింక్డ్ పెన్షన్,యాన్యుటీ ఉత్పత్తుల విషయంలో పాక్షిక ఉపసంహరణకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని తెలిపింది. అయితే పెన్షన్ పాలసీల విషయంలో కాల వ్యవధి తీరిన తర్వాత మొత్తం ఫండ్ వాల్యూను బీమాదారుడు యాన్యుటీలోకి మార్చుకోవచ్చు.
కావాలనుకుంటే (పెన్షన్ పాలసీల విషయంలో) బీమాదారుడు మెచ్యూరిటీ తర్వాత లభించే మొత్తంలో మూడో వంతును విక్రయించి మిగితా మొత్తాన్ని యాన్యుటీలోకి మళ్లించుకునే వెసులుబాటు కూడా ఐఆర్‌డిఎ కల్పించింది. అంతేకాకుండా టాప్ అప్ ప్రీమియం విషయంలోనూ చెల్లించిన తేదీ నుంచి మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్‌ను కలిగి ఉండాలని నియంత్రణ సంస్థ పేర్కొంది.