Wednesday, March 24, 2010

10 లక్షల కార్ల క్లబ్‌లో మారుతి

1983లో మార్కెట్లోకి తొలి మారుతి
54 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానం
మాతృసంస్థను మించిన అమ్మకాలు

న్యూఢిల్లీ : కార్ల ఉత్పత్తిలో దేశంలో అతిపెద కంపెనీ అయిన మారుతి సుజుకీ ఏడాదికి పది లక్షల కార్లు ఉత్పత్తి చేసే ప్రపంచంలోని కంపెనీల జాబితాలో చేరనుంది. మంగళవారం నాడు కంపెనీ తన 10 లక్షలవ కారును మార్కెట్‌లో లాంఛనంగా ప్రవేశపెడుతోంది. ఈ కారు ఎరుపు రంగు గల స్విఫ్ట్ కారు. ఈ కార్యక్రమంలో సుజుకీ మోటార్ కార్పొరేషన్ చైర్మన్ ఒసాము సుజుకి పాల్గొంటారు. కంపెనీ ఇప్పటికి 15 మోడళ్ళు, 100కి పైబడిన వేరియెంట్లతో 85 లక్షల కార్లు విక్రయించింది.

మాతృ సంస్థ సుజుకీ మోటార్స్‌ను అమ్మకాలను కూడా అధిగమించి దేశీయ రవాణా రంగంలో విప్లవ శక్తిగా మారుతి నిలిచింది. ఇప్పటి వరకు ప్రపంచంలో పది లక్షల కార్లు ఉత్పత్తి చేసిన కంపెనీల్లో టయోటా, జనరల్ మోటార్స్, ఫోక్స్‌వ్యాగన్, ఫోర్డ్, హోండా, రేనాల్ట్, హ్యుండయ్, సుజుకీ, నిస్సాన్ ఉన్నాయి. గుర్‌గాంవ్‌లోని ప్లాంట్ నుంచి తొలి మారుతి-800 కారు 1983 డిసెంబర్ 14న మార్కెట్‌లోకి వచ్చింది. వాణిజ్యపరమైన అమ్మకాలు ప్రారంభించిన తొలి ఏడాది 1983 డిసెంబర్-మార్చి నెలల మధ్య కాలంలో మారుతి సంస్థ 840 కార్లు ఉత్పత్తి చేసింది.

ఆ తర్వాత సంవత్సరంలో 22వేల కార్లు ఉత్పత్తి చేసింది. గత 26 సంవత్సరాల కాలంలో దేశ ఖజానాకు మారుతి కంపెనీ 55 వేల కోట్ల రూపాయలు అందించింది. 1981లో మారుతి కంపెనీ ప్రారంభమైనప్పుడు ఈ కంపెనీ మూడు లేదా నాలుగేళ్లుదాటి మనుగడ సాగిస్తుందని ఎవరూ భావించలేదని, ఇప్పుడు ఏడాదికి 10 లక్షల కార్లు ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగిందని కంపెనీ చైర్మన్ ఆర్‌సి భార్గవ అన్నారు. ప్రస్తుతం దేశీయ కార్ల మార్కెట్‌లో 54 శాతం వాటాతో మారుతి అగ్రస్థానంలో ఉన్నదని ఆయన తెలిపారు.