Monday, March 22, 2010

నష్టం సున్నా.. లాభం 15వేల పైనే..

భారత రిజర్వు బ్యాంక్ (ఆర్‌బిఐ) శుక్రవారం నాడు మార్కెట్లు ముగిసిన తరువాత అనూహ్యంగా రెపో, రివర్స్ రెపో రేట్లను చెరి 25 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచింది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణ కట్టడికిగాను ఈ చర్యలు తీసుకుంది. అయితే ఆర్‌బిఐ తీసుకున్న ఈ చర్య ఫలితంగా స్టాక్ మార్కెట్ మీద కొంత ప్రతికూల ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. గత వారం ఎన్‌టిపిసికి సంబంధించిన వ్యూహం ఇచ్చాం. ఇందులో రెండో రోజే మంచి లాభాలు వచ్చాయి. ఇప్పటికీ లాభాలు స్వీకరించకుండా ఈ వ్యూహంలో ఉన్న వాళ్లు సమయాన్ని బట్టి బయటకు రాగలరు.

ఇక ఈ వారానికొస్తే.. టాటా స్టీల్‌కు సంబంధించిన వ్యూహం ఇస్తున్నాం. షేరు ధర ఎంత తగ్గినా ఏ మాత్రం నష్టం రాకపోవడమే ఈ వ్యూహం ప్రత్యేకత. ఇందులో టాటా స్టీల్ 620 రూపాయల కాల్‌ను 39 రూపాయల్లో, 660 రూపాయల కాల్‌ని 17 రూపాయల్లో కొనుగోలు చేయాలి. వీటితో పాటు 640 రూపాయల కాల్ రెండు లాట్లు 28 రూపాయల చొప్పున షార్ట్ సెల్ చేయాలి. అంటే, రెండు లాట్లు కొనుగోలు చేసి రెండు లాట్లు షార్ట్ సెల్ చేయాలి. ఇవన్నీ ఏప్రిల్‌కు సంబంధించిన ఆప్షన్స్. ఇందులో టాటా స్టీల్ షేరు ఏప్రిల్ ముగింపు నాటికి 621 రూపాయల నుంచి 659 రూపాయల మధ్య ఎక్కడ ముగిసిన లాభంలో ఉంటారు.

ముఖ్యంగా షేరు ధర 640 రూపాయల దగ్గరలో ముగిస్తే లాభం 15,000 రూపాయల పైనే వస్తుంది. అలాకాకుండా షేరు ధర విపరీతంగా పడిపోయినా లేదా పెరిగినా నష్టం మాత్రం రాదు. అంటే, ఇందులో నష్టం సున్నా. కాగా లాభం 15,000 రూపాయలపైన రావటానికి అవకాశం ఉంది. స్ట్రాటజీలో ఇచ్చిన ధరలు శుక్రవారం నాటి ముగింపు ధరలు. ఒక వేళ ఇవే ధరలు అందుబాటులో లేకుంటే కొనుగోలు చేసే కాల్స్, షార్ట్‌సెల్ చేసే కాల్స్ మధ్య వ్యత్యాసం పైన సూచించిన విధంగా ఉంటే చాలు. ధరలు ఏవైనా ఫర్వాలేదు.