Monday, March 22, 2010

ఎంబీఏ కుర్రాళ్లు... కిరీటాల సోగ్గాళ్లు

చరిత్రను మలుపుతిప్పే వాళ్లు ఆకాశంలో పుట్టరు. వారు మనలాగే పుడతారు. మన మధ్యే తిరుగుతారు. మనతోనే ఉంటారు. మనిషిని బతికించేంది ఓ ఆలోచనే. మనిషికి హోదా కావాలి. అది పలుకుబడితో వస్తుంది. చదువుతో కలుగుతుంది. డబ్బుతోనూ ఏర్పడుతుంది. భారతరాజకీయాలు ప్రపంచంలోనే అతి విశిష్టమైనవి. విలక్షణమైనవి. వారసత్వ రాజకీయాలు పోయి ..దేశంలో నూతన రాజకీయాలకు తెరలేస్తుంది. ఈ ప్రభావం ...దేశంతో పాటూ రాష్ట్రాల్లోనూ స్పష్టంగా కనపడుతుంది. దీనికి ఉదాహరణగానే ఓ ఆర్థికవేత్త దేశానికి ప్రధాని అయ్యాడు.


ఒకప్పుడు భారతరాజకీయాల్లో న్యాయవాదులు తిరుగులేని పాత్రని పోషించారు. జాతిపిత నుంచి రాజ్యాంగ నిర్మాత వరకు ...ఎంతోమంది బారిస్టర్‌ను పూర్తిచేసి రాజకీయాల్లో కాలుమోపారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారు.ఇండియాను అంతకుముందున్న సంప్రదాయాలకు భిన్నంగా.. పూర్తిగా మార్చివేసిన ఘనత వీరిదే. భారతరాజకీయాల్లోనూ వీరు ప్రధానభూమికను నిర్వహించారు. ఇప్పుడున్న రాజకీయాల్లో లాయ ర్లు తమవంతు పాత్రని పోషించినా... ఈ వ్యవస్థలో వారి కన్నా ఎక్కువగా నిలదొక్కుకుంటున్నది వ్యాపారవేత్తలే. అంతేకాదు రాజకీయాల్లో చేరిన యువనేతల్లో కూడా ఎంబిఎని పూర్తిచేసి అడుగుపెట్టినవారే ఉన్నారు.

జ్యోతిరాదిత్య సింథియా, సచిన్‌ పైలట్‌, జితిన్‌ ప్రసాద్‌, దీపేందర్‌ సింగ్‌ హుడా, నవీన్‌ జిందాల్‌, మిలింద్‌ దేవ్‌రా, పిడి రాయ్‌ వీళ్లంతా ఎంబిఎ పట్టా పుచ్చుకున్నవాళ్లే. వీరందరూ రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఎంతోమేలు చేసిందని చెపుతున్నారు.హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ హుడా.... పుత్రరత్నమైన దీపేందర్‌ .... రోహ్‌తక్‌ నుంచి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.రాజకీయాల్లో కాలుమోపటానికి ఎంబిఎ అనేక రకాలుగా ఇతనికి మార్గం చూపింది.

పరిస్థితుల్ని అర్థం చేసుకుని వాటిని అమలు చేయటంలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చాలా అనూకూలించిందని ఆయన చెబు తున్నారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలో కూడా దీని వల్ల తెలుస్తుందని చెప్పారు. మంచి విద్య అన్నివేళల్లోనూ మనకు ధైర్యాన్ని ఇస్తుందని.. కేంద్ర పెట్రోలియం సహజవాయువు సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద్‌ అన్నారు. ‘‘మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ పరిస్థితులను ఎలా తట్టుకోవాలో నేర్పుతుంది. సమస్య ఉత్పన్నమైనప్పుడు దానిని ఎదుర్కొనే సామర్థ్యాన్నిస్తుంది. లా అయినా.. మేనేజ్‌మెంట్‌ అయినా.. ఏదైనా సరే మనకు సమాజంపైన అవగాహన కల్పించటానికి చక్కగా ఉపయోగపడుతుంది. సమకాలీన రాజకీయాల గురించి తెలుసుకోవటానికి ..అందులో ఉండే ఆటంకాలను ఎదుర్కొవటానికి ఇవి మనల్ని బలంగా తయారుచేస్తాయి.

నాయకత్వలక్షణాలు, నిర్ణయాలు తీసుకోవటంలో చొరవను కలిగిస్తాయి. రాజకీయాల్లో ఉండే వారు...వచ్చేవారు అందరూ అవినీతిపరులు కారు. చాలామందికి మంచి ఆశయాలుంటాయి. సమాజానికి కావాల్సింది చేద్దామన్న ఉద్దేశంతోనే వస్తారు. విద్యార్థిగా ఉన్నప్పుడు నేర్చుకుంది మన సమాజానికి వర్తింప చేస్తే చాలు. సగం పని అక్కడే తీరిపోతుంది. మన పెద్దలు ఎంతో ఆలోచించిన తరవాతే నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని పాటిస్తే సరిపోతుంది. మన విద్యావ్యవస్థలోనూ... నిపుణులున్నారు. అయితే వారికి సరైన గుర్తింపు దొరకటం లేదు. సరైన సమయంలో అనుకున్న పనిచేయటానికి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ఎంతో ఉపకరిస్తుంది’’. ఇదీ ఆయన అనుభవం.

పిడి రాయ్‌ సిక్కిం నుంచి మంత్రిగా ఎన్నికయ్యారు.మంచి నిర్ణయాలను తీసుకోవటానికి ఎంబిఎ అతనికి అవసరమైంది. నియోజకవర్గంలో చేయాల్సిన పనుల గురించి.. ఆలోచనలకు ప్రాధాన్యతను కల్పించటంలో ఇది సరైన దారిలో నడిపించింది. ‘‘మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ అనేది నా దృష్టిలో ఓ సత్తా. దానికున్న ప్రత్యేకతేమిటంటే.. ఓ విషయం పైన సమగ్రమైన విశ్లేషణ వివరణాత్మకంగా అందిస్తుంద’’ని చెప్పారాయన. బిజినెస్‌లో ఖచ్చితమైన విలువలు ఉంటాయి. అధికారం అలా కాదు. అందులో ఉండే విధులను నిర్వహించటానికి మనిషికి కొన్ని ప్రత్యేకమైన పరిధులున్నాయి. అయితే వాటిని చక్కగా తీర్చిదిద్దటంలో బిజినెస్‌ చక్కగా ఉపకరిస్తుంది.

రాజకీయాల్లో రాణించాలంటే...
mba_expansionరాజకీయాల్లో ప్రవేశించాలంటే.. ఎంబిఎ ఖచ్చితం కాదు. అయితే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకోవాలంటే... అది అవసరమే. అమెరికాలో ఎంబిఎ డిగ్రీ పుచ్చుకున్నారంటే ... వారు రాజకీయాల్లో బాగా రాణిస్తారన్నమాటే. ప్రత్యేకంగా ఫైనాన్స్‌, మేనేజ్‌మెంట్‌ అనాలసిస్‌ని పూర్తిచేసుకున్న వాళ్లకి మంచి డిమాండ్‌ ఉంది. రాహుల్‌గాంధీ 2004 లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సమయంలో ఆయన రాజకీయాలకు విద్యార్థే. ఐదు సంవత్సరాలు గడచిన తరవాత అదే రాహుల్‌ ప్రజల్ని ఆకర్షించే నాయకుడిగా ఎదిగారు. దేశ రాజకీయాలపైన అవగాహన పెంచుకున్నారు. సమకాలీన విషయాలు సమగ్రంగా మాట్లాడుతున్నారు. పేదల్ని ఆకట్టుకోవటంలో మంచి నైపుణ్యాన్ని సంపాదించారు. రాహుల్‌గాంధీ ఎంబిఎ విద్యార్థి కాదు. అయితే కొన్ని సంవత్సరాలు యజమాన్య సలహాదారుగా మేనేజ్‌మెంట్‌ గురు మైకెల్‌ పొర్టర్‌ దగ్గర పనిచేశారు.

ఈ అనుభవం చక్కగా ఉపయోగపడింది. మనిషిని ఆకట్టుకోవాలన్నా... అతనితో సంబంధాలను పెంచుకోవాలన్నా ..మాటతీరు, నడత, ఆకర్షణ ముఖ్యమవుతాయి. ఎంబిఎ చేసిన ఎంతోమంది సినీరంగంలోనూ రాణిస్తున్నారు. కుటుంబకథాచిత్రాల్లో నటిస్తూ సినీమార్కెట్‌ మంచిగా బాలెన్స్‌ చేస్తున్న వెంకటేష్‌ అమెరికాలో ఎంబిఎ పూర్తిచేసిన విద్యార్థే. హోంమంత్రి చిదంబరం కూడా బిజినెస్‌లో పట్టా తీసుకున్నవారే. ప్రధానమంత్రి తరవాత అంతటి అత్యున్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఒకప్పుడు బిజినెస్‌ విద్యార్థి. ఒకప్పటి భారతరాజకీయాలు ఇప్పటి కొత్తరాజకీయాలకు పూర్తిగా విరుద్ధం. మారుతున్న సమాజం. పెరుగుతున్న విద్యావంతుల శాతం ఎంతోమంది యువనేతలను ఇచ్చింది. రాబోయే కాలంలో దేశానికి ఓ బిజినెస్‌ విద్యార్థి ప్రధానమంత్రి అయితే ఆ మార్పుకి మరింత స్పష్టత వస్తుందేమో వేచి చూడాలి.