Monday, March 22, 2010

గ్రామీణ గోదాముల నిర్మాణం

దేశ జనాభాలో దాదాపు 70 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. అయితే వ్యవసాయ రంగం వాటా దేశ స్థూల జాతీయోత్పత్తిలో క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 25 శాతానికి చేరింది. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దేశ వ్యవసాయ రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఉత్పత్తుల ఎక్స్ఛేంజీల వల్ల పెద్ద రైతులకు వ్యవసాయం లాభసాటిగా మారినా న్న సన్న కారు రైతుల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఇందుకు కారణం వారి పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి రావడమే. చేతికి వచ్చిన పంటను నిల్వ చేసుకునే సదుపాయలు లేకపోవడం ఇందుకు దారితీస్తోంది.

అన్ని ప్రాంతాల్లో ఒకేసారి పంట మార్కెట్‌కు రావడం వల్ల డిమాండ్ కన్నా సప్లై అధికంగా ఉంటుంది. ఇదే సమయంలో రైతులు తక్కువ ధర ఉన్నా తమ పంటను విక్రయిస్తారు. ఇలా కాకుండా ఎక్కువ ధర వచ్చినపుడే పంటను విక్రయించుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో గోదాములను ఏర్పాటు చేసుకోవడమే సరైన మార్గం.

గ్రామీణ గోదాములు
రైతులు పండించిన పంటను మంచి ధర వచ్చినపుడు అమ్ముకొని అధిక లాభం పొందాలంటే శాస్త్రీయ పద్ధతిలో నిర్మించి, నిర్వహించే గోదాములు ఉండాలి. అంతేకాకుండా గోదాములలో నిల్వ ఉంచిన ఉత్పత్తిపై కఠిన నిబంధనలు లేకుండా, సులభ పద్ధతిలో తాత్కాలిక రుణ మంజూరీ విధానం అమలు ఉండాలి.

గ్రామీణ గోదాముల నిర్మాణ పథకం
గ్రామస్థాయిలో గోదాముల ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గ్రామీణ గోదాముల నిర్మాణాన్ని ప్రోత్సహించటానికి ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఈ పథకం ఉద్దేశాలు
* శాస్త్రీయ పద్ధతిలో పంటను నిల్వచేయటానికి గోదాములను నిర్మాణం
* గోదాములలో నిల్వ ఉంచినట్లు ఇచ్చిన రశీదులపై రైతులకు సులభ రుణాలు ఇచ్చేలా వీలుకల్పించడం
*రైతులు ఇష్టానుసారం ఉత్పత్తులను విక్రయించునే వీలు క ల్పించడం
ఎవరు అర్హులు?
గ్రామీణ గోదాములు నిర్మించటానికి వ్యక్తులు, రైతులు, రైతు సమూహాలు, భాగస్వామ్య లేదా సొంత వ్యాపార సంస్థలు, ఎన్‌జిఒలు, సహకార సంఘాలు, గ్రామ పంచాయితీలు, ఫెడరేషన్లు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు అర్హులు. మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో కాకుండా వ్యవస్థాపకులు లాభదాయకంగా భావించే ప్రదేశాల్లోనైనా గోదాములను నిర్మించవచ్చు.

పరిమాణం
కనీస సామర్థ్యం 100 టన్నులు. గరిష్ఠం 10,000 టన్నులు

గోదాముల నాణ్యత
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ గిడ్డంగుల చట్టం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం ఉండాలి.

సబ్సిడీ వివరాలు
మహిళా రైతులు/ మహిళా స్వయం సహాయక బృందాలు/ సహకార సంస్థలు/ఎస్‌సి, ఎస్‌టి వ్యవస్థాపకులు లేదా వారి స్వయం సహాయక బృందాలు/ సహకార సంఘాలు ప్రాజెక్టు మూలధనంపై 33.33 శాతం లేదా గరిష్ఠంగా 62.50 లక్షలు సబ్సిడీగా పొందవచ్చు.
* మహిళా రైతులు కాకుండా మిగతా రైతులు, వ్యవసాయ పట్టభద్రులు , సహకార సంఘాలు నిర్మించే గ్రామీణ గోదాముల మూలధన వ్యయంపై 25 శాతం, గరిష్ఠంగా 46.87 లక్షల రూపాయలు సబ్సిడీగా పొందవచ్చు.
2012 మార్చి చివరి వరకు ఈ ప్రోత్సాహకాలు లభించనున్నాయి.

ప్రాజెక్ట్ వ్యయం
1,000 టన్నుల నిల్వ సామర్థ్యమున్న గ్రామీణ గిడ్డంగి నిర్మాణ వ్యయం రూ. 35 లక్షలు
10,00 టన్నుల సామర్థ్యమున్న గిడ్డంగి నిర్మాణ వ్యయం రూ. 2 కోట్లు