Monday, March 22, 2010

ఆ ఇద్దరు 'సత్యం' సీఏలపై 30న నిర్ణయం: ఐసీఏఐ

బెంగళూరు: సత్యం కంప్యూటర్‌ ఖాతాపుస్తకాల కుంభకోణంతో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన చార్టర్డ్‌ అకౌంటెంట్ల (సీఏల)పై క్రమశిక్షణ చర్యల గురించి నిర్ణయించడానికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) ఈ నెల 30న సమావేశం కానుంది. ఐసీఏఐ ప్రెసిడెంట్‌ అమర్‌జిత్‌ చోప్రా ఈ సంగతిని శనివారమిక్కడ ఒక వార్తాసంస్థ ప్రతినిధితో చెప్పారు. ప్రైస్‌వాటర్‌హౌస్‌ ఆడిటర్లు తాళ్లూరి శ్రీనివాస్‌, సుబ్రమణి గోపాలకృష్ణన్‌లపై క్రమశిక్షణ చర్యలకు చొరవ తీసుకోవడంలో ఐసీఏఐ వైపు నుంచి ఎలాంటి జాప్యం జరగడంలేదని చోప్రా అన్నారు. ''అలాంటి ఆడిటర్లతో వ్యవహరించాల్సిన మార్గాల్లో ఒకటి.. వారికి నోటీసు ఇచ్చి ముందడుగు వేయటం, ఇంకో మార్గం.. న్యాయ ప్రక్రియ ముగిసే వరకు వేచి ఉండటం'' అని చోప్రా చెప్పారు.