Monday, March 22, 2010

జైన్‌ కొనుగోలుకు భారతీ బోర్డు ఓకే

న్యూఢిల్లీ: జైన్‌ టెలికాంకు చెందిన ఆఫ్రికా వ్యాపారాన్ని 9 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.44,000 కోట్లు) పెట్టి కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను భారతీ ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌ బోర్డు శనివారం ఆమోదించినట్లు తెలుస్తోంది. అభిజ్ఞ వర్గాలు ఈ మేరకు తెలిపినట్లు బ్లూంబర్గ్‌ వార్తాసంస్థ కథనం. జైన్‌ టెలికాం కువైట్‌లోని అతి పెద్ద ఫోన్‌ కంపెనీ. ఆఫ్రికాలోని 15 దేశాలలో సుమారు 4.2 కోట్ల మంది కొత్త మొబైల్‌ చందాదారులకు సేవలు అందించే అవకాశాన్ని దక్కించుకోవడానికి సంబంధించి జైన్‌ టెలికాంతో సంప్రదింపులు జరిపేందుకు భారతీకి ఈ నెల 25 వరకు గడువున్న విషయం విదితమే.భారతీ బోర్డు శనివారమిక్కడ సమావేశమై చర్చించింది. ఇప్పుడిక తాజా బిడ్‌పై ప్రతిస్పందించాల్సింది జైన్‌ టెలికామే. జైన్‌ ఈ బిడ్‌కు తలూపితే భారతీ తక్షణం 8.3 బి. డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా సొమ్ము చెల్లించడానికి ఏడాది వ్యవధి ఉంటుంది.