ఎక్సైజ్ సుంకం, రవాణా వ్యయం పెరగడమే కారణం
ముంబై: బడ్జెట్ అనంతరం సిమెంట్ ధరలు ఒక్కసారిగా రెక్కలు తొడుకున్నాయి. బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన ప్రభావంతో పాటు సిమెంట్ సరఫరాకు అవసరమైన రైలు వ్యాగళ్ల కొరత ఏర్పడటం, రవాణా వ్యయం పెరగ డంతో ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. బడ్జెట్ తరువాత వివిధ ప్రాంతాలను బట్టి సిమెంట్ కంపెనీలు బస్తా సిమెంట్ ధరను 10-12 రూపాయలు పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్పాదక వ్యయం పెరగడంతో ఆ భారాన్ని తగ్గించుకోవడానికి కంపెనీలు ధరలను పెంచాయి. డిమాండ్ పెరగడం కూడా ధరలు ఎగిసేందుకు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కామన్‌వెల్త్ క్రీడల సందర్భంగా మౌలిక సదుపాయాల కల్పన సిమెంట్ వినియోగం పెరగడమే కాకుండా పట్టణాల్లో గృహ రంగం నుంచి డిమాండ్ మళ్లీ పుంజుకున్న నేపథ్యంలో వచ్చే మే నెల వరకు ధరలు తగ్గే అవకాశం ఉండకపోవచ్చని వారు చెబుతున్నారు. అయితే జూన్ నెల నుంచి కొత్తగా సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రావడం వల్ల ధరల్లో కరెక్షన్‌కు ఆస్కారం ఉందంటున్నారు. ప్రస్తుతం బస్తా సిమెంట్ ధర 190 రూపాయలకు చేరింది. ఉత్తరాది మార్కెట్‌లో సిమెంట్ బస్తా ధర 6 రూపాయలు పెరగ్గా, దక్షిణాది మార్కెట్లో తక్కువగానే పెరిగింది. డిమాండ్ పెరగడం, రవాణా ఇబ్బందులు మిగతా ప్రాంతాల్లో ధరలు ఎక్కువగా పెరగడానికి దారితీశాయి. ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు సిమెంట్ ధరలపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా ఫిబ్రవరిలో సిమెంట్ పరిశ్రమ పంపిణీలో 4.3 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. మధ్య, పశ్చిమ ప్రాంత మార్కెట్లలో డిమాండ్ వృద్ధి చెందడమే ఇందుకు ముఖ్యంగా దోహద పడింది. ఈ మార్కెట్లలో పంపిణీ వరుసగా 13.9 శాతం, 8.5 శాతం వృద్ధి చెందింది. దక్షిణాది ప్రాంత మార్కెట్ ఆశించిన స్థాయిలో లేదు. గత కొన్ని నెలలుగా సిమెంట్ కంపెనీలు మంచి అమ్మకాలను నమోదు చేసుకున్నట్లు ఏంజెల్ కమోడిటీస్ ఎనలిస్టు వి శ్రీనివాసన్ తెలిపారు. కొన్ని కంపెనీలకు అదనపు ఉత్పత్తి సామర్థ్యం జతకూడటంతో మొత్తం ఉత్పత్తి సామర్థ్యం భారీ స్థాయిలో పెరిగిందని ఆయన పేర్కొన్నారు.