Monday, March 22, 2010
విదేశీ వర్సిటీ క్యాంపస్‌లతో భారత్‌కు రూ.34,500 కోట్ల ఆదా
న్యూఢిల్లీ: విదేశీ విశ్వవిద్యాలయాలను భారత్‌లో వాటి ప్రాంగణాలను నెలకొల్పడానికి అనుమతించడం ఏటా 7.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.34,500 కోట్ల విలువైన) విదేశీమారక ద్రవ్యాన్ని మన దేశం ఆదా చేసుకోవడానికి దోహదం చేస్తుందని, ఈ మొత్తం భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడం కోసం ప్రతి సంవత్సరం వెచ్చిస్తున్న సొమ్ముకు సమానమని అసోచామ్ అంచనా వేసింది. ఇది మన దేశంలో ఉన్నత విద్య స్వరూపాన్ని పెంపొందించేదేనని అసోచామ్ అధ్యక్షురాలు స్వాతి పిరమాల్ అన్నారు. భారత దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలు క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తూ ఫారిన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ (రెగ్యులేషన్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఆపరేషన్) బిల్లు, 2010ని కేంద్ర మంత్రిమండలి ఈ నెల 15న ఆమోదించిన విషయం విదితమే. దీంతో ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం అయింది. ప్రతి ఏటా 5 లక్షలమందికి పైగా విద్యార్థులు ఇంజినీరింగ్, వైద్యం, మేనేజ్‌మెంట్ వంటి వృత్తివిద్య కోర్సుల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్తున్నారని, ప్రభుత్వ తాజా కసరత్తు మేధో వలసను అరికట్టడానికి తోడ్పడుతుందని స్వాతి పిరమాల్ వివరించారు. అనేక విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నాయని, ముఖ్యంగా న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, చండీగఢ్, పుణె, ముంబయిల వంటి నగరాలపై అవి దృష్టి సారించవచ్చని అసోచామ్ పేర్కొంది.