అనిశ్చితిలో డిగ్రీ అధ్యాపకుల నియామక ప్రకటన
వయోపరిమితి పెంపు, అర్హతల
సడలింపుపై జాప్యం
నిరుద్యోగుల జీవితాలతో సర్కారు చెలగాటం
ప్రకటనిచ్చి చేతులు దులుపుకొన్న ఏపీపీఎస్సీ
కళ్ల ముందు వూరిస్తున్న ఉద్యోగ స్వప్నం.. ఎప్పుడెప్పుడు సొంతం చేసుకుందామా అన్న ఉద్వేగం.. ప్రభుత్వ మార్కు జాప్యంతో పరిస్థితి అయోమయం.. అగమ్యగోచరం! వెరసి నిరుద్యోగి జీవితంతో సర్కారు చెలగాటం..!! వయోపరిమితి పెంపు, అర్హతల సడలింపుపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాలేకపోవడం వల్ల.. గత అక్టోబరులో ఏపీపీఎస్సీ జారీచేసిన డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టుల భర్తీ ప్రకటన కాగితాలకే పరిమితమైంది.నోటిఫికేషన్ జారీ చేసి వారిలో ఆశలు రేకెత్తించిన సర్కారు.. వారిలో సహజంగానే ఉండే ఆందోళనలు, అభద్రత వంటి సున్నితమైన భావాల గురించి సర్కారుకు ఏ మాత్రం లెక్కలేదు. నిర్ణయం తీసుకోవడంలో అలవిమాలిన జాప్యం వల్ల వారికి జరిగే నష్టం గురించి ఆలోచించడంలేదు.
ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 176 డిగ్రీ కళాశాలల్లో ప్రత్యక్ష నియామకాల కింద 2500 వరకు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 1017 పోస్టుల భర్తీకి కిందటేడాది అక్టోబరు 13న ప్రకటనను ప్రభుత్వం జారీచేసింది. 1997 తరువాత జనరల్ విభాగం కింద పోస్టుల భర్తీ ప్రకటన వెలువడడం ఇదే తొలిసారి. దరఖాస్తుచేసే వారికి 2009 జులై ఒకటి నాటికి 34 ఏళ్లు ఉండాలని నిర్దేశించారు. అర్హతలుగా 'నెట్' లేదా 'స్లెట్'లో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. పీహెచ్‌డీ ఉన్న వారికి ఈ రెండింటి నుంచి మినహాయింపును ఇచ్చారు. గతంలో ఎంఫిల్ అర్హత కలిగిన వారికి కూడా ఈ మినహాయింపు సౌకర్యం ఉండేది. తాజాగా యూజీసీ నిబంధనల ప్రకారం ఎంఫిల్ చేసిన వారికి అర్హత లేకుండా పోయింది.
ఎన్నికలుంటే ఒకలా.. లేకుంటే మరోలా!
శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని రాష్ట్ర ప్రభుత్వం 2008 డిసెంబరులో విరివిగా ఉద్యోగాల భర్తీ ప్రకటనలను జారీచేసింది. యూనిఫాం పోస్టులను మినహాయించి అడ్‌హాక్ పద్ధతిన కొన్ని రకాల పోస్టులకు వయోపరిమితిని 34 నుంచి 39 సంవత్సరాలకు పెంచుతూ అదే ఏడాది నవంబరు 25న 709 జీవోను విడుదలచేసింది. ఈ విషయంలో అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
ఇదే వెసులుబాటును డిగ్రీ అధ్యాపకుల పోస్టుల భర్తీ ప్రకటనకూ కల్పించాలని నిరుద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఎంఫిల్ చేసిన వారికి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని ప్రాధేయపడుతున్నారు. దీంతో ప్రభుత్వం నియామక ప్రక్రియను నిలిపివేసింది. గత ఏడాది నవంబరు పదో తేదీ నుంచి స్వీకరించాల్సిన దరఖాస్తుల ప్రక్రియను ఏపీపీఎస్సీ వాయిదావేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి ఈ అంశం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. నోటిఫికేషన్ అప్పటికే జారీ చేసిన పరిస్థితుల్లో.. నిరుద్యోగులు కోరుకున్నట్లు వయోపరిమితి, అర్హతల సడలింపుపై సాధ్యమైనంత త్వరగా ఏదో నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వ ధర్మం. అలా కాకుండా నిరుద్యోగులను నెలలుగా త్రిశంకు స్వర్గంలో ఉంచేసింది. నిరుద్యోగుల అభ్యర్థనలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఉన్నత విద్యాశాఖ మంత్రి శ్రీధర్‌బాబు భరోసా ఇస్తున్నా.. అది కార్యరూపం దాల్చడంలేదు. వాస్తవానికి ఈ అధ్యాపకుల పోస్టుల భర్తీ ప్రకటన కూడా 2008 డిసెంబరులోనే వెలువడాల్సి ఉంది. అయితే ఆర్థికశాఖ ఆమోద ముద్రలో జాప్యంకారణంగా సాధ్యపడలేదు.
నిరుద్యోగులకు నష్టం
నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల.. ఓ ప్రణాళిక ప్రకారం రాతపరీక్షకు సిద్ధమయ్యేవారికి నష్టం వాటిల్లుతోంది. సాధ్యమైనంత వరకు రాతపరీక్షల నిర్వహణకు కాస్తముందుగా శిక్షణ కేంద్రాల్లో కోచింగ్ తీసుకోవాలని పలువురు భావిస్తుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ వంటి నగరాలకు వచ్చి శిక్షణ తీసుకునే వారుంటారు. సర్కారు జాప్యం చేసేకొద్దీ.. వీరి ప్రణాళిక దెబ్బతింటుంది. ఒకేసారి వివిధ ఉద్యోగాల ప్రకటనలకు రాతపరీక్షలను నిర్వహిస్తే దేనికి పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించాలో సందిగ్ధంలో పడతారు. ఒకవేళ వయోపరిమితి పెంపు జరిగితే.. ప్రకటన జారీ తేదీ నుంచి కల్పిస్తారా లేదా అన్నది అగమ్యగోచరంగా ఉంది. సీనియార్టీపరంగానూ నష్టపోతారు.
సీఎం కార్యాలయం విముఖం
వయోపరిమితిలో వెసులుబాటు కల్పిస్తే అధ్యాపకులు అందించే సేవలు తక్కువగా ఉంటాయని, అలాచేయకపోవడమే మంచిదనే ధోరణిలో ముఖ్యమంత్రి కార్యాలయం వ్యవహరిస్తోంది. అందువల్ల వయోపరిమితి పెంపు ప్రతిపాదన ఫైలు వచ్చినా.. అంగీకరించకుండానే సీఎం వెనక్కి పంపించినట్లు సమాచారం. పోస్టుల భర్తీ ప్రకటనను జారీచేసిన ఏపీపీఎస్సీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడేంతవరకు దరఖాస్తులను స్వీకరించలేమని పేర్కొంటున్నారు.
అర్హతలు యూజీసీ నిబంధనల మేరకే!
నిరుద్యోగుల కోరిక మేరకు ఎంఫిల్ వారికి అవకాశం కల్పించటం యూజీసీ నిబంధనల ప్రకారం సాధ్యంకాదని అధికారులు చెబుతున్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీచేస్తే.. ఎంపికయ్యే వారికి వేతనాలు అక్కడి నుంచే వస్తాయి. ఎంఫిల్ చేసిన వారిని కూడా అధ్యాపక పోస్టులకు అర్హత కల్పిస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్లే రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. అయితే యూజీసీ నిబంధనల ప్రకారమే అర్హతలను నిర్దేశిస్తే.. కంప్యూటర్ సైన్స్ (80) వంటి పోస్టులకు అభ్యర్థులు దొరకడం కష్టమవుతుందని చెబుతున్నారు.
సవరణ జీవో వెలువడకుండానే ప్రకటన
యూజీసీ నిబంధనలను పరిగణనలోనికి తీసుకోదలచినప్పుడు అందుకు అనుగుణంగా అధ్యాపకుల సర్వీసు వ్యవహారాలకు సంబంధించిన జీవో 47లో ఉన్నత విద్యాశాఖ మార్పులు చేయాల్సి ఉంది. ఆ తరువాతే ప్రకటన జారీచేయాలి. అయితే ఈ విధానం పాటించకుండానే ప్రకటన జారీ చేశారు. పైగా ప్రకటనలోనే సవరణ చేయబోతున్నామని పేర్కొన్నారు. ఇంతవరకూ అతీగతీ లేదు. జీవో సవరణ అంశం ప్రభుత్వ పరిధిలోనే ఉందని ఆ శాఖ అధికారులు వివరణ ఇస్తున్నారు.
'స్లెట్' ఎప్పుడు?
జాతీయస్థాయిలో నెట్ (నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్)లో ఉత్తీర్ణత సాధించడం రాష్ట్ర నిరుద్యోగులకు కష్టంగా మారింది. కాలేజీ సర్వీసు కమిషన్ రద్దుతో మనరాష్ట్రంలో స్లెట్ నిర్వహణకు ఫుల్‌స్టాఫ్‌పడింది. పొరుగు రాష్ట్రాల్లో మాత్రం రాష్ట్రస్థాయిలోనే 'స్లెట్' జరుగుతోంది. వివిధ వర్గాల నుంచి ఒత్తిళ్లు రావడంతో.. ఏపీపీఎస్సీ అధికారులను 'స్లెట్'ను నిర్వహించాల్సిందిగా ఉన్నత విద్యాశాఖ కోరింది. అవసరమైన మానవ వనరులు, నిధులను ఇస్తే తాము సిద్ధమేనని ఏపీపీఎస్సీ తెలిపింది. దీనిపై దృష్టిసారిస్తూనే.. విశ్వవిద్యాలయాల ద్వారా స్లెట్ జరిపిస్తే ఎలా ఉంటుందనే దానిపై ఉన్నతవిద్యాశాఖ ఆలోచనలోపడింది. ఈలోగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పదవుల్లో ఉన్న వారు వెంట వెంటనే మారిపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్ల 'స్లెట్' విషయం మరుగునపడింది.