రూ.368 కోట్ల సమీకరణలోయస్ బ్యాంకు
ముంబయి: ప్రైవేట్ రంగంలోని యస్ బ్యాంక్ పర్యావరణానికి హాని చేయని సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ కోసం నిధులు సమీకరించనుంది. తొలి దఫాలో 80 మిలియన్ డాలర్ల (సుమారు రూ.368 కోట్ల)ను సమీకరించనున్నట్లు, ఈ క్లీన్‌టెక్ ఫండ్ ఫస్ట్ క్లోజర్ రెండు మూడు నెలల్లో ముగిసే అవకాశం ఉన్నట్లు సీఓఓ అలోక్ రస్తోగీ ఆదివారమిక్కడ తెలిపారు. భారత్ సహా ఆగ్నేయ ఆసియాలోని చిన్న, మధ్యతరహా సంస్థల్లో క్లీన్‌టెక్ ఫండ్ పెట్టుబడులు పెడుతుందని ఆయన అన్నారు. రానున్న ఐదేళ్లలో 3,000 ఏటీఎమ్‌లను ఏర్పాటు చేసే ఆలోచన కూడా బ్యాంకుకు ఉందని ఆయన చెప్పారు.
Monday, March 22, 2010
మరో వెయ్యి ఎస్‌బీఐ శాఖలు
న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరో 1,000 బ్యాంకు శాఖలను ప్రారంభించే ఉద్దేశంతో ఉంది. ఇది పూర్తి అయితే బ్యాంకు మొత్తం శాఖల సంఖ్య 13,000ను మించుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకు తెరిచిన 1,000 శాఖల్లోనూ 600 బ్యాంకు శాఖలను గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. పల్లె ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలను పెంపొందించుకొనే వ్యూహంలో భాగంగా వచ్చే ఏడాది గ్రామీణ ప్రాంతాలకు 2,000 మంది ప్రొబేషనరీ అధికారులను పంపే ఆలోచన ఎస్‌బీఐకి ఉంది. 2010-11లో వివిధ విభాగాల్లో 27,000కు పైగా అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, వారిలో 20,000-22,200 మందిని క్లరికల్ పోస్టులకు, మరో 5,500 మందిని ప్రొబేషనరీ అధికారి పోస్టుల కోసం ఎంపిక చేసుకోవాలనుకుంటోంది. ఏటీఎమ్‌ల సంఖ్యను ఇపుడు ఉన్న 21,000 పైచిలుకు స్థాయి నుంచి 25,000కు పెంచుకొనే దిశగా బ్యాంకు ప్రణాళికవేస్తోంది.