Monday, March 22, 2010

సినిమా టికెట్‌ సగటు ధర రూ.40కు

* రూ.13,000 కోట్లకు బాక్సాఫీస్‌ వసూళ్లు
* 'తెలుగు'లోనే పైరసీ అధికం
* భారత సినీ పరిశ్రమపై పీడబ్ల్యూసీ నివేదిక
న్యూఢిల్లీ: భారత సినీ పరిశ్రమకు వచ్చేవన్నీ మంచిరోజులేనని ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్‌(పీడబ్ల్యూసీ) అంటోంది. వచ్చే నాలుగేళ్లలో బాక్సాఫీసులు వసూళ్లతో బద్దలవుతాయని పీడబ్ల్యూసీ నివేదిక ఢంకా బజాయిస్తోంది. 2008లో రూ.8,130 కోట్లుగా ఉన్న ఈ వసూళ్లు 2013కల్లా రూ.13,000 కోట్లకు చేరుతాయని అందులో పేర్కొంది. సగటు టికెట్‌ ధర పెరగడం వల్లే ఇందులో సింహభాగం వసూలవుతుందని చెబుతోంది. అంటే వచ్చే కొన్నేళ్లలో సినిమాప్రియులు టికెట్‌ ధరలపై మరింత వెచ్చించాల్సి వస్తుందన్నమాట. 2008లో టికెట్‌ సగటు ధర రూ.25గా ఉండగా.. అది 2013కల్లా రూ.40కు చేరుతుందని పీడబ్ల్యూసీ అంచనా వేసింది. అయితే సినిమా రంగం పైరసీ నుంచి తీవ్ర ఇబ్బందులకు గురికాకతప్పదని.. ముఖ్యంగా ఆన్‌లైన్‌ దొంగతనాల వల్ల ఎక్కువ నష్టం కలుగొచ్చని చెబుతోంది. మోషన్‌ పిక్చర్‌ డిస్ట్రిబ్యూటర్‌ అసోసియేషన్‌(ఇండియా) జరిపిన సర్వే ప్రకరాం ఆన్‌లైన్‌ పైరసీ అత్యధికంగా గల పది దేశాల్లో భారత్‌ ఉందని తెలిపింది. ఉదాహరణకు విశాల్‌ భరద్వాజ్‌ సినిమా 'కమీనే'ను అధిక సంఖ్యలో 3,50,000 సార్లు డౌన్‌లోడ్‌ చేశారు. ఇక ప్రాంతీయ సినీ పరిశ్రమనూ ఈ పైరసీ భూతం వెంటాడుతోంది. తెలుగులో అధికంగా 88 శాతం సినిమాలు ఇంటర్నెట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ అవుతుండగా.. తమిళ సినిమాలు 80 శాతం దీనికి బలవుతున్నాయి. మొత్తం ప్రాంతీయ సినిమాల ద్వారా బాక్సాఫీసు వసూళ్లు రూ.1508 కోట్లుగా ఉండొచ్చని అంచనా.