Monday, March 22, 2010

60000 వాహనాలువెనక్కి: జీఎం దేవూ

సియోల్‌: జనరల్‌ మోటార్స్‌ అనుబంధ సంస్థ జీఎమ్‌ దేవూ తయారీ లోపాల కారణంగా దక్షిణ కొరియాలో 60,000 వాహనాలను వెనక్కి పిలిపించనుంది. జీఎం దేవూ ఆటో టెక్నాలజీ సంస్థ సుమారు45,957 క్యాప్టివా మోడల్‌ వాహనాలను, 12,604 షేవర్లే క్రూజ్‌ మోడల్‌ కార్లను వెనక్కి పిలిపించనున్నట్లు దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. స్టీరింగ్‌లలో సమస్యల కారణంగా ఏప్రిల్‌1 2006 నుంచి డిసెంబరు 2007 మధ్య కాలంలో తయారు చేసిన క్యాప్టివారకం వాహనాలను సంస్థ వెనక్కి పిలువనుంది. దీనికి తోడు ఇంధన సరఫరా గొట్టంలో లోపం కారణంగా సుమారు 12,604షెవర్లే క్రూజ్‌ రకం వాహనలను కూడా వెనక్కి తెప్పించే యోచనలో సంస్థ ఉంది. సెప్టెంబరు 25, 2009 నుంచి మార్చి 2, 2010 వరకు ఉత్పత్తి చేసిన వాహనాలను సంస్థ తిరిగి వెనక్కి పిలువనుంది. జీఎం దేవూ క్యాప్టివా మోడల్‌ను విన్‌స్ట్రోమ్‌ పేరుతోనూ, క్రూజ్‌ మోడల్‌ను లాసెటీ ప్రిమియర్‌గాను దక్షిణ కొరియా మార్కెట్లో విక్రయిస్తోంది. ఇవే కాకుండా సంస్థ135 దామస్‌ మైక్రోవ్యాన్‌లనూ వెనక్కి రప్పించాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి లోపాలతో విక్రయించిన ఇతర వాహనాలను కూడా వెనక్కి రప్పించనున్నట్లుగా జీఎం దేవూ మోటార్స్‌ సంస్థ అధికారి ఒకరు తెలిపారు.