ద్రవ్యోల్బణం ఎగబాకితే ఆర్‌బీఐ కఠిన చర్యలు!
ముఖ్య గణాంకవేత్త ప్రణబ్ సేన్ సూచన న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ గణాంకాలు మరింత ఎగశాయంటే గనక రిజర్వ్ బ్యాంకు శుక్రవారం చేపట్టిన తన కీలక రుణ రేట్ల సవరణ కన్నా కఠినతరమైన చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కార్యక్రమ అమలు శాఖ కార్యదర్శి ప్రణబ్ సేన్ ఒక వార్తాసంస్థ ప్రతినిధితో ఈ సంగతి చెప్పారు. గత శుక్రవారం ఆర్‌బీఐ హఠాత్తుగా రెపో, రివర్స్ రెపో రేట్లను చెరి పావు శాతం పెంచిన విషయం విదితమే. డిసెంబరులో దాదాపు 20 శాతానికి సమీపంగా వెళ్లిన ఆహార ద్రవ్యోల్బణం ఈ నెల 6తో ముగిసిన వారంలో 16.3 శాతానికి దిగివచ్చినా, మొత్తంమీద ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ అంచనాలను మించి జనవరిలో 8.56 శాతానికి, ఫిబ్రవరిలో 9.89 శాతానికి ఎగసింది. వచ్చే నెల 20న ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షను చేపట్టే అవకాశం ఉంది. అప్పుడు మరోసారి కీలక విధాన రేట్లను పెంచవచ్చని భయపడుతున్నారు. 'ప్రాతిపదిక ప్రభావం (బేస్ ఎఫెక్ట్)తో పాటు ఇంధన ధరల పెంపు వల్ల ఈ నెల అధిక ద్రవ్యోల్బణం నమోదు కావచ్చు.. అది కచ్చితంగా రెండంకెల్లో ఉండవచ్చు, ఏప్రిల్‌లో రేట్ల పెంపుదల దీని పైనే ఆధారపడుతుంది' అని ప్రణబ్ సేన్ అన్నారు. రెపో రేట్ల తాజా పెంపు గిరాకీని తగ్గించాలని చేసింది కాదని ఆయన వాదించారు. సీఆర్‌ఆర్ పెంపు అనంతరం బ్యాంకులు డిపాజిట్, రుణ రేట్లను పెంచివేశాయని, మార్కెట్‌లోని వడ్డీ రేట్లకు అనుగుణంగా ఆర్‌బీఐ ప్రతిస్పందించిందని సేన్ వివరించారు. మార్చి నెల ద్రవ్యోల్బణ గణాంకాలను బట్టే ఆర్‌బీఐ రానున్న పరపతి విధానం రూపురేఖలను ఖరారు చేయవచ్చన్న అభిప్రాయాన్నే ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు కూడా వ్యక్తం చేశారు.